PAK vs ENG 1st Test: ఇంగ్లాండ్ దెబ్బకి తొలి టెస్టులో సొంతగడ్డపై పాక్ కుదేలు.. 147 ఏళ్లలో వరస్ట్ రికార్డ్!
Pakistan vs England 1st Test Highlights: అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ టీమ్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డ్‌ను నమోదు చేసింది. ఇంగ్లాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 500పైచిలుకు స్కోరు చేసిన పాక్.. ఆఖరికి ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.
ఇంగ్లాండ్ దెబ్బకి పాకిస్థాన్ టీమ్ సొంతగడ్డపైనే తొలి టెస్టులో కుదేలైంది. ముల్తాన్ వేదికగా గత సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి నాలుగు రోజులూ ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల వరద పారించారు. కానీ.. ఆఖరికి ఇంగ్లాండ్ పైచేయి సాధించి ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే కాదు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్ అత్యంత చెత్త రికార్డ్‌ను నమోదు చేసింది.
పాక్ దంచితే.. ఇంగ్లాండ్ అంతకుమించి
మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కి అనుకూలించిన పిచ్‌పై పాకిస్థాన్ బ్యాటర్లు షఫీక్ (102), కెప్టెన్ మసూద్ (151), ఇస్లాం (104) సెంచరీలు బాదారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లతో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు.
పాకిస్థాన్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేయడంతో.. ఇంగ్లాండ్ బ్యాక్ స్టెప్ వేస్తుందని అంతా ఊహించారు. కానీ.. బజ్ బాల్‌కి బాగా అలవాటుపడిన ఇంగ్లాండ్ టీమ్.. రికార్డుల్ని తిరగరాస్తూ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 823 పరుగులు చేసేసింది. ఆ జట్టులో మాజీ కెప్టెన్ జో రూట్ (262) డబుల్ సెంచరీ బాదగా.. హారీ బ్రూక్ (317) ట్రిఫుల్ సెంచరీ నమోదు చేశాడు. దెబ్బకి..పాకిస్థాన్ టీమ్‌లో ఏడుగురు బౌలింగ్ చేయగా ఏకంగా ఆరుగురు కనీసం 100 పరుగులు చొప్పున సమర్పించుకున్నారు. ఇంగ్లాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌ను 823/7తో డిక్లేర్ చేసింది.
పాక్ ఓటమిని శాసించిన లీచ్
267 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన పాకిస్థాన్ టీమ్.. మ్యాచ్‌లో ఐదోరోజైన శుక్రవారం 220 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో ఇంగ్లాండ్ టీమ్ రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం కూడా లేకపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మరోసారి జాక్ లీచ్ 4 వికెట్లతో సత్తాచాటాడు.
147 ఏళ్లలో వరస్ట్ రికార్డ్
1877 నుంచి టెస్టులు ఆడుతుండగా.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 500పైచిలుకు స్కోరు చేసినా.. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఇదే మొట్టమొదటిసారి. ఈ చెత్త రికార్డ్ పాకిస్థాన్ పేరిట నమోదైంది. అలానే పాకిస్థాన్ టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 500పైచిలుకు స్కోరు చేసినా టెస్టు మ్యాచ్‌ని చేజార్చుకోవడం ఇది ఐదోసారి. ఇన్ని సార్లు ఏ జట్టు కూడా 500పైన స్కోరు చేసి ఓడిపోలేదు. రికార్డ్‌లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడు సార్లు ఇలా ఓడిపోయింది.