Team India Trolls: టీమిండియా 46కే ఆలౌట్‌పై ఆస్ట్రేలియా ట్రోల్, గట్టిగా చురకలు అంటిస్తున్న నెటిజన్లు-cricket australia trolls india lowest home test total ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India Trolls: టీమిండియా 46కే ఆలౌట్‌పై ఆస్ట్రేలియా ట్రోల్, గట్టిగా చురకలు అంటిస్తున్న నెటిజన్లు

Team India Trolls: టీమిండియా 46కే ఆలౌట్‌పై ఆస్ట్రేలియా ట్రోల్, గట్టిగా చురకలు అంటిస్తున్న నెటిజన్లు

Galeti Rajendra HT Telugu

India 46 All Out: భారత్ జట్టుని ట్రోల్ చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. నాలుగేళ్ల క్రితం భారత్ జట్టుకి ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేస్తూ ఆస్ట్రేలియా వెటకారంగా పోస్ట్ పెట్టింది. టీమిండియా ఫ్యాన్స్ గట్టిగానేకౌంటర్స్ ఇస్తున్నారు.

భారత్ జట్టుని ఆస్ట్రేలియా ట్రోల్ (AP)

న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు 46 పరుగులకే ఆలౌట్ అవ్వడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ట్రోల్ చేస్తూ చేసిన పోస్ట్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.

2020లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన భారత్ జట్టు అక్కడ ఆడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌ను మరోసారి గుర్తు చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఎగతాళిగా పోస్ట్ పెట్టింది.

పాత గాయాన్ని మళ్లీ గుర్తుచేసిన ఆసీస్

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఎవరూ ఊహించని విధంగా వికెట్లు సమర్పించుకుంది. కివీస్ టీమ్‌లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు మాత్రమే బౌలింగ్ చేయగా.. 31.2 ఓవర్లలోనే భారత్ జట్టు కుప్పకూలిపోయింది.

టీమ్‌లో రిషబ్ పంత్ చేసిన 20 పరుగులే టాప్ స్కోరు. అలానే ఏకంగా 9 మంది బ్యాటర్లు కనీసం డబుల్ డిజిట్ స్కోరుని కూడా అందుకోలేకపోయారు. ఇందులో ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు.

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత చేదు అనుభవం మిగిలిన ఇన్నింగ్స్‌గా ఇది నిలిచిపోయింది. దాంతో ‘‘ఆలౌట్ 46కి కొత్త ఆలౌట్ 36’’ అంటూ భారత్ జట్టుని క్రికెట్ ఆస్ట్రేలియా ఎగతాళి చేస్తూ నాలుగేళ్ల క్రితం అడిలైడ్ టెస్టులో టీమిండియా వికెట్లు కోల్పోయిన తీరుకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.

ఆస్ట్రేలియా మర్చిపోయావా?

ఆ అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటై.. 8 వికెట్ల తేడాతో ఓడిన భారత్ జట్టు.. రోజుల వ్యవధిలోనే వరుసగా మెల్‌బోర్న్, బ్రిస్బేన్ టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. అలానే సిడ్నీ టెస్టుని డ్రాగా ముగించింది. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌ని 2-1తో కూడా కైవసం చేసుకుంది.

మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాకి దశాబ్ధాలుగా కంచుకోటగా ఉన్న బ్రిస్బేన్‌ (గబ్బా) రికార్డులను బద్ధలుకొడుతూ 3 వికెట్ల తేడాతో అక్కడ గెలుపు జెండాను భారత్ ఎగురవేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఆ జట్టుని టీమిండియాలా చిత్తు చేసిన టీమ్ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియాకి భారత్ అభిమానులు చురకలు అంటిస్తున్నారు.

టీమిండియాపై కుట్ర

భారత్ జట్టు త్వరలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా గడ్డపై పర్యటించనుంది. దాంతో టీమిండియా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ వెటకారపు పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ కంగారూలతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ జట్టు ఆడనుంది.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 46 పరుగులకే ఆలౌటైన భారత్ జట్టు.. బౌలింగ్‌లో కూడా అంచనాల్ని అందుకోలేకపోతోంది. కివీస్ పేసర్లు చెలరేగిన ఆ పిచ్‌పై వికెట్లు తీసేందుకు భారత్ బౌలర్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలోనే 7 వికెట్ల నష్టానికి 303 పరుగులతో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ జట్టు కంటే 257 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో న్యూజిలాండ్ ఉంది.