SA vs PAK: పాకిస్థాన్‍కు వరుసగా నాలుగో ఓటమి.. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా గెలుపు-cricket news sa vs pak pakistan defeated by south africa in world cup 2023 and almost out from semis race ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sa Vs Pak: పాకిస్థాన్‍కు వరుసగా నాలుగో ఓటమి.. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా గెలుపు

SA vs PAK: పాకిస్థాన్‍కు వరుసగా నాలుగో ఓటమి.. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా గెలుపు

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 27, 2023 11:38 PM IST

SA vs PAK ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో పాకిస్థాన్‍కు మరో పరాజయం ఎదురైంది. దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడిపోయింది. దీంతో ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి పాక్ దాదాపు ఔటైపోయినట్టే భావించవచ్చు.

SA vs PAK: పాకిస్థాన్‍కు వరుసగా నాలుగో ఓటమి.. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా గెలుపు
SA vs PAK: పాకిస్థాన్‍కు వరుసగా నాలుగో ఓటమి.. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా గెలుపు (PTI)

SA vs PAK ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్‍కు మరో ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో చిత్తై.. టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రపంచకప్‍లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు (అక్టోబర్ 27) జరిగిన మ్యాచ్‍లో దక్షిణాఫ్రికా చేతిలో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్ ఓడిపోయింది.

271 పరుగుల లక్ష్యాన్ని 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది దక్షిణాఫ్రికా. ఐడెన్ మార్క్‌రమ్ (91) అదరగొట్టడంతో ఓ దశలో దక్షిణాఫ్రికా సులువుగా గెలిచేలా కనిపించింది. అయితే, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి టెన్షన్‍లో పడింది. చివర్లో కేశవ్ మహారాజ్ (7 నాటౌట్) విలువైన పరుగులు చేసి సఫారీ జట్టును గెలిపించాడు. దీంతో ఒక వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. పాకిస్థాన్ బౌలర్లలో షహిన్ షా అఫ్రిది మూడు, హరిస్ రవూఫ్, మహమ్మద్ వాసిమ్, ఉసామా మిర్ చెరో రెండు వికెట్లు తీశారు. చివరి వరకు పోరాడి ఓడింది పాక్. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (52) అర్ధ శతకాలు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ తబ్రైజ్ షంసి నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మార్కో జాన్సెన్ మూడు వికెట్లతో రాణించాడు.

సెమీస్ ఆశలు దాదాపు గల్లంతు!

ప్రపంచకప్ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్‍లు ఓడిపోవటం పాకిస్థాన్‍కు ఇదే తొలిసారి. ఈ ప్రపంచకప్‍లో తొలి రెండు మ్యాచ్‍లు గెలిచిన పాక్.. వరుసగా నాలుగు మ్యాచ్‍ల్లో పరాజయం చెందింది. దీంతో సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్ దాదాపు ఔట్ అయినట్టే. ఆరు మ్యాచ్‍ల్లో నాలుగింట ఓడి ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పాక్ ఉంది. ఇంకా గ్రూప్ స్టేజీలో బాబర్ ఆజమ్ సేన మూడు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‍లు గెలిచినా.. పాకిస్థాన్ సెమీస్‍కు చేరడం దాదాపు అసాధ్యమే.

ఇక, ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్‍ను దక్షిణాఫ్రికా ఓడించడం 23 ఏళ్లలో ఇదే తొలిసారి. మరోవైపు.. ఈ గెలుపుతో 10 పాయింట్లతో ప్రస్తుతం ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా టాప్‍కు చేరింది.

ఈ మ్యాచ్‍లో 271 పరుగుల లక్ష్యఛేదనలో ఓ దశలో దక్షిణాఫ్రికా 206 పరుగులకు 4 వికెట్లే కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచింది. ఐడెన్ మార్క్‌రమ్ అర్ధ శకతంతో జోరు మీదున్నాడు. అయితే, ఆ తర్వాత క్లాసెన్ (12), డేవిడ్ మిల్లర్ (29), మార్కో జాన్సెన్ (20), కోట్జీ (10) సహా మార్క్‌రమ్ కూడా ఔటవడంతో 250 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా ఓడిపోతుందేమోనన్న స్థితికి వచ్చింది. ఆ సమయంలో కేశవ్ మహారాజ్ (7 నాటౌట్) ఉత్కంఠను తట్టుకొని.. లుంగీ ఎంగ్డీ (4), తబ్రైజ్ షంసీ (4 నాటౌట్) సాయంతో దక్షిణాఫ్రికాను గెలిపించాడు. ఓ దశలో అంపైర్ కాల్ రూపంలో పాకిస్థాన్‍ను దురదృష్టం వెంటాడింది.

అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 రన్స్ చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్, యువ స్టార్ సౌద్ షకీల్ అర్ధ శతకాలు చేయగా.. షాదాబ్ ఖాన్ (43) రాణించాడు. అయితే, చివరి వరకు ఎవరూ నిలువలేకపోయారు.

Whats_app_banner