SA vs PAK: షంసీ సూపర్ బౌలింగ్.. మోస్తరు స్కోరుకే పాకిస్థాన్ ఆలౌట్
SA vs PAK ICC ODI World Cup 2023: దక్షిణాఫ్రికాతో మ్యాచ్‍లో పాకిస్థాన్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నాలుగు వికెట్లతో సఫారీ స్పిన్నర్ తబ్రైజ్ షంసీ రాణించాడు. వివరాలివే..
SA vs PAK ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో గత మ్యాచ్‍లో అఫ్గానిస్థాన్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న పాకిస్థాన్.. నేడు (అక్టోబర్ 27) దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ మోస్తరు స్కోరే చేయగలిగింది. వరల్డ్ కప్‍లో భాగంగా చెన్నై వేదికగా నేడు దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (50), సౌద్ షకీల్ (52) అర్ధ శకతాలు చేయగా.. షాదాబ్ ఖాన్ (43) రాణించాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షంసీ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి పాక్‍ను కట్టడి చేశాడు. మార్కో జాన్సెన్‍కు మూడు, గెలార్డ్ కోట్జీకి రెండు, లుంగీ ఎంగ్డీకి ఓ వికెట్ దక్కాయి. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ గెలవాలంటే 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి.
టాస్ గెలిచి బ్యాటింగ్‍కు దిగిన పాకిస్థాన్‍కు మంచి ఆరంభం దక్కలేదు. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (9), ఇమాముల్ హక్ (12)ను దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ ఔట్ చేశాడు. దీంతో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది పాకిస్థాన్. ఆ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ (31) నిలకడగా ఆడారు. భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో రిజ్వాన్ 16వ ఓవర్లో ఔటయ్యాడు. ఇఫ్తికార్ అహ్మద్ (21)తో పాటు 64 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆజమ్‍ను దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షంసీ వెంటవెంటనే ఔట్ చేశాడు. దీంతో 141 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది పాక్.
అయితే, సౌద్ షకీల్ అర్ధ శకతం చేసి పాక్‍ను ఆదుకున్నాడు. దీటుగా ఆడి 50 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరాడు. అతడిని కూడా 43వ ఓవర్లో ఔట్ చేశాడు షంసీ. షాదాబ్ ఖాన్ కూడా రాణించాడు. చివర్లో మహమ్మద్ నవాజ్ (24) కాసేపు నిలిచినా మిగిలిన వారు ఎక్కువ ప్రభావం చూపలేదు. దీంతో 46.4 ఓవర్లలోనే 270 పరుగులకు చాపచుట్టేసింది పాక్.