ICC Rankings: ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్‍ను కిందికి నెట్టేసిన భారత్.. పైకి వెళ్లిన టీమిండియా-team india overtook pakistan in icc odi rankings check details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Rankings: ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్‍ను కిందికి నెట్టేసిన భారత్.. పైకి వెళ్లిన టీమిండియా

ICC Rankings: ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్‍ను కిందికి నెట్టేసిన భారత్.. పైకి వెళ్లిన టీమిండియా

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 15, 2023 08:54 AM IST

ICC Rankings: వన్డే ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్ మరింత దిగజారింది. ఆసియాకప్‍లో ఫుల్ ఫామ్‍లో ఉన్న టీమిండియా పైకి ఎగబాకింది. ఆ వివరాలివే..

ICC Rankings: ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్‍ను కిందికి నెట్టేసిన భారత్.. పైకి వెళ్లిన టీమిండియా
ICC Rankings: ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్‍ను కిందికి నెట్టేసిన భారత్.. పైకి వెళ్లిన టీమిండియా (AFP)

ICC Rankings: ఆసియాకప్ 2023 టోర్నీలో టీమిండియా అజేయంగా దూసుకుపోతోంది. నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకపై ఘన విజయాలు సాధించింది. ఆసియాకప్ ఫైనల్ చేరింది. తుదిపోరుకు ముందు నేడు (సెప్టెంబర్ 15) సూపర్-4లో బంగ్లాదేశ్‍తో తలపడనుంది భారత్. అయితే, కీలకమైన సూపర్-4 మ్యాచ్‍లో గురువారం శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది పాకిస్థాన్. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలో ఓటమి తర్వాత.. తాజాగా వచ్చిన ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ల్లో పాక్ ర్యాంకు దిగజారింది. పాకిస్థాన్‍ను వెనక్కి నెట్టి టీమిండియా పైకి ఎగబాకింది. ఆ వివరాలు ఇవే.

శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్ మూడో ర్యాంకుకు పడిపోయింది. 115 రేటింగ్ పాయింట్ల (3,102 పాయింట్ల)తో మూడో స్థానానికి దిగజారింది. మరోవైపు ఆసియాకప్‍లో ఫుల్ జోరు మీదు ఉన్న టీమిండియా 116 రేటింగ్ పాయింట్లతో వన్డేల్లో రెండో ర్యాంకుకు ఎగబాకింది. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‍లో దుమ్మురేపుతున్న ఆస్ట్రేలియా 118 పాయింట్లతో ఇటీవలే టాప్ ర్యాంకుకు చేరింది. ఆసియాకప్ 2023 టోర్నీలో వన్డే నంబర్ వన్ ర్యాంకర్‌గా అడుగుపెట్టిన బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్థాన్.. ఇప్పుడు టోర్నీ నుంచి నిష్క్రమించడమే కాకుండా ర్యాంకింగ్‍ల్లో మూడో స్థానానికి పడిపోయింది.

ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ (103), న్యూజిలాండ్ (102), దక్షిణాఫ్రికా (101), శ్రీలంక (93) ఉన్నాయి.

బెస్ట్ టీమ్ భారత్

అన్ని జట్ల కంటే ప్రస్తుతం టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో బెస్ట్ టీమ్‍గా ఉంది. టెస్టులు, టీ20ల్లో టాప్ ర్యాంకులో ఉన్న భారత్.. ఇప్పుడు వన్డేల్లోనూ రెండో స్థానానికి ఎగబాకింది. నేడు బంగ్లాదేశ్‍తో జరిగే మ్యాచ్‍తో పాటు.. ఆదివారం జరిగే ఆసియాకప్ 2023 ఫైనల్‍లో శ్రీలంకను ఓడిస్తే వన్డేల్లోనూ టీమిండియా టాప్ ర్యాంకుకు చేరే అవకాశం ఉంటుంది. ఓవరాల్‍గా అన్ని ఫార్మాట్‍ల ర్యాంకింగ్‍లను పరిశీలిస్తే టీమిండియా ఇప్పుడు కూడా బెస్ట్ టీమ్‍గా ఉంది. వన్డే ప్రపంచకప్ ముగింట భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుండటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ (అక్టోబర్ 5 - నవంబర్ 19) భారత్ వేదికగా జరగనుండటంతో టీమిండియానే హాట్ ఫేవరెట్‍గా ఉంది.

Whats_app_banner