Ind vs SL Asia Cup Final: ఈసారి కూడా ట్రోఫీ శ్రీలంకదేనా.. టీమిండియాను కలవరపెడుతున్న ఆ రికార్డు-ind vs sl asia cup final to be held on sunday september 17th sri lanka looking for its record equalling 7th title ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl Asia Cup Final: ఈసారి కూడా ట్రోఫీ శ్రీలంకదేనా.. టీమిండియాను కలవరపెడుతున్న ఆ రికార్డు

Ind vs SL Asia Cup Final: ఈసారి కూడా ట్రోఫీ శ్రీలంకదేనా.. టీమిండియాను కలవరపెడుతున్న ఆ రికార్డు

Hari Prasad S HT Telugu
Sep 15, 2023 10:17 AM IST

Ind vs SL Asia Cup Final: ఈసారి కూడా ఆసియాకప్ ట్రోఫీ శ్రీలంకదేనా? టీమిండియాను లంక గత రికార్డులు కలవరపెడుతున్నాయి. స్వదేశంలో ఇప్పటి వరకూ జరిగిన నాలుగు టోర్నీల్లో మూడు శ్రీలంకనే గెలిచింది. కొలంబోలో అయితే ఆ టీమ్ ఓడిపోనే లేదు.

ఫైనల్లో ఇండియాను ఢీకొట్టడానికి వస్తున్న శ్రీలంక
ఫైనల్లో ఇండియాను ఢీకొట్టడానికి వస్తున్న శ్రీలంక (AFP)

Ind vs SL Asia Cup Final: ఆసియా కప్‌లో మరోసారి ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ కల కలగానే మిగిలిపోయింది. గురువారం (సెప్టెంబర్ 14) జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ ను చిత్తు చేసిన శ్రీలంక.. రికార్డు స్థాయిలో 11వసారి ఆసియా కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ సూపర్ సండే కూడా ఇండోపాక్ క్రికెట్ యుద్ధాన్ని చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి కప్పు కొట్టడం అలవాటుగా మార్చుకుంది శ్రీలంక టీమ్. గతేడాది ఆసియా కప్ లోనూ అసలు ఫైనల్ చేరడమే అసాధ్యమనుకుంటే.. ఏకంగా ట్రోఫీ గెలిచింది. ఈసారి కూడా ఇండియా, పాకిస్థాన్ లాంటి బలమైన జట్లను దాటుకొని వెళ్తుందా అన్న సందేహం కలిగినా.. లాస్ట్ బాల్ థ్రిల్లర్ లో పాక్ ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. ఇక ఇప్పుడు ఫైనల్లో ఇండియాను ఢీకొట్టబోతోంది.

ఓటమెరగని శ్రీలంక

ఈ ఫైనల్ కు ముందు టీమిండియాను, అభిమానులను ఓ విషయం తీవ్రంగా కలవరపెడుతోంది. అదేంటంటే.. స్వదేశంలో శ్రీలంకకు ఆసియా కప్ లో తిరుగులేని రికార్డు ఉంది. గతంలో నాలుగుసార్లు ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది శ్రీలంక. అందులో మూడుసార్లు ఆ జట్టే విజేతగా నిలిచింది. ఒక్కసారి అంటే 2010లో మాత్రం ఇండియా విజయం సాధించింది.

అయితే ఇప్పుడు ఫైనల్ జరగబోతున్న కొలంబోలో మాత్రం శ్రీలంక రికార్డు మరింత మెరుగ్గా ఉంది. ఇక్కడ ఫైనల్స్ జరిగిన ప్రతిసారీ లంకనే కప్పు గెలిచింది. 2010లో ఇండియా ఆసియా కప్ గెలిచినప్పుడు మాత్రం ఫైనల్ డంబుల్లాలో జరిగింది. ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా ఆ ఫైనల్లో 81 పరుగులతో లంకను చిత్తు చేసి ఆసియా కప్ గెలిచింది.

స్వదేశంలో శ్రీలంక ఆసియా కప్ రికార్డులు ఇవీ

- ఆసియా కప్ ను శ్రీలంక తొలిసారి 1986లో గెలిచింది. అప్పుడు కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఫైనల్ జరిగింది. ఆ ఫైనల్లో పాకిస్థాన్ ను 5 వికెట్లతో చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది శ్రీలంక.

- 1997లో శ్రీలంక రెండోసారి ట్రోఫీ గెలిచింది. ఇప్పుడు ఫైనల్ జరగబోతున్న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే అప్పుడు కూడా ఫైనల్ జరిగింది. ఆ ఫైనల్లో ఇండియాను 8 వికెట్లతో ఓడించి శ్రీలంక టైటిల్ ఎగరేసుకుపోయింది.

- 2004లోనూ ఇదే రిపీటైంది. ఈసారి కూడా ప్రేమదాస స్టేడియంలో ఫైనల్ జరగగా.. శ్రీలంక 25 పరుగులతో గెలిచి ఆసియా కప్ ను మూడోసారి కైవసం చేసుకుంది.

- ఇక చివరిసారి శ్రీలంకలో 2010లో ఆసియా కప్ జరిగింది. అప్పుడు ఫైనల్ డంబుల్లాలోని రణగిరి డంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఆ ఫైనల్లో శ్రీలంకను 81 పరుగులతో చిత్తు చేసిన ఇండియా ఆసియా కప్ గెలిచింది.

అండర్ డాగ్స్‌తో డేంజరే..

ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో శ్రీలంక బరిలోకి దిగినా.. ఫైనల్ చేరుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్య రీతిలో ఇండియా చేతుల్లో ఓడినా.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ లను చిత్తు చేసి ఫైనల్ చేరింది. సూపర్ 4లో ఇండియాను కూడా భయపెట్టింది. అయితే సమష్టిగా రాణించిన టీమిండియా ఆ మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరింది.

పాకిస్థాన్ తో శ్రీలంక ఆడిన విధానం చూస్తే మాత్రం ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. అందులోనూ స్వదేశం, పైగా తమకు బాగా కలిసొచ్చే ప్రేమదాస స్టేడియంలో ఈసారి లంక మళ్లీ ఏం మాయ చేస్తుందో అన్న ఆందోళన అటు టీమిండియాలో, ఇటు అభిమానుల్లో ఉంది.

Whats_app_banner