Manoj Tiwary: సెంచరీ చేసినా జట్టులో చోటు ఇవ్వలేదు.. మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుత మేనేజ్మెంట్ తను ఆడేటప్పుడు ఉన్నట్లయితే తనకు కూడా చాలా అవకాశాలు వచ్చేవని టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. సెంచరీ సాధించినా తనకు చాలా రోజుల వరకు జట్టులో చోటు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలని ప్రతి క్రికెటర్ కల. కానీ అది అంత సులభంగా సాధ్యపడదు. ప్రతిభ, కృషితో పాటు కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి. ఎంతోమంది ప్రితిభావంతులైన ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లురుతూ కొన్ని కారణాల వల్ల ఆ కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. అందులో టీమిండియా మాజీ బ్యాటర్ మనోజ్ తివారీ కూడా ఒకరు. ప్రస్తుతం బంగాల్ క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ.. ఆటగాడిగానూ సత్తా చాటుతున్నారు. ఇటీవలే రంజీ ట్రోఫీలో తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.
టీమిండియాలో చోటు కోసం ఎంతగానో కష్టపడిన మనోజ్.. కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ప్రాతినిధ్యం వహించి జట్టులో స్థానాన్ని కోల్పోయారు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ క్రికెటర్.. ఏడేళ్ల కెరీర్‌లో భారత్ తరఫున 12 వన్డేలు, మూడు టీ20లకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. 2011 డిసెంబరులో ఇండియా తరఫున తొలిసారి సెంచరీ చేసిన మనోజ్ తివారీ.. తర్వాతి అవకాశం కోసం ఏడు నెలల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన ఆయన.. ప్రస్తుత టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పుడు ఉన్నట్లయితే తనకు కూడా త్వరగా అవకాశమొచ్చేదే అని స్పష్టం చేశారు.
"ప్రస్తుత టీమిండియా మేనేజ్మెంట్.. ఆటగాళ్లు 4-5 మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. మళ్లీ అవకాశమిచ్చి ప్రోత్సహిస్తున్నారు. కానీ నేను ఆడేటప్పుడు మాత్రం అలా ఉండేది కాదు. వెస్టిండీస్ తరఫున నేను శతకం చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించినప్పటికీ జట్టులో నాకు అవకాశం కల్పించలేదు. 14 మ్యాచ్‌ల వరకు జట్టులో చోటు కోసం ఎదురు చూశాను. ఇప్పటికీ అది తలచుకుంటే మిస్టరీగానే ఉంటుంది. నన్ను ఎందుకు జట్టులో ఎంపిక చేయలేదని అప్పటి సెలక్టర్లను అడగాలని ఇప్పటికీ అనిపిస్తుంటుంది." అని మనోజ్ తివారీ తన మనస్సులో మాట తెలియజేశారు.
తనను ఎంపిక చేయడంపై స్పందిస్తూ.. ఓ విషయంలో తాను వరల్డ్ రికార్డు నెలకొల్పానని తెలిపారు మనోజ్. "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించిన తర్వాత 14 మ్యాచ్‌ల వరకు జట్టులో స్థానాన్ని దక్కించుకోని ఏకైక ఆటగాడిని నేనే అయి ఉంటాను. ఈ విషయంలో వరల్డ్ రికార్డు సాధించానేమో. తర్వాత అవకాశమొస్తే 65 పరుగులు చేయడమే కాకుండా 4 వికెట్లు తీశాను. అయినా నాకు తగినన్నీ అవకాశాలు రాలేదు. ప్రస్తుతం జట్టులో రిషభ్ పంత్‌నే చూడండి. మధ్యలో ఎన్నో సార్లు విఫలమైనప్పటికీ.. అతడి ప్రతిభను గుర్తించి మరిన్ని అవకాశాలు ఇస్తున్నారు. ఈ మేనేజ్మెంట్ నేను ఆడేటప్పుడు ఉన్నట్లయితే నాకు చాలా అవకాశాలు వచ్చేవి" అని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు.
సంబంధిత కథనం
టాపిక్