Rohit Sharma: రాహుల్ ద్రవిడ్‍కు అలా ఉంటే అసలు నచ్చదు: కెప్టెన్ రోహిత్ శర్మ-rahul dravid does not like any communication gap says rohit sharma ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: రాహుల్ ద్రవిడ్‍కు అలా ఉంటే అసలు నచ్చదు: కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma: రాహుల్ ద్రవిడ్‍కు అలా ఉంటే అసలు నచ్చదు: కెప్టెన్ రోహిత్ శర్మ

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 08, 2023 08:13 PM IST

Rohit Sharma: హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించిన విషయాలను కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఆయనతో తాను చాలా విషయాలను చర్చిస్తానని చెప్పాడు. అలాగే ద్రవిడ్‍కు నచ్చిన విషయాన్ని కూడా చెప్పాడు. ఆ వివరాలివే.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (ANI )

Rohit Sharma: టీమిండియా ప్రస్తుతం ఆసియాకప్ 2023 టోర్నీ ఆడుతోంది. ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ మధ్య భారత్‍లో జరగనున్న వన్డే ప్రపంచకప్‍నకు సన్నాహకంగా ఈ టోర్నీని భావిస్తోంది. అందుకే ఆసియాకప్‍ను మరింత సీరియస్‍గా తీసుకుంది భారత జట్టు. ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్‍తో ఈనెల 10వ తేదీన తలపడనుంది టీమిండియా. ఈ తరుణంలో హెడ్‍కోచ్ రాహుల్ ద్రవిడ్‍తో తన అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‍గా వచ్చాకే పూర్తిస్థాయి అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‍గా బాధ్యతలు హిట్‍మ్యాన్ చేతికి వచ్చాయి. ద్రవిడ్ గురించి రోహిత్ ఏం చెప్పాడంటే..

హెడ్‍కోచ్ రాహుల్ ద్రవిడ్‍పై ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ. క్రికెటర్ కన్నా ముందు వ్యక్తిగా రాహుల్ ద్రవిడ్‍పై తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పాడు. “ఆయన వ్యవహరించే విధానం పట్ల వ్యక్తిగా ముందు ఆయన (రాహుల్ ద్రవిడ్)పై నాకు అపార గౌరవం ఉంది. ఆ తర్వాత క్రికెటర్‌గా గౌరవం ఉంది. ఎందుకంటే మీరు వ్యక్తిగా ముందు మంచిగా ఉండాలి. ఆ తర్వాత క్రికెటర్, ఫుట్‍బాలర్, డాక్టర్ ఇంకేదైనా” అని విమల్ కుమార్ యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ చెప్పాడు. వ్యక్తిగా రాహుల్ ద్రవిడ్ చాలా గొప్పవారని హిట్‍మ్యాన్ అన్నాడు.

రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోనే రోహిత్ శర్మ తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు అతడు హెడ్‍కోచ్‍గా ఉన్న సమయంలో కెప్టెన్సీ చేస్తున్నాడు. కాగా, రాహుల్ ద్రవిడ్‍కు ఏం నచ్చదో కూడా రోహిత్ చెప్పాడు. “ఆయన సారథ్యంలోనే నేను అరంగేట్రం చేశా. అయితే ఆయన కెప్టెన్సీలో ఎక్కువ కాలం ఆడలేదు. ఏ ఆటగాళ్ల మధ్య అయినా.. సపోర్టింగ్ స్టాఫ్ మధ్య అయినా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం ఆయనకు అసలు నచ్చదు” అని రోహిత్ చెప్పాడు. ప్లేయర్లు, కోచింగ్ సిబ్బంది మధ్య ఎలాంటి సమాచార లోపం ఉండడాన్ని ద్రవిడ్ ఇష్టపడరని హిట్‍మ్యాన్ స్పష్టం చేశాడు.

ఆటగాళ్ల గురించి, వ్యూహాల గురించి రాహుల్ ద్రవిడ్‍తో తాను అన్ని విషయాలు చర్చిస్తానని రోహిత్ శర్మ అన్నాడు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో తనకు విభేదాలు ఉన్నాయన్న వాదనలను మరోసారి కొట్టిపారేశాడు రోహిత్. మైదానంలో, మైదానం బయట తాము చాలా విషయాల గురించి మాట్లాడుకుంటామని అన్నాడు. ప్రతీ సిరీస్ ముందు కూడా ఇద్దరం చర్చించుకుంటామని రోహిత్ చెప్పాడు.

Whats_app_banner