IND vs SL 3rd T20: తడబడిన భారత్.. తక్కువ స్కోరుకే పరిమితం.. శాంసన్ వరుసగా రెండో డకౌట్-ind vs sl 3rd t20 sri lanka bowlers restricted india for small total cricket news sl vs ind ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl 3rd T20: తడబడిన భారత్.. తక్కువ స్కోరుకే పరిమితం.. శాంసన్ వరుసగా రెండో డకౌట్

IND vs SL 3rd T20: తడబడిన భారత్.. తక్కువ స్కోరుకే పరిమితం.. శాంసన్ వరుసగా రెండో డకౌట్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 30, 2024 10:00 PM IST

IND vs SL 3rd T20: మూడో టీ20లో బ్యాటింగ్‍లో టీమిండియా తడబడింది. లంక బౌలర్లు సమిష్టిగా రాణించి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో లంక ముందు స్వల్ప లక్ష్యం ఉంది.

IND vs SL 3rd T20: తడబడిన భారత్.. తక్కువ స్కోరుకే పరిమితం.. సంజూకు వరుసగా రెండో డక్
IND vs SL 3rd T20: తడబడిన భారత్.. తక్కువ స్కోరుకే పరిమితం.. సంజూకు వరుసగా రెండో డక్ (AP)

శ్రీలంకతో సిరీస్‍ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్.. మూడో టీ20లో బ్యాటింగ్‍లో విఫలమైంది. మూడు టీ20ల సిరీస్‍లో 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. చివరి మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసి తడబడింది. పల్లెకెలే వేదికగా నేడు (జూలై 30) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. లంక బౌలర్లు సమిష్టిగా రాణించారు. లంక ముందు 138 పరుగుల టార్గెట్ ఉంది. భారత బ్యాటింగ్ ఎలా సాగిందంటే..

టపాటపా వికెట్లు.. నిలిచిన గిల్

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది టీమిండియా. వాన వల్ల కాస్త ఆలస్యంగానే మ్యాచ్ షురూ అయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10 పరుగులు) రెండో ఓవర్ చివరి బంతికి లంక్ స్పిన్నర్ తీక్షణ బౌలింగ్‍లో ఎల్‍బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే సంజూ శాంసన్ (0) ఔటయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్‍లో డకౌట్ అయ్యాడు. రింకూ సింగ్ (1) కూడా అలా వచ్చి ఇలా వెళ్లాడు. దీంతో 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. మరో ఎండ్‍లో ఓపెనర్ శుభ్‍మన్ గిల్ (37 బంతుల్లో 39 పరుగులు; 3 ఫోర్లు) నిలకడగా ఆడాడు. క్రమంగా పరుగులు రాబట్టాడు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. కాసేపు (13) నిలకడగా ఆడిన శివమ్ దూబే 9వ ఓవర్లో ఔటయ్యాడు. దీంతో 48 పరుగులకే 5 వికెట్లతో భారత్ చిక్కుల్లో పడింది.

దూకుడుగా పరాగ్.. రాణించిన సుందర్

గిల్ ఓ వైపు నిలకడగా ఆడుతూ ముందుకు సాగాడు. యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. వికెట్లు ఎక్కువ పడినా హిట్టింగ్ చేశాడు. 18 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు రియాన్. 1 ఫోర్, 2 సిక్స్‌లు కొట్టాడు. గిల్, పరాగ్ ఆరో వికెట్‍కు 54 పరుగుల భాగస్వామ్యం జోడించి టీమిండియాను ఆదుకున్నారు. 16వ ఓవర్లో హసరంగ బౌలింగ్‍లో గిల్ ఔట్ కాగా.. అదే ఓవర్లో రియాన్ పరాగ్ కూడా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (18 బంతుల్లో 25 పరుగులు; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వేగంగా పరుగులు చేసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. రవి బిష్ణోయ్ (8) నాటౌట్‍గా నిలిచాడు. మొత్తంగా 137 పరుగులు చేయగలిగింది భారత్.

శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 4 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర బౌలర్ చమిందు విక్రమసింఘే 4 ఓవర్లలో 17 రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. వనిందు హసరంగ రెండు అశిత ఫెర్నాండో, రమేశ్ మెండిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

శాంసన్ మళ్లీ విఫలం

తుదిజట్టులో వచ్చిన అవకాశాన్ని భారత యంగ్ స్టార్ సంజూ శాంసన్ మరోసారి చేజార్చుకున్నాడు. రెండో టీ20లో ఓపెనింగ్‍కు వచ్చిన శాంసన్.. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. గోల్డెన్ డక్‍గా వెనుదిరిగాడు. నేటి మూడో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్‍కు వచ్చాడు. నాలుగు బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయలేదు శాంసన్. దీంతో వరుసగా రెండోసారి డకౌట్ అయ్యాడు. అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు.

నాలుగు మార్పులు

ఇప్పటికే 2-0తో సిరీస్‍ను పక్కా చేసుకోవడంతో ఈ మూడో టీ20 కోసం తుదిజట్టులో నాలుగు మార్పులు చేసింది టీమిండియా. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్‍కు ఈ మ్యాచ్‍కు రెస్ట్ ఇచ్చింది. శుభ్‍మన్ గిల్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే తుదిజట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ చిన్న ఇబ్బంది వల్ల ఆడలేకపోయిన గిల్ మళ్లీ జట్టులోకి తిరిగొచ్చాడు.

Whats_app_banner