Pakistan Coach: ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టు ముంగిట పాకిస్థాన్ ప్లేయర్లకి చెంపదెబ్బ కొట్టినట్లు సంస్కారం నేర్పిన హెడ్ కోచ్
Pakistan vs England 3rd Test: పాకిస్థాన్ ప్లేయర్ల బిహేవియర్‌పై గత కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మైదానంలో వాళ్లు చేసే అతి విమర్శలకి తావిస్తుండగా.. మ్యాచ్‌లు లేనప్పుడు కూడా తరచూ వివాదాల్లోనే ఉంటారు.
పాకిస్థాన్ చాలా చిత్రమైన జట్టు. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్ టీమ్ గెలిచే మ్యాచ్‌లను ఓడిపోగలదు.. ఓటమి తప్పదు అనుకున్న మ్యాచ్‌ల్లోనూ గెలవగలదు. అసలు సమస్య అంతా ఆ జట్టు ఆటగాళ్ల మానసిక స్థితిలోనే ఉంది. దాంతో ఆట కంటే ఇప్పుడు ఆటగాళ్ల మానసిక స్థితిని సరిచేయాలని పాకిస్థాన్ హెడ్ కోచ్ జాసన్ గెలస్పీ భావిస్తున్నాడు.
సిరీస్ విజేతని నిర్ణయించే మ్యాచ్
పాకిస్థాన్ గడ్డపై ప్రస్తుతం ఇంగ్లాండ్ టీమ్ పర్యటిస్తుండగా.. మూడు టెస్టుల సిరీస్ 1-1తో సిరీస్ ఆసక్తికరంగా మారింది. ఇక సిరీస్‌లో ఆఖరిదైన మూడో టెస్టు మ్యాచ్ గురువారం (అక్టోబర్ 24) నుంచి రావల్పిండి వేదికగా ప్రారంభంకానుంది.
ఈ మ్యాచ్ కోసం స్టేడియంలో సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న పాకిస్థాన్ ఆటగాళ్లు సిల్లీగా తాము తాగేసిన వాటర్ బాటిళ్లను ప్రాక్టీస్ సెషన్స్ దగ్గర విచ్చలవిడిగా విసిరేశారు. వాస్తవానికి అక్కడ డస్ట్ బిన్ కూడా ఉంది. కానీ.. అందులో వేయకుండా స్టేడియంలో ఎక్కడపడితే అక్కడ విసిరేశారు.
కోచ్ కోప్పడలేదు.. కానీ బుద్ధి చెప్పాడు
ప్రాక్టీస్ సమయంలో పాక్ ఆటగాళ్లు చేసిన ఆ చెత్త పనిని హెడ్ కోచ్ జాసన్ గిలెస్పీ సహించలేకపోయాడు. ఆ బాటిళ్లను స్వయంగా శుభ్రపరిచే బాధ్యత తీసుకున్నాడు. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లు అలా చూస్తున్నారు తప్ప.. కనీసం తాము చేసిన తప్పుని తెలుసుకోలేకపోయారు. అయితే.. కోచ్ అలా వాటర్ బాటిళ్లను తీసుకుని డస్ట్ బిన్‌లో వేస్తున్నప్పుడు వాళ్లకి తమ తప్పు అర్థమైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో పాక్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిగ్గు తెచ్చుకోండి
ఈ వీడియోపై ఓ యూజర్ 'ఎంత సిగ్గుచేటు' అని కామెంట్ చేయగా.. మరొక నెటిజన్ ‘పాక్ ఆటగాళ్లు బాటిళ్లను విసిరేస్తే.. కోచ్ తీసుకెళ్లాల్సి వచ్చింది. కనీసం పాక్ ఆటగాళ్లు ఇకనైనా సిగ్గు తెచ్చుకుంటారులే’’ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. ‘పాక్ ఆటగాళ్లను వెనక్కి పిలిపించి వారితో శుభ్రం చేయించి ఉండాలి’ అని సూచించారు. మొత్తానికి కోచ్ వ్యవహారం ఇప్పుడు పాక్ క్రికెట్‌లో దుమారం రేపుతోంది. కోచ్ ఆ బాటిళ్లను తీసుకుని డస్ట్ బిన్‌లో వేస్తున్న సమయంలో పాక్ ఆటగాళ్లు కొంత మంది సిగ్గుతో తలదించుకుంటూ కనిపించారు.
ఎట్టకేలకి గెలుపు రుచి
2024 ఏప్రిల్‌లో పాక్ హెడ్ కోచ్‌గా జాసన్ గెలస్పీ నియమితులయ్యాడు. కానీ.. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టు మరింత గాడి తప్పింది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో అదీ సొంతగడ్డపై 0-2 తేడాతో వైట్‌వాష్‌కి గురైంది. ఇంగ్లాండ్‌తో ఇటీవల జరిగిన తొలి టెస్టులో 500పైచిలుకు స్కోరు చేసినా ఓటమిపాలైంది.
కానీ.. గత వారం రెండో టెస్టులో పుంజుకున్న పాక్.. ఇంగ్లాండ్‌ను 152 పరుగుల తేడాతో ఓడించింది. హెడ్ కోచ్‌గా గిలెస్పీకి ఇదే తొలి విజయం కాగా, టెస్టు కెప్టెన్‌గా మసూద్‌కి కూడా ఇదే తొలి విజయం. అంతక ముందు మసూద్ సారథ్యంలో పాక్ వరుసగా ఆరు టెస్టుల్లో ఓడిపోయింది. ఆఖరి టెస్టులో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని పాకిస్థాన్ ఉవ్విళ్లూరుతోంది.