Asia Cup 2023: పాక్ పాయె.. లాస్ట్ బాల్‍కు శ్రీలంక థ్రిల్లింగ్ గెలుపు.. భారత్, లంక మధ్యే ఆసియాకప్ ఫైనల్-cricket news asia cup 2023 sri lanka beat pakistan in last ball thriller to reach final vs india ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asia Cup 2023: పాక్ పాయె.. లాస్ట్ బాల్‍కు శ్రీలంక థ్రిల్లింగ్ గెలుపు.. భారత్, లంక మధ్యే ఆసియాకప్ ఫైనల్

Asia Cup 2023: పాక్ పాయె.. లాస్ట్ బాల్‍కు శ్రీలంక థ్రిల్లింగ్ గెలుపు.. భారత్, లంక మధ్యే ఆసియాకప్ ఫైనల్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 15, 2023 05:52 AM IST

Asia Cup 2023: ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‍లో పాకిస్థాన్‍పై శ్రీలంక గెలిచింది. ఉత్కంఠ పోరులో చివరి బంతికి విజయం సాధించింది. దీంతో టైటిల్ కోసం ఫైనల్‍లో భారత్‍, లంక తలపడనున్నాయి.

చరిత్ అసలంక
చరిత్ అసలంక (AFP)

Asia Cup 2023: ఆసియాకప్ 2023 ఫైనల్ చేరాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్ శ్రీలంక, పాకిస్థాన్ మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తానికి పాక్‍పై చివరి బంతికి శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ సాధించి, భారత్‍తో ఫైనల్‍కు చేరింది. పాకిస్థాన్ టోర్నీ నుంచి ఔట్ అయింది. గురువారం కొలంబో వేదికగా జరిగిన ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‍లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‍పై డక్ వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) విధానంలో విజయం సాధించింది. వర్షం వల్ల రెండుసార్లు అంతరాయం కలగగా మ్యాచ్‍ను 42 ఓవర్లకు అంపైర్లు కుదించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లు మహమ్మద్ రిజ్వాన్ (86 పరుగులు నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (52 పరుగులు) అర్ధ శతకాలతో రాణించగా.. చివర్లో ఇఫ్తికార్ అహ్మద్ (47 పరుగులు) బాదేశాడు. లంక బౌలర్లలో మహీశ్ పతిరణ మూడు వికెట్లు తీయగా.. ప్రమోద్ మధుషన్‍కు రెండు, తీక్షణ, వెల్లలాగేకు చెరో వికెట్ దక్కింది. డీఎల్ఎస్ సర్దుబాట్ల కారణంగా శ్రీలంక ముందు 252 పరుగుల లక్ష్యం నిలిచింది. సరిగ్గా 42 ఓవర్లలోనే చివరి బంతికి 8 వికెట్లకు 252 పరుగులకు చేరుకొని లంక గెలిచింది. కుషాల్ మెండిస్ (91 పరుగులు) మంచి ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో చరిత్ అసలంక (49 పరుగులు నాటౌట్) అద్భుత పోరాటం చేసి జట్టును గెలిపించాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఇఫ్తికార్ అహ్మద్ మూడు, షహిన్ అఫ్రిది రెండు, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ తీశారు. మ్యాచ్ ఎలా సాగిందంటే..

రాణించిన షఫీక్, రిజ్వాన్

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మంచి స్కోరే చేయగలిగింది. ఈ ఇన్నింగ్స్ మధ్య రెండుసార్లు వరుణుడు ఆటంకం కలిగించటంతో మ్యాచ్‍ను 42 ఓవర్లకు అంపైర్లు కుదించారు. ఓపెనర్ ఫకర్ జమాన్ (4) విఫలమైనా అబ్బుల్లా షఫీక్ అదరగొట్టాడు. అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (29), మహమ్మద్ హరిస్ (3), మహమ్మద్ నవాజ్ (12) ఎక్కువసేపు నిలువలేకపోవటంతో ఓ దశలో 130 పరుగులకే పాకిస్థాన్ 5 వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ దీటుగా ఆడారు. లంక బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో 48 బంతులకే అర్ధ శతకాన్ని చేరిన మహ్మద్ రిజ్వాన్ (86) చివరి వరకు నిలిచి పాక్‍కు మంచి స్కోరు అందించాడు. ఇఫ్తికార్ అహ్మద్ మంచి ఇన్నింగ్స్ ఆడినా హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. మొత్తంగా 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది పాక్.

అదరొగట్టిన కుషాల్ మెండిస్

వర్షం వల్ల డీఎల్ఎస్ సర్దుబాట్ల కారణంగా శ్రీలంక ముందు కూడా సరిగ్గా 252 పరుగుల లక్ష్యం నిలిచింది. లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక (29), కుషాల్ పెరీరా (17) మోస్తరు ఆరంభాన్ని అందించి ఔటయ్యారు. ఆ తర్వాత కుషాల్ మెండిస్ అద్భుతంగా ఆడాడు. సమరవిక్రమ (48), మెండిస్ దీటుగా ఆడి లంకను విజయంవైపుగా నడిపారు. 47 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కుషాల్ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. దీంతో 3 వికెట్లకు 177 పరుగులతో లంక సులువుగా గెలిచేలా కనిపించింది. అయితే, సమరవిక్రమ, ఆ తర్వాత సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో కుషాల్ మెండిస్‍ను ఔట్ చేసి పాకిస్థాన్‍కు భారీ బ్రేక్‍త్రూ ఇచ్చాడు ఇఫ్తికార్ అహ్మద్. అనంతరం లంక బ్యాటర్లు దసున్ శనక (2), ధనుంజయ డిసిల్వ (5), దునిత్ వెల్లలా (0), ప్రమోద్ మధుషాన్ (1) ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరడంతో లంక కష్టాల్లో పడింది. అయితే, మరో ఎండ్‍లో చరిత్ అసలంక అద్భుత పోరాటం చేశాడు.

అసలంక అద్భుత పోరాటం.. చివరి ఓవర్ ఇలా..

ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా లంక బ్యాటర్ చరిత్ అసలంక అద్భుతంగా పోరాడాడు. దీటుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. ఈ క్రమంలో గెలువాలంటే చివరి ఓవర్లో 8 పరుగులు అవసరమయ్యాయి. పాక్ బౌలర్ జమాన్ ఖాన్ బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి ప్రమోద్ (1) సింగిల్ తీసి.. అసలంకకు స్ట్రైక్ ఇవ్వగా రెండో బంతి డాట్ అయింది. మూడో బంతికి అసలంక సింగిల్ తీయగా.. నాలుగో బంతికి ప్రమోద్ రనౌట్ కాగా.. స్ట్రైక్‍లోకి వచ్చాడు అసలంక. రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి ఫోర్ కొట్టి లంక గెలుపు అవకాశాలను పెంచాడు అసలంక. చివరి బంతికి స్క్వేర్ లెగ్ వైపుగా ఆడి రెండు పరుగులను తీశాడు అసలంక. దీంతో శ్రీలంక గెలిచింది. చివరి బంతికి ఉత్కంఠ గెలుపు దక్కడంతో లంక ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. ఆసియాకప్ చరిత్రలో 11వసారి ఫైనల్ చేరింది శ్రీలంక.

ఇండియా, శ్రీలంక మధ్య ఆసియాకప్ 2023 ఫైనల్ ఆదివారం (సెప్టెంబర్ 17) జరగనుంది.

Whats_app_banner