Virat Kohli: ఈసారి వరల్డ్ కప్ వదిలేదే లేదు: విరాట్ కోహ్లి స్పెషల్ ప్రోమో చూశారా?
Virat Kohli: ఈసారి వరల్డ్ కప్ వదిలేదే లేదు అంటూ విరాట్ కోహ్లి చెబుతున్న స్పెషల్ ప్రోమో చూశారా? ఐసీసీ సోమవారం (సెప్టెంబర్ 18) ఈ స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేసింది.
Virat Kohli: ఆసియా కప్ 2023 ముగిసింది. ఇక ఇప్పుడు అందరి కళ్లూ వరల్డ్ కప్ 2023పై పడింది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీని కూడా ఇండియా గెలవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అభిమానులే కాదు ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా ఈసారి వరల్డ్ కప్ వదిలేదే లేదని చెబుతున్నాడు. జడేజాతో కలిసి కోహ్లి స్పెషల్ వరల్డ కప్ ప్రోమోను ఐసీసీ సోమవారం (సెప్టెంబర్ 18) రిలీజ్ చేసింది.
ఇక ఇదే సందర్భంలో స్టార్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ ప్రమోషన్ లో భాగంగా కూడా కోహ్లి మాట్లాడాడు. 2011 వరల్డ్ కప్ జ్ఞాపకాలు ఇంకా మెదులుతూనే ఉన్నాయని, అయితే అభిమానులకు కొత్త జ్ఞాపకాలను అందించాలన్న లక్ష్యంతో ఉన్నామని విరాట్ చెప్పాడు.
"అభిమానుల మద్దతు, వాళ్ల ప్యాషన్ మేము వరల్డ్ కప్ గెలవాలన్న తపనను మరింత పెంచుతున్నాయి. గత వరల్డ్ కప్ విజయాలు ముఖ్యంగా 2011 వరల్డ్ కప్ విజయం ఇంకా మా మనసుల్లో అలా మెదులుతూనే ఉంది. ఇప్పుడు అభిమానుల కోసం కొత్త జ్ఞాపకాలను క్రియేట్ చేయాలని భావిస్తున్నాం" అని కోహ్లి అన్నాడు.
అటు జడేజా కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నాడు. తమ ప్రదర్శనతో అభిమానులు గర్వపడేలా చేస్తామని అతడు చెప్పాడు. "ఓ క్రికెటర్ గా కొన్ని కోట్ల మంది మీ వెంట ఉన్నారని, విజయం కోసం ప్రార్థిస్తున్నారని తెలియడమే ఎంతో మోటివేట్ చేస్తుంది. టీమిండియా విజయం కోసం ఫ్యాన్స్ ఎంతగా పరితపిస్తున్నారో ఈ ప్రచారం ద్వారా అర్థమవుతోంది. ఇప్పుడు దేశ ప్రజలందరితో కలిసి మేం చేస్తున్న ప్రయాణమిది. ఫీల్డ్ లో మా ప్రదర్శనతో అభిమానులు గర్వపడేలా చేస్తాం" అని జడేజా అన్నాడు.
ఈ ప్రచార వీడియోలో ఇండియన్ ఫ్యాన్స్ వరల్డ్ కప్ కోసం పరితపిస్తున్నట్లుగా మొదట్లో చూపించారు. ఇక చివరికి వచ్చేసరికి విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా సీన్లోకి ఎంటరవుతారు. "వచ్చేసావా" అని జడేజాతో అంటాడు కోహ్లి. మరి వరల్డ్ కప్ వచ్చేస్తోందిగా అని జడ్డూ అంటాడు. సరే ఈసారి వదిలేదే లేదు అంటూ కోహ్లి ముగిస్తాడు. నిమిషం పాటు ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. 46 రోజుల ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్ లు జరుగుతాయి. ఇండియాతోపాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్ లేకుండా జరుగుతున్న తొలి వరల్డ్ కప్ ఇదే.