IND vs NZ 2nd Test Match: టీమిండియాలో సర్ఫరాజ్ ఖాన్ vs కేఎల్ రాహుల్, ఈరోజు డిసైడ్ చేయబోతున్న గణాంకాలు!
Sarfaraz Khan: భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ముంగిట.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై జోరుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్‌లో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుంది అనే విషయంపై నెటిజన్లు చర్చిస్తున్నారు.
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ముంగిట భారత్ తుది జట్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం (అక్టోబరు 24)న ఉదయం 9 గంటలకి మ్యాచ్ టాస్ పడనుండగా.. తుది జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ లేదా కేఎల్ రాహుల్‌లో ఎవరిని తీసుకుంటారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
మెడనొప్పి కారణంగా తొలి టెస్టుకి దూరంగా ఉన్న శుభమన్ గిల్ ఫిట్‌నెస్ సాధించడంతో ఈ సమస్య మొదలైంది. గిల్ స్థానంలో బెంగళూరు టెస్టులో ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులతో సత్తాచాటాడు. దాంతో అతడ్ని తప్పించలేని పరిస్థితి నెలకొనగా.. ఫామ్ కోల్పోయిన కేఎల్ రాహుల్‌కి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలుస్తున్నాడు. దాంతో సోషల్ మీడియాలో సర్ఫరాజ్ ఖాన్ vs కేఎల్ రాహుల్ డిబేట్ అభిమానుల మధ్య నడుస్తోంది.
గణాంకాలు ఏం చెప్తున్నాయి?
భారత్ తరఫున సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు నాలుగు టెస్టులు మాత్రమే ఆడగా, కేఎల్ రాహుల్ 53 టెస్టులు ఆడాడు. అనుభవం విషయానికొస్తే సర్ఫరాజ్ కంటే కేఎల్ చాలా ముందున్నాడు. కానీ భారత్ గడ్డపై ఇద్దరి బ్యాటింగ్ రికార్డులు చూస్తే రాహుల్ కంటే సర్ఫరాజ్ ఖాన్ బెస్ట్‌గా అనిపిస్తున్నాడు.
సర్ఫరాజ్ ఖాన్ ఆడిన నాలుగు టెస్టుల్లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలో 58.33 సగటుతో 350 పరుగులు చేశాడు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే సర్ఫరాజ్ ఖాన్ స్ట్రైక్ రేట్ 77.77గా ఉంది.
రాహుల్ రికార్డులిలా
కేఎల్ రాహుల్ టెస్టు ఓవరాల్‌గా 53 టెస్టుల్లో 91 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 33.87 సగటుతో 2981 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 53.07 మాత్రమే. ఇక రాహుల్ టెస్టు కెరీర్‌లో మొత్తం 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు సాధించాడు.
కానీ ఈ ఎనిమిది సెంచరీలలో కేవలం ఒక్కటి మాత్రమే భారత్ లో నమోదైంది, అది కూడా 2016లో.. ఆ తర్వాత ఈ 8 ఏళ్లలో ఒక్కటి కూడా టెస్టు సెంచరీని రాహుల్ నమోదు చేయలేకపోయాడు. భారత్లో 20 టెస్టులాడిన కేఎల్ రాహుల్ 32 ఇన్నింగ్స్‌ల్లో 39.62 సగటుతో 1149 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సర్ఫరాజ్ ఖాన్‌కి పెరిగిన మద్దతు
సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు ఆడిన టెస్టు మ్యాచ్‌లన్నీ భారత్ గడ్డపైనే ఆడాడు. దాంతో అతని సెంచరీ.. అది కూడా గత టెస్టులోనే నమోదు చేసి ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి కేవలం భారత్ గడ్డపై ఇద్దరి టెస్టు గణాంకాలు, ఫామ్ ఆధారంగా చూస్తే సర్ఫరాజ్ ఖాన్ పుణె టెస్టులో ఆడాలి.
భారత్ గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుల గురించి మాట్లాడితే.. సర్ఫరాజ్ ఖాన్ ఆడిన ఒక టెస్టులోనే 150 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ రెండు టెస్టులు ఆడి చేసిన పరుగుల 82 మాత్రమే. దాంతో సర్ఫరాజ్ ఖాన్‌కి తుది జట్టులో చోటివ్వాలనే డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఈ డిమాండ్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. భారత్ తుది జట్టుని సోషల్ మీడియా డిసైడ్ చేయదంటూ బుధవారం కౌంటర్ ఇచ్చాడు.