Rohit Sharma on MS Dhoni: ధోనీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై రోహిత్ శర్మ రియాక్షన్.. ఇద్దరిదీ అదే పరిస్థితి అంటూ..
Rohit Sharma on MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ఎమ్మెస్ ధోనీ దిగిపోవడంపై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అతని రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Rohit Sharma on MS Dhoni: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు ఎమ్మెస్ ధోనీ తనదైన స్టైల్లో మరోసారి కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి దిగిపోయాడు. కెప్టెన్స్ ఫొటోషూట్ కు ముందే ధోనీ తన నిర్ణయాన్ని సీఎస్కే సీఈవోకు వెల్లడించాడట. అయితే దీనిపై తాజాగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించడం విశేషం.
ధోనీ నిర్ణయంపై రోహిత్ రియాక్షన్ ఇదీ
ధోనీ కెప్టెన్సీ నుంచి దిగిపోయిన కాసేపటికే రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ చేశాడు. అందులో ఓ ఐపీఎల్ మ్యాచ్ లో తాను ధోనీతో హ్యాండ్ షేక్ చేయడానికి వెళ్తున్న ఫొటోను షేర్ చేశాడు. కింద సింపుల్ గా హ్యాండ్ షేక్ ఎమోజీని ఉంచాడు. 16 ఏళ్ల పాటు ఐపీఎల్లో సీఎస్కేకు కెప్టెన్ గా ఉన్న ధోనీకి శుభాకాంక్షలు చెబుతూనే.. ఈ ఫొటోతో అతడు మరో సందేశాన్ని కూడా ఇచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు.
రోహిత్ శర్మను కూడా గతేడాది ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ గా అతడు కొనసాగుతున్నా.. ముంబై ఫ్రాంఛైజీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఇప్పుడు ధోనీ కూడా తనలాగే ఓ సాధారణ ప్లేయర్ గా ఐపీఎల్ 2024 బరిలోకి దిగుతుండటంతో రోహిత్ ఇలాంటి పోస్ట్ చేసినట్లు భావిస్తున్నారు.
ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కు సీఎస్కే కెప్టెన్సీ అప్పగించిన విషయం తెలిసిందే. 2019 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఉన్న రుతురాజ్.. ధోనీలాంటి వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. ఇది నిజంగా అతనికి పెద్ద సవాలే. గతంలో ఈ పరీక్షలో జడేజా విఫలమయ్యాడు. ఇప్పుడు రుతురాజ్ ఏం చేస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సీఎస్కే వెర్సెస్ ఎంఐ
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ లను ఐపీఎల్ ఎల్ క్లాసికోగా అభివర్ణిస్తారు. ఇక ధోనీ, రోహిత్ కెప్టెన్సీలోనే ఈ రెండు టీమ్స్ ఐదేసిసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే కెప్టెన్లు వీళ్లు. మొదట ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా చేసిన రోహిత్ టాప్ లో నిలవగా.. గతేడాది ధోనీ అతన్ని సమం చేశాడు.
ఇప్పుడీ ఇద్దరి కెప్టెన్సీ శకం ముగిసింది. ఐపీఎల్ 2024లో వీళ్లు తమ జట్లలో సాధారణ ప్లేయర్స్ గా ఆడబోతున్నారు. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ ఇద్దరిలో కనీసం ఒకరు కెప్టెన్ గా లేని తొలి సీజన్ ఇదే కాబోతోంది. ఇక శుక్రవారం (మార్చి 22) నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ లో ఆర్సీబీతో సీఎస్కే తలపడనుంది. ఈ మ్యాచ్ తోనే రుతురాజ్ కెప్టెన్సీ శకం ప్రారంభం కానుంది.
ఇప్పుడు కెప్టెన్సీ నుంచి దిగిపోవడంతో ఈ సీజన్ మొత్తం అయినా ధోనీ ఆడతాడా లేదా అన్నది కూడా సందేహంగా మారింది. ఆ టీమ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ధోనీ ఆడతాడనే ఆశిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.