Kylian Mbappe: ఈ స్టార్ నెల జీతం కోహ్లి, రోహిత్ మొత్తం ఐపీఎల్ సంపాదన కంటే ఎక్కువ.. నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడంటే?-kylian mbappe monthly salary more than virat kohli rohit sharma ipl contracts mbappe earnings per minute ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kylian Mbappe: ఈ స్టార్ నెల జీతం కోహ్లి, రోహిత్ మొత్తం ఐపీఎల్ సంపాదన కంటే ఎక్కువ.. నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడంటే?

Kylian Mbappe: ఈ స్టార్ నెల జీతం కోహ్లి, రోహిత్ మొత్తం ఐపీఎల్ సంపాదన కంటే ఎక్కువ.. నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడంటే?

Hari Prasad S HT Telugu
Aug 13, 2024 10:00 AM IST

Kylian Mbappe: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఐపీఎల్ కాంట్రాక్టులు చూసి అమ్మో అనుకుంటాం కానీ.. ఈ స్టార్ ఫుట్‌బాలర్ సంపాదించేదాంతో పోలిస్తే వాళ్లది చాలా తక్కువే అనిపిస్తుంది. అతని నిమిషం సంపాదనపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.

ఈ స్టార్ నెల జీతం కోహ్లి, రోహిత్ మొత్తం ఐపీఎల్ సంపాదన కంటే ఎక్కువ.. నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడంటే?
ఈ స్టార్ నెల జీతం కోహ్లి, రోహిత్ మొత్తం ఐపీఎల్ సంపాదన కంటే ఎక్కువ.. నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడంటే? (PTI-Reuters)

Kylian Mbappe: మన దేశంలో క్రికెటర్ల సంపాదన చాలా ఎక్కువ. కానీ అంతర్జాతీయంగా ఫుట్‌బాల్ ప్లేయర్స్ సంపాదనతో పోలిస్తే మాత్రం ఇది చాలా చాలా తక్కువే అనిపిస్తుంది. తాజాగా స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మేన్ (పీఎస్‌జీ) నుంచి రియల్ మాడ్రిడ్ లో చేరాడు. దీనికోసం అతడు తన జీతాన్ని చాలా తగ్గించుకున్నాడు. అయినా అతని నెల జీతం ఇప్పటికీ మన స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లి ఐపీఎల్ కాంట్రాక్టుల కంటే కూడా ఎక్కువే కావడం విశేషం.

కిలియన్ ఎంబాపె సంపాదన

ఐపీఎల్ సీజన్లో ఆడటానికి విరాట్ కోహ్లి అయినా, రోహిత్ శర్మ అయినా.. కనీసం రూ.15 కోట్ల కంటే ఎక్కువే తీసుకుంటారు. ప్రతి ఏటా సుమారు రెండు నెలల పాటు సాగే టోర్నీ ఇది. అయితే అది కూడా ఎంబాపె కంటే చాలా తక్కువే. 2024-25 సీజన్ కోసం రియల్ మాడ్రిడ్ తరఫున ఆడబోతున్న అతడు తొలి ఏడాది ఏకంగా రూ.285 కోట్లు సంపాదించనున్నాడు.

ఆ లెక్కన అతని నెల జీతం రూ.23.7 కోట్లు కావడం విశేషం. అంటే రోజుకు రూ.79 లక్షలు.. నిమిషానికి రూ.5486. ఇది మామూలు సంపాదన కాదు. పేరుకు తాను ఓ ఫ్రీ ఏజెంట్ గా మారి తన కలల టీమ్ రియల్ మాడ్రిడ్ లోకి చాలా తక్కువ మొత్తానికి వెళ్లినట్లు ఎంబాపె చెబుతున్నా.. ఇప్పటికీ ఈ స్థాయిలో సంపాదిస్తున్నాడు. అతని వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే.

కోహ్లి, రోహిత్ జీతమెంత?

ఐపీఎల్లో ఆడేందుకు మన క్రికెటర్లు భారీ మొత్తం తీసుకుంటారని మనకు తెలుసు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలాంటి స్టార్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. విరాట్ కోహ్లి ఆర్సీబీకి ఆడటానికి ఒక్కో సీజన్ కు రూ.17 కోట్లు.. రోహిత్ శర్మ ముంబైకి ఆడటానికి సుమారు రూ.16 కోట్లు తీసుకుంటారు. ఇది కాకుండా ఏడాదికి బీసీసీఐ కాంట్రాక్టు కింది ఈ ఇద్దరికీ చెరో రూ.7 కోట్లు కూడా వస్తాయి.

ఆ లెక్కన ఈ ఇద్దరి ఐపీఎల్, బీసీసీఐ కాంట్రాక్టులు కలిపితే ఎంబాపె నెల జీతానికి సమానం. క్రికెటర్లు కాంట్రాక్టుల కంటే ఎండార్స్‌మెంట్ల ద్వారా బాగానే సంపాదిస్తారు. కానీ అందులోనూ ఎంబాపెలాంటి స్టార్ ఫుట్‌బాలర్ల బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంబాపె తన రియల్ మాడ్రిడ్ జర్నీని బుధవారం (ఆగస్ట్ 14) ప్రారంభించబోతున్నాడు.

యూఈఎఫ్ఏ సూపర్ కప్ లో భాగంగా యూరోపా లీగ్ విన్నర్స్ అయిన అటలాంటా టీమ్ తో రియల్ మాడ్రిడ్ తలపడనుంది. పీఎస్‌జీ నుంచి రియల్ మాడ్రిడ్ కు వచ్చిన ఎంబాపెపైనే అందరి కళ్లూ ఉండనున్నాయి.

కిలియన్ ఎంబాపె సంపాదన 
నిమిషానికిINR 5,486
రోజుకుINR 79 లక్షలు
నెలకుINR 23.7 కోట్లు
ఏడాదికిINR 285 కోట్లు