Rohit Sharma on Dhoni: ధోనీ, దినేష్ కార్తీక్ ఇద్దరూ మాతో పాటు అమెరికా వస్తున్నారు: రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rohit Sharma on Dhoni: టీ20 వరల్డ్ కప్ టీమ్ లో ధోనీ, కార్తీక్ లు ఉంటారా అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరంగా స్పందించాడు. ఈ ఇద్దరూ తమతోపాటు అమెరికా వస్తున్నట్లు చెప్పడం గమనార్హం.
Rohit Sharma on Dhoni: ఐపీఎల్ 2024 ముగియగానే టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా ఎంపికపై ఎక్కడలేని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ విషయంలో అయినా తనదైన స్టైల్లో చమత్కరించే కెప్టెన్ రోహిత్ శర్మ.. జట్టులో దినేష్ కార్తీక్ కు చోటు ఇవ్వడంపైనా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కార్తీక్, ధోనీ ఇద్దరూ మెరుపులు మెరిపిస్తుండటంపై రోహిత్ స్పందించాడు.
ఇద్దరూ అమెరికా వస్తున్నారు: రోహిత్ శర్మ
ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దీంతో అతని కంటే కార్తీక్ ను మళ్లీ జట్టులోకి రావాల్సిందిగా కోరడం సులువైన పని అని రోహిత్ ఈ సందర్భంగా అన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ లతో క్లబ్ ప్రైరీ ఫైర్ అనే యూట్యూబ్ షోలో రోహిత్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఈ ఇద్దరు వెటరన్ వికెట్ కీపర్ల ఆటతీరుపై మాట్లాడాడు. ధోనీ కూడా అమెరికా వస్తున్నాడని, అయితే అతడు గోల్ఫ్ ఆడటానికి వస్తున్నట్లు చెప్పడం విశేషం. "ఇద్దరి బ్యాటింగ్ చాలా నచ్చింది. డీకే రెండు రోజుల కిందట తర్వాత ధోనీ కూడా నాలుగు బంతులే ఆడి మొత్తం మార్చేశాడు. ధోనీని కన్విన్స్ చేయడం కష్టమే అయినా అతడు అమెరికాకు మరో పని మీద వస్తున్నాడు. అతడు గోల్ఫ్ ఆడనున్నాడు. డీకేను కన్విన్స్ చేయడం సులువనుకుంటున్నాను" అని రోహిత్ అన్నాడు.
ఈసారి టీ20 వరల్డ్ కప్ కరీబియన్ దీవులతోపాటు అమెరికాలోనూ జరగనున్న నేపథ్యంలో రోహిత్ ఈ కామెంట్స్ చేశాడు.
ఇద్దరికీ చివరి ఐపీఎల్
ధోనీ, కార్తీక్ లకు ఇదే చివరి ఐపీఎల్ కానుంది. 42 ఏళ్ల ధోనీ రిటైర్ కాబోతున్నట్లు మూడు సీజన్లుగా వార్తలు వస్తున్నా.. అతడు ఆడుతూనే ఉన్నాడు. అయితే ఇదే చివరి సీజన్ కావచ్చన్న వార్తలు ఈసారీ వస్తున్నాయి. అటు కార్తీక్ వయసు కూడా 39 ఏళ్లు. దీంతో అతనికిదే చివరి ఐపీఎల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ మధ్యే ముంబై ఇండియన్స్ పై అతడు ఆడుతున్న సమయంలో రోహిత్ అతన్ని చూసి జోక్ వేశాడు.
"వెల్ డన్ డీకే.. టీ20 వరల్డ్ కప్ లో చోటు కోసం ఆడుతున్నాడు. అతని దృష్టంతా వరల్డ్ కప్ పైనే ఉంది" అని వెనుక నుంచి రోహిత్ అనడంతో కార్తీక్ నవ్వుతూ కనిపించాడు. అటు కార్తీక్ కూడా వరల్డ్ కప్ జట్టులో స్థానంపై స్పందించాడు. తనకు అసలు ఛాన్సే లేదని, వికెట్ కీపర్ల జాబితాలో తాను 8వ స్థానంలో ఉంటానని అతడు అన్నాడు.
మరోవైపు టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే 10 మంది ప్లేయర్స్ కన్ఫమ్ అయినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అందులో రిషబ్ పంత్ స్థానం కూడా ఖాయమైంది. మరో వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మల మధ్య పోటీ నెలకొంది.