Haris Rauf: హరీస్ రౌఫ్ సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ - కోహ్లి కారణమంటోన్న నెటిజన్లు
Haris Rauf: ఆస్ట్రేలియా పర్యటనకు డుమ్మా కొట్టిన పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బోర్డ్ రద్దు చేసింది. విదేశీ లీగ్‌లలో ఆడకుండా అతడిపై నిషేధం విధించింది.
Haris Rauf: పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ షాకిచ్చింది. ఆస్ట్రేలియా పర్యటన నుంచి చివరి నిమిషంలో డుమ్మ కొట్టినందుకు అతడి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. అంతే కాకుండా ఈ ఏడాది జూన్ వరకు విదేశీ లీగ్‌లలో అడకుండా అతడికి ఎన్‌వోసీ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నది.
ఫిట్‌నెస్ సమస్యలతో తాను ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉన్నట్లు హరీస్ రౌఫ్ పీసీబీకి వివరణ ఇచ్చాడు. కానీ ఆస్ట్రేలియా టూర్‌కు ముందు జరిగిన ఫిటెన్‌స్ టెస్ట్‌లో హరీస్ రౌఫ్ పాసయ్యాడు. ఉద్దేశపూర్వకంగానే అతడు ఆస్ట్రేలియా టూర్ నుంచి తప్పుకున్నట్లు పీసీబీ నిర్ధారించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిపై వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దుతో పాటు విదేశీ లీగ్‌లలో ఆడకుండా నిషేదం విధించింది.
బోర్డుపై విమర్శలు...
హరీస్ రౌఫ్ సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేస్తూపీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. టెస్ట్ ఫార్మెట్‌కు గత రెండేళ్లుగా హరీస్ రౌఫ్ దూరంగా ఉంటున్నాడని, సరైన సన్నద్ధత లేని కారణంగానే అతడు ఆస్ట్రేలియా పర్యటన నుంచి తప్పుకున్నట్లు చెబుతోన్నారు. అంత మాత్రానికే అతడి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దుచేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. పీసీబీ బోర్డ్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని, తమకు కావాల్సిన క్రికెటర్ల కోసం హరీస్ రౌఫ్‌ను బలిచేసిందని అంటున్నారు.
కోహ్లి కారణంగా డౌన్‌ఫాల్ స్టార్ట్...
2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ నుంచి హరీస్ రౌఫ్ డౌన్‌ఫాల్ స్టార్టయినట్లు క్రికెట్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. ఈ వరల్డ్ కప్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ బౌలింగ్‌ను కోహ్లి చీల్చిచెండాడాడు. టీమిండియా విజయానికి 18 బాల్స్‌లో 30 పరుగులు అవసరమైన తరుణంలో హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కోహ్లి వరుసగా రెండు సిక్సులు కొట్టాడు. ఆ ఓవర్‌లో టీమిండియా విజయం ఖాయమైంది. అప్పటి నుంచే హరీస్ రౌఫ్ బౌలింగ్‌పై విమర్శలు మొదలయ్యాయి. కోహ్లి కారణంగానే అతడి కెరీర్ ముగిసిపోయిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
ఒకే ఒక టెస్ట్ మ్యాచ్…
పాకిస్థాన్ తరఫున ఇప్పటివరకు 66 టీ20 మ్యాచ్‌లు ఆడిన హరీస్ రౌఫ్ 90 వికెట్లు తీసుకున్నాడు. 39 వన్డే మ్యాచులు ఆడి 69 వికెట్లను సొంతం చేసుకున్నాడు.కెరీర్‌లో ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన రౌఫ్ ఒక వికెట్ మాత్రమే సొంతం చేసుకున్నాడు.