Pakistan Team: పాకిస్థాన్ ఆటగాళ్లకు 5 నెలల నుంచి వేతనాలు లేవా?: షాకింగ్ విషయాలు చెప్పిన మాజీ కెప్టెన్
Pakistan Team: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. పాక్ ఆటగాళ్లకు వేతనాలు అందడం లేదని చెప్పారు. మరిన్ని విషయాలను పేర్కొన్నారు.
Pakistan Team: వన్డే ప్రపంచకప్‍లో పాకిస్థాన్ జట్టు కష్టాల్లో ఉంది. వరుసగా నాలుగు మ్యాచ్‍లో ఓడి విమర్శల పాలవుతోంది. ఆ జట్టు సెమీఫైనల్ చేరడం దాదాపు అసాధ్యంగా మారింది. భారత్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‍లు ఆడిన పాకిస్థాన్.. నాలుగింట ఓడింది. గ్రూప్ స్టేజీలో తన మిగిలిన మూడు మ్యాచ్‍లు గెలిచినా.. పాక్ సెమీస్ చేరడం కష్టమే. అంచనాలను అందుకోలేకపోతున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సహా ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ షాకింగ్ విషయాలను వెల్లడించాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టెక్ట్స్ మెసేజ్‍లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఉన్నతాధికారులు స్పందించడం లేదని రషీద్ లతీఫ్ చెప్పాడు. పాక్ ఆటగాళ్లకు ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో లతీఫ్ ఈ విషయాలను వెల్లడించాడు.
“చైర్మన్ (పీసీబీ)కు బాబర్ ఆజమ్ మెసేజ్‍లు చేస్తున్నాడు. ఆయన స్పందించడం లేదు. సల్మాన్ నజీర్ (పీసీబీ సీఓఓ)కు కూడా మెసేజ్ చేశాడు. అతడి నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు. కెప్టెన్ మెసేజ్‍లకు స్పందించకపోవడం ఏంటి? సెంట్రల్ కాంట్రాక్టులను మళ్లీ చేస్తామని చెబుతూ ప్రెస్ రిలీజ్ ఇవ్వనున్నారా. ఐదు నెలలుగా ఆటగాళ్లకు వేతనాలు అందడం లేదు. ఇక ఆటగాళ్లు మీ మాట వినాలా?. వేతనాలు లేకుండా ప్లేయర్లు ఎలా ఆడతారు?” అని పీటీవీ స్పోర్ట్స్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతీఫ్ అన్నాడు. ఈ విషయాన్ని పాకిస్థానీ మీడియా కప్పిపుచ్చుతోందని, తాను నిజం చెబుతున్నానని లతీఫ్ చెప్పాడు.
పీసీబీ నుంచి సరైన మద్దతు లేని కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నారని కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో లతీఫ్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అలాగే జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటామని పీసీబీ ఇటీవల ప్రకటన చేసింది. దీంతో బాబర్ ఆజమ్‍ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి.
వన్డే ప్రపంచకప్‍ను పాకిస్థాన్ బాగానే ఆరంభించింది. తొలి రెండు మ్యాచ్‍ల్లో నెదర్లాండ్స్, శ్రీలంకపై గెలిచింది. అయితే, ఆ తర్వాత భారత్ చేతిలో భారీ ఓటమిని పాక్ మూటగట్టుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో బాబర్ ఆజమ్ సేన ఓటమి పాలైంది. ఇక అఫ్గానిస్థాన్ చేతిలో పాకిస్థాన్‍కు పరాభవం ఎదురైంది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‍లో ఒక వికెట్ తేడాతో ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి పాలైంది. ఈ ప్రపంచకప్‍లో తదుపరి బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‍తో పాకిస్థాన్ ఆడనుంది. ఈ మూడు గెలిచినా.. ఆ జట్టు సెమీస్ చేరడం చాలా కష్టం.
సంబంధిత కథనం