WPL 2024: హర్మన్‍ హిట్టింగ్ ధమాకా.. థ్రిల్లింగ్ మ్యాచ్‍లో ముంబై గెలుపు.. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై-mi vs gt wpl 2024 mumbai indians won against gujarat qualify knockouts as harmanpreet kaur super innings ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2024: హర్మన్‍ హిట్టింగ్ ధమాకా.. థ్రిల్లింగ్ మ్యాచ్‍లో ముంబై గెలుపు.. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై

WPL 2024: హర్మన్‍ హిట్టింగ్ ధమాకా.. థ్రిల్లింగ్ మ్యాచ్‍లో ముంబై గెలుపు.. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 09, 2024 11:59 PM IST

WPL 2024 - MI vs GT: గుజరాత్ జెయింట్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ ఉత్కంఠ విజయం సాధించింది. ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. నాకౌట్ స్టేజ్‍కు కూడా ముంబై క్వాలిఫై అయింది.

WPL 2024: హర్మన్‍ హిట్టింగ్ ధమాకా.. థ్రిల్లింగ్ మ్యాచ్‍లో ముంబై గెలుపు.. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై
WPL 2024: హర్మన్‍ హిట్టింగ్ ధమాకా.. థ్రిల్లింగ్ మ్యాచ్‍లో ముంబై గెలుపు.. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై (PTI)

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ మరోసారి సత్తాచాటింది. డిఫెండింగ్ చాంపియన్‍గా ఉన్న ముంబై.. ఈ ఏడాది సీజన్‍లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి టీమ్‍గా నిలిచింది. ఢిల్లీ వేదికగా నేడు (మార్చి 9) జరిగిన మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ (MI) 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ (GT) టీమ్‍పై విజయం సాధించింది. కేవలం ఒక్క బంతి మిగిలి ఉండగా.. థ్రిల్లింగ్ విక్టరీ దక్కించుకుంది.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 48 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 95 పరుగులు చేసి అదరగొట్టారు. కష్టమే అనుకున్న సమయంలో భీకర హిట్టింగ్ చేసి.. జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరు చేసింది. దయాలన్ హేమలత (40 బంతుల్లో 74 పరుగులు), కెప్టెన్ బెత్ మూనీ (35 బంతుల్లో 66 పరుగులు) హాఫ్ సెంచరీలు చేయడంతో గుజరాత్ మంచి స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ రెండు, హేలీ మాథ్యూస్, పూజా వస్త్రాకర్, షాబ్నిమ్ ఇస్మాయిల్, సంజీవన్ సంజన చెరో వికెట్ తీశారు.

ఈ భారీ లక్ష్యాన్ని ఒక్క బంతి మాత్రమే మిగిల్చి ఉత్కంఠ మధ్య ఛేదించింది ముంబై ఇండియన్స్. 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 191 రన్స్ చేసి విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ హిట్టింగ్‍తో దుమ్మురేపగా.. యస్తికా భాటియా (49) రాణించారు. గుజరాత్ బౌలర్లలో ఆష్లే గార్డెనర్, తానూజా కన్వార్, షబ్నం ఎండీకి చెరో వికెట్ దక్కింది.

6 ఓవర్లలో 91 పరుగులు.. హర్మన్ మెరుపులు

భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ ఆదిలోనే తడబడింది. హేలీ మాథ్యూస్ (18) దూకుడుగా నెమ్మది ఆడాక ఔటయ్యారు. హేలీ మాథ్యూస్ (2) త్వరగా పెవిలియన్ చేరారు. మరో ఎండ్‍లో యస్తిక భాటియా క్రమంగా పరుగులు రాబట్టారు. ఇక, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఆరంభంలో ఆచితూచి ఆడారు. దీంతో చేయాల్సిన పరుగులకు బంతులకు అంతరం పెరుగుతూ పోయింది. కాసేపటికి యస్తిక ఔటయ్యారు.

ఓ దశలో ముంబై ఇండియన్ గెలువాలంటే 6 ఓవర్లలో 91 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక ఆ జట్టు గెలువడం కష్టమేనని అందరూ అనుకున్నారు. అయితే, హర్మన్ ప్రీత్ కౌర్ అప్పుడే జూలు విదిల్చారు. మేఘన్ వేసిన 15వ ఓవర్లో సిక్స్, రెండో ఫోర్లు కొట్టారు. ఆ తర్వాత కూడా బౌండరీల మోత మెగించారు. 3 ఓవర్లకు 47 పరుగులు చేయాల్సిన సమయంలో.. గుజరాత్ బౌలర్ స్నేహ్ రాణా వేసిన 18వ ఓవర్లో 24 పరుగులు బాది హిట్టింగ్ ధమాకా చేశారు హర్మన్ ప్రీత్. అదే దూకుడును చివరి వరకు కొనసాగించారు. చివరి ఓవర్లో గెలునపుకు 13 పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతులకే సిక్స్, ఫోర్ బాదేశారు హర్మన్. ఆ తర్వాత మూడు బంతులకు మూడు పరుగులు వచ్చాయి. దీంతో ముంబై అద్భుత విజయం దక్కించుకుంది.

ప్లేఆఫ్స్‌కు అర్హత

ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‍ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ జట్టుకు లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ (8), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లు మరో రెండు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. యూపీ వారియర్స్ (6), గుజరాత్ జెయింట్స్ (2) నాలుగు, ఐదు ప్లేస్‍ల్లో ఉన్నాయి. లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో టాప్‍లో ఉన్న జట్టు డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‍కు నేరుగా చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. దీంట్లో గెలిచిన జట్టు మరో ఫైనలిస్టుగా ఉంటుంది.