IND vs SL 3rd T20: సూపర్ ఓవర్‌లో గెలిచిన భారత్.. పటిష్ట దశ నుంచి కుప్పకూలిన శ్రీలంక.. వికెట్లు తీసిన సూర్య, రింకూ
IND vs SL 3rd T20: టీ20 సిరీస్‍లో చివరి మ్యాచ్‍లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. గెలిచే దశ నుంచి లంక కుప్పకూలింది. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ జరిగింది. మూడో టీ20లో టీమిండియా విజయం సాధించి లంకను క్లీన్‍స్వీప్ చేసేసింది.
శ్రీలంకతో మూడో టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఓటమి అంచు నుంచి పుంజుకొని గెలిచింది. చివరి ఐదు ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి అదరగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి బౌలింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆఖరి 2 ఓవర్లలో లంక 9 పరుగులు చేయాల్సిన దశలో రింకూ, సూర్య 19, 20 ఓవర్లు వేసి.. కట్టడి చేశారు. లంక గెలుపును అడ్డుకున్నారు. ఇరు జట్ల స్కోర్లు సమం కాగా సూపర్ ఓవర్లో సునాయాసంగా విజయం సాధించింది టీమిండియా. లంక మరోసారి టెన్షన్‍తో చివర్లో వరుసగా వికెట్లు పడగొట్టుకొని పరాజయం పాలైంది. ఆతిథ్య లంకను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసేసింది. పల్లెకెలేలో నేడు (జూలై 30) జరిగిన సిరీస్‍లో ఆఖరిదైన మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్లో గెలిచింది. ఇరు జట్లు 137 పరుగులే చేయటంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో లంక 2 పరుగులే చేయగా.. తొలి బంతికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టి భారత్‍ను గెలిపించాడు. టీ20 జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‍గా సూర్యకుమార్ యాదవ్, హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‍నే భారత్ క్వీన్ స్వీప్ చేసేసింది. ఈ మూడో టీ20 ట్విస్టులతో సాగింది.
గెలిచే దశ నుంచి లంక ఢమాల్
137 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలో శ్రీలంక ధాటిగా ఆడింది. 15 ఓవర్లలో ఓ వికెట్ నష్టానికి 108 పరుగులు చేసి సునాయాసంగా గెలిచేలా అనిపించింది. 9 వికెట్లు చేతిలో ఉండగా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, మరోసారి చివర్లో కుప్పకూలింది. గత రెండు మ్యాచ్‍ల్లోనూ ఆరంభంలో బాగా ఆడి.. చివర్లో టపాటపా వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. మళ్లీ అదే రిపీట్ చేసింది. చివరి ఐదు ఓవర్లలో 29 పరుగులే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది.
లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక (27 బంతుల్లో 26 పరుగులు) కుషాల్ మెండిస్ (41 బంతుల్లో 43 పరుగులు; 3 ఫోర్లు) నిలకడగా నిలకడగా ఆడారు. 9వ ఓవర్లో నిస్సంకను ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు స్పిన్నర్ రవి బిష్ణోయ్. దీంతో 58 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. కుషాల్ పెరెరా (34 బంతుల్లో 46 పరుగులు; 5 ఫోర్లు) దీటుగా ఆడాడు. దీంతో 15 ఓవర్లలో 108 పరుగులతో లంక గెలిచే దశలో నిలిచింది.
మలుపు తిరిగిన మ్యాచ్
కుషాల్ మెండిస్‍ను 16వ ఓవర్లో ఔట్ చేశాడు బిష్ణోయ్. అప్పటికీ లక్ష్యం సులువుగానే కనిపించింది. అయితే, 17వ ఓవర్లో వానిందు హసరంగ (3), కెప్టెన్ చరిత్ అసలంక (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసి లంకలో టెన్షన్ పెంచాడు భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్. ఆ ఓవర్లో రెండు పరుగులే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కుషాల్ పెరీరా కూడా దూకుడు తగ్గించి ఆచితూచి ఆడాడు. అయితే, 18వ ఓవర్లో ఖలీల్ 12 పరుగులు ఇచ్చేశాడు.
అనూహ్యంగా రింకూ, సూర్య
రెండు ఓవర్లలో గెలిచేందుకు లంక 9 పరుగులే చేయాల్సిన దశలో భారత కెప్టెన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రింకూ సింగ్‍ను బౌలింగ్‍కు దింపాడు. అంతర్జాతీయ టీ20ల్లో రింకూ ఇదే తొలి ఓవర్. అయితే అతడు అనూహ్యంగా 3 పరుగులే ఇచ్చి కుషాల్ పెరీరా, రమేశ్ మెండిస్‍ను ఔట్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి వికెట్లు తీసుకున్నాడు. చివరి ఓవర్లో లంక 6 బంతులకు 6 పరుగులు చేయాల్సిన దశలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవే స్వయంగా బౌలింగ్‍కు దిగాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి బౌలింగ్ చేశాడు. అయినా ఐదు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు సూర్య. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. 2 రన్స్ రావటంతో సూపర్ ఓవర్ అనివార్యం అయింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది లంక. భారత బౌలర్లలో సుందర్, బిష్ణోయ్, రింకూ, సూర్య తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు.
సూపర్ ఓవర్ ఇలా..
సూపర్ ఓవర్లో లంక ముందుగా బ్యాటింగ్ చేయగా.. భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేశాడు. ముందుగా వైడ్ వేయగా.. ఆ తర్వాత ఓ రన్ ఇచ్చాడు సుందర్. ఆ తర్వాత కుషాల్ పెరీరా, పాతుమ్ నిస్సంకను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. దీంతో సూపర్ ఓవర్లో 2 పరుగులకే లంక చాపచుట్టేసింది. తొలి బంతికే ఫోర్ కొట్టి టీమిండియాను గెలిపించాడు కెప్టెన్ సూర్య.
భారత్ తక్కువ స్కోరే
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేయగలిగింది. శుభ్‍మన్ గిల్ (37 బంతుల్లో 39 పరుగులు; 3 ఫోర్లు) నిలకడగా ఆడాడు. యశస్వి జైస్వాల్ (10) త్వరగానే ఔట్ కాగా.. సంజూ శాంసన్ (0) వరుసగా రెండో మ్యాచ్‍లో డకౌటై నిరాశపరిచాడు. రింకూ సింగ్ (1), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8), శివమ్ దూబే (13) కూడా త్వరగా పెవిలియన్ చేరారు. అయితే, రియాన్ పరాగ్ (18 బంతుల్లో 26 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (18 బంతుల్లో 25 పరుగులు) రాణించటంతో భారత్‍కు ఆ స్కోరు దక్కింది.
ఇక వన్డే సమరం
భారత్, శ్రీలంక మధ్య తదుపరి వన్డే సిరీస్ జరగనుంది. ఈ మూడు వన్డేల సిరీస్‍లో టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. ఆగస్టు 2వ తేదీన కొలంబోలో తొలి వన్డే జరగనుంది. ఆగస్టు 4న రెండో వన్డే, ఆగస్టు 7న మూడో వన్డే కూడా అక్కడే జరుగుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సహా మరికొందరు ఆటగాళ్లు కొలంబోలో ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. టీ20లు ఆడి వన్డే సిరీస్‍కు ఎంపిక ఆటగాళ్లు కూడా కొలంబో చేరతారు.