Kohli Rohit Rest: వరల్డ్ కప్‌లో టీమిండియా భారత్ దర్శన్.. కోహ్లి, రోహిత్‌లకు రెస్ట్ అందుకునే?
Kohli Rohit Rest: వరల్డ్ కప్‌లో టీమిండియా భారత్ దర్శన్ చేయబోతోంది. అందుకే కోహ్లి, రోహిత్‌లకు రెస్ట్ ఇచ్చారా అన్న వాదన వినిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు వన్డేలకు నలుగురు స్టార్లకు రెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Kohli Rohit Rest: వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియా మరో ప్రయోగానికి తెరలేపింది. అసలు ఆస్ట్రేలియా సిరీసే అనవసరమనుకుంటున్న సమయంలో ఈ సిరీస్ తొలి రెండు వన్డేలకు కీలకమైన ప్లేయర్స్ కు రెస్ట్ ఇచ్చారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్లకు తొలి రెండు వన్డేలకు రెస్ట్ ఇవ్వగా.. వీళ్లు మూడో వన్డేకు తిరిగి రానున్నారు.
వరల్డ్ కప్ లో టీమిండియా భారత్ దర్శన్ చేయబోతున్న తరుణంలో సీనియర్ ప్లేయర్స్ కు ఇప్పుడే రెస్ట్ ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ లో ఇండియా తన 9 లీగ్ మ్యాచ్ లను 9 వేదికల్లో ఆడుతోంది. దీనినే కొంతమంది భారత్ దర్శన్ అంటూ సరదాగా పిలుస్తున్నారు. ఆ మెగా టోర్నీలో ప్రయాణాలతోనే ప్లేయర్స్ అలసిపోనున్నారు.
దీంతో కోహ్లి, రోహిత్ లాంటి వాళ్ల విషయంలో రిస్క్ వద్దనుకొని తొలి రెండు వన్డేలకు వాళ్లను పక్కన పెట్టారు. వీళ్లు మళ్లీ మూడో వన్డేకు తిరిగి రానున్నారు. ఆ మ్యాచ్ లో టీమిండియా పూర్తిస్థాయి వరల్డ్ కప్ టీమ్ అందుబాటులో ఉండనుంది. 15 మందితోపాటు మరో ఇద్దరు ప్లేయర్స్ ను అదనంగా ఎంపిక చేశారు. కీలకమైన ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా స్పందించాడు.
"కొందరు ప్లేయర్స్ కు కాస్త రెస్ట్ ఇచ్చాం. రోహిత్ బ్రేక్ తీసుకున్నాడు. అదృష్టవశాత్తూ ఆసియా కప్ లో చాలా క్రికెట్ ఆడే వీలు కలిగింది. ఒకవేళ అలా జరగకపోయి ఉంటే మరో విధంగా ఆలోచించేవాళ్లం. శారీరకంగా కంటే కొన్నిసార్లు ప్లేయర్స్ కు మానసికంగా బ్రేక్ అవసరం. వరల్డ్ కప్ లాంటి టోర్నీలోకి వెళ్లే ముందు ఇది చాలా అవసరం. మూడో వన్డేకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటారు. వరల్డ్ కప్ జట్టుతో ఆడతాం. తొలి రెండు వన్డేలకు మాత్రం అవకాశం దక్కని ప్లేయర్స్ ను పరీక్షించే ఛాన్స్ దొరుకుతుంది. అయినా ఇది కూడా బలమైన జట్టే" అని అగార్కర్ అన్నాడు.
ఆసియా కప్ గెలిచి వచ్చిన తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. తొలి వన్డే సెప్టెంబర్ 22న మొహాలీలో జరగనుంది. తొలి రెండు వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా.. జడేజా వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలాంటి వాళ్లకు తొలి రెండు వన్డేల్లో అవకాశం దక్కింది.