Virat Kohli Water Boy: వాటర్ బాయ్‌గా మారిపోయిన విరాట్ కోహ్లి.. డ్రింక్స్ మోసిన స్టార్ బ్యాటర్
Virat Kohli Water Boy: వాటర్ బాయ్‌గా మారిపోయాడు విరాట్ కోహ్లి. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో అతనికి రెస్ట్ ఇవ్వడంతో ఈ స్టార్ ప్లేయర్ ఫీల్డ్ లో ఉన్న వారికి డ్రింక్స్ మోయడం విశేషం.
Virat Kohli Water Boy: టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వాటర్ బాయ్ గా మారిపోయాడు. బంగ్లాదేశ్ తో ఇండియా ఆడుతున్న ఆసియా కప్ చివరి సూపర్ 4 మ్యాచ్ లో తనకు రెస్ట్ ఇవ్వడంతో డగౌట్ లో కూర్చున్న అతడు.. మధ్యమధ్యలో ప్లేయర్స్ కు డ్రింక్స్ మోయడం విశేషం. అంతటి ప్లేయర్ ఇలా ఓ వాటర్ బాయ్ గా మారడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
అసలు ఎలాంటి ఈగో లేకుండా విరాట్ కోహ్లి చేసిన ఈ పని ఫ్యాన్స్ కు బాగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బంగ్లాదేశ్ తో జరుగుతున్నది నామమాత్రపు మ్యాచ్ కావడంతో దీనికి ఏకంగా ఐదు మార్పులతో ఇండియా బరిలోకి దిగింది. అందులో విరాట్ కోహ్లి కూడా ఒకడు. పాకిస్థాన్ పై సెంచరీ చేసిన కోహ్లి.. తర్వాత శ్రీలంకతో మ్యాచ్ లో విఫలమయ్యాడు.
అయితే ఆదివారం (సెప్టెంబర్ 17) శ్రీలంకతో ఫైనల్ జరగనుండటంతో ఈ మ్యాచ్ కు కోహ్లికి విశ్రాంతి ఇచ్చారు. అతనితోపాటు హార్దిక్ పాండ్యా, బుమ్రా, కుల్దీప్, సిరాజ్ లకు కూడా రెస్ట్ ఇవ్వడం విశేషం. వీళ్ల స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, ప్రసిద్ధ్ కృష్ణ వచ్చారు. అయితే తనకు రెస్ట్ ఇచ్చినా.. కోహ్లి మాత్రం డగౌట్ లోనే కూర్చొని అవసరమైనప్పుడల్లా ఫీల్డ్ లో ప్లేయర్స్ కు డ్రింక్స్ తీసుకెళ్లాడు.
బౌండరీ లైన్ బయట కూడా చుట్టూ తిరుగుతూ అవసరమైన ప్లేయర్స్ కు అతడు డ్రింక్స్ తీసుకెళ్లడం విశేషం. బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోగానే తొలిసారి విరాట్ కోహ్లి డ్రింక్స్ పట్టుకొని ఫీల్డ్ లోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని చూసి స్టాండ్స్ లో ఉన్న ప్రేక్షకులు గట్టిగా అరిచారు. విరాట్ కోహ్లితోపాటు ఈ మ్యాచ్ కు రెస్ట్ తీసుకున్న కుల్దీప్ యాదవ్ కూడా డ్రింక్స్ మోసుకొచ్చాడు. అయితే శార్దూల్ మధ్యలో ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లడంతో విరాట్ సబ్‌స్టిట్యూట్ గా ఫీల్డింగ్ కూడా చేశాడు.