Manoj Tiwary: ధోనీ.. కోహ్లి, రోహిత్‌‌లను ఎందుకు పక్కన పెట్టలేదు.. నేను సెంచరీ చేసినా ఎందుకు తీసేశావ్: మనోజ్ తివారీ-manoj tiwary questions dhonis integrity after his retirement from first class cricket ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Manoj Tiwary: ధోనీ.. కోహ్లి, రోహిత్‌‌లను ఎందుకు పక్కన పెట్టలేదు.. నేను సెంచరీ చేసినా ఎందుకు తీసేశావ్: మనోజ్ తివారీ

Manoj Tiwary: ధోనీ.. కోహ్లి, రోహిత్‌‌లను ఎందుకు పక్కన పెట్టలేదు.. నేను సెంచరీ చేసినా ఎందుకు తీసేశావ్: మనోజ్ తివారీ

Hari Prasad S HT Telugu
Feb 20, 2024 08:56 AM IST

Manoj Tiwary: రంజీ ట్రోఫీ నుంచి ఈమధ్యే రిటైరైన బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ మాజీ కెప్టెన్ ధోనీపై సంచలన ఆరోపణలు చేశాడు. కోమ్లి, రోహిత్ రన్స్ చేయకపోయినా కొనసాగించాడని, తాను సెంచరీ చేసినా తీసేశాడని అతడు చెప్పడం గమనార్హం.

మాజీ కెప్టెన్ ధోనీని నిలదీస్తున్న మనోజ్ తివారీ
మాజీ కెప్టెన్ ధోనీని నిలదీస్తున్న మనోజ్ తివారీ

Manoj Tiwary: దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ రన్స్ చేసినా.. ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఎక్కువ కాలం ఉండలేకపోయిన బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ మాజీ కెప్టెన్ ధోనీపై సంచలన ఆరోపణలు చేశాడు. సోమవారం (ఫిబ్రవరి 19) బెంగాల్ జట్టును బీహార్ పై గెలిపించిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన తివారీ.. తన కెరీర్లో చేసిన అతి పెద్ద తప్పు ఏంటో వెల్లడించాడు.

ధోనీ నా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే..

మనోజ్ తివారీ రిటైరైన తర్వాత న్యూస్18తో మాట్లాడాడు. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఏదో ఒక రోజు తనకు వివరణ ఇవ్వాల్సిందే అని అన్నాడు. తాను సెంచరీ చేసినా కూడా తనకు మరో మ్యాచ్ ఆడే అవకాశం రావడానికి ఏడు నెలల సమయం ఎందుకు పట్టిందని తివారీ ప్రశ్నించాడు. టీమిండియా తరఫున 2008లో అరంగేట్రం చేసిన మనోజ్ తివారీ.. 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు.

డిసెంబర్, 2011లో వెస్టిండీస్ పై వన్డేల్లో తన తొలి సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అతనికే దక్కింది. అయితే తన తర్వాతి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి తివారీకి ఏడు నెలల సమయం పట్టింది. తాను సెంచరీ చేసినా కూడా ఎందుకు టీమ్ నుంచి తొలగించాడో ధోనీ సమాధానం చెప్పాలని అతడు డిమాండ్ చేశాడు. అదే సమయంలో పరుగులు చేయడానికి తంటాలు పడిన కోహ్లి, రోహిత్ లను మాత్రం కొనసాగించడాన్ని ప్రశ్నించాడు.

"నాకు అవకాశం వచ్చినప్పుడు అతని నుంచి ఈ ప్రశ్నకు సమాధానం వినాలని అనుకుంటున్నాను. ఈ ప్రశ్న నేను కచ్చితంగా అడుగుతాను. సెంచరీ చేసిన తర్వాత కూడా నన్ను ఎందుకు తీసేసావని ధోనీని అడుగుతాను. ముఖ్యంగా ఆ ఆస్ట్రేలియా పర్యటనలో ఎవరూ పరుగులు చేయలేదు. కోహ్లి, రోహిత్, రైనాలాంటి వాళ్లెవరూ రన్స్ చేయలేదు. నేనిప్పుడు కోల్పోయేది ఏమీ లేదు" అని తివారీ అన్నాడు.

నన్ను కాదని యువరాజ్‌ను తీసుకున్నారు

ఇక కెరీర్లో టెస్టుల్లో ఆడకపోవడం కూడా తనకు ఎంతగానో బాధ కలిగించిందని మనోజ్ తివారీ చెప్పాడు. తాను దేశవాళీ క్రికెట్ లో టన్నుల కొద్దీ రన్స్ చేసినా.. తనకు కాకుండా యువరాజ్ సింగ్ కు టెస్టుల్లో అవకాశం ఇచ్చారని వెల్లడించాడు.

"నేను 65 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు పూర్తి చేసే సమయానికి నా బ్యాటింగ్ సగటు 65గా ఉంది. అప్పుడు ఆస్ట్రేలియా మన దగ్గరికి వచ్చింది. వాళ్లపై ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ లో 130 కొట్టాను. ఆ తర్వాత ఇంగ్లండ్ పైనా ఇలాగే 93 చేశాను. టెస్టుల్లో స్థానం దక్కుతుందని అనుకున్నా. కానీ వాళ్లు యువరాజ్ సింగ్ ను తీసుకున్నారు.

అందువల్ల టెస్టుల్లో ఆడలేకపోవడంతోపాటు సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నా కూడా తర్వాత 14 మ్యాచ్ ల పాటు ఆడే అవకాశం ఇవ్వకపోవడం బాధ కలిగించింది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న సమయంలో ఎవరైనా దానిని దెబ్బకొడితే ఆ ప్లేయర్ ను చంపేయడమే అవుతుంది" అని తివారీ అన్నాడు.

బెంగాల్లో క్రీడామంత్రిగా కూడా ఉన్న మనోజ్ తివారీ ఈ మధ్యే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ లో బీహార్ పై కెప్టెన్ గా బెంగాల్ ను గెలిపించి తన కెరీర్ కు ఘనంగా ముగింపు పలికాడు. 38 ఏళ్ల తివారీ.. 147 ఫస్ల్ క్లాస్ మ్యాచ్ లలో 10 వేలకుపైగా రన్స్ చేశాడు.

Whats_app_banner