Rahul Dravid on Rohit Sharma: రోహిత్, కోహ్లిలకు అందుకే రెస్ట్ ఇచ్చాం.. అశ్విన్‌ను ఎంపిక చేయడం వెనుక కారణం ఇదే: ద్రవిడ్
Rahul Dravid on Rohit Sharma: రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇవ్వడంతోపాటు చాలా రోజుల తర్వాత అశ్విన్ ను వన్డేలకు ఎంపిక చేయడం వెనుక కారణాలను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరించాడు.
Rahul Dravid on Rohit Sharma: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి రెండు వన్డేలకు విశ్రాంతినిచ్చిన విషయం తెలుసు కదా. దీనిపై తాజాగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. శుక్రవారం (సెప్టెంబర్ 22) తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ద్రవిడ్.. ఈ ఇద్దరికీ రెస్ట్ ఇవ్వడం, అశ్విన్ ను తిరిగి జట్టులోకి తీసుకోవడం వెనుక కారణాన్ని వివరించాడు.
"వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి శారీరకంగా, మానసికంగా ఫ్రెష్ గా ఉండాలని టీమ్ భావించింది. అందుకే తొలి రెండు వన్డేలకు విశ్రాంతినిచ్చాం" అని ద్రవిడ్ వెల్లడించాడు. ఈ ఇద్దరూ మూడో వన్డేకు తిరిగి జట్టులోకి రానున్నారు. ఆ మ్యాచ్ లో టీమిండియా తమ పూర్తి వరల్డ్ కప్ టీమ్ తో ఆడనుంది. 15 మందితోపాటు అదనంగా మరో ఇద్దరిని కూడా ఆ మ్యాచ్ కోసం ఎంపిక చేశారు.
అశ్విన్‌ను ఎందుకు ఎంపిక చేశామంటే..
ఇక సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సుమారు 20 నెలల తర్వాత తిరిగి వన్డే టీమ్ లోకి రావడం, అది కూడా వరల్డ్ కప్ కంటే ముందు సడెన్ గా తీసుకోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపైనా ద్రవిడ్ స్పందించాడు. "అశ్విన్ అనుభవం మాకు సాయపడుతుంది. 8వ స్థానంలో బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఏదైనా గాయం సమస్య ఎదురైతే అశ్విన్ ను తీసుకోవాలని ముందు నుంచే ప్లాన్ చేస్తున్నాం" అని ద్రవిడ్ చెప్పడం విశేషం.
ఇక సూర్యకుమార్ ను కూడా ద్రవిడ్ వెనకేసుకొచ్చాడు. "సూర్యకుమార్ యాదవ్ కు మేము పూర్తి మద్దతిస్తున్నాం. వన్డేల్లోనూ అతడు రాణిస్తాడు. తొలి రెండు వన్డేల్లో అతనికి ఆ అవకాశం లభించనుంది" అని ద్రవిడ్ చెప్పాడు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మొహాలీలో తొలి వన్డే జరగనుంది. ఆసియా కప్ గెలిచిన ఊపులో ఉన్న టీమిండియా కీలకమైన నలుగురు ప్లేయర్స్ లేకుండా ఆస్ట్రేలియాను తొలి రెండు వన్డేల్లో ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.