IND vs NZ 2nd Test Live: ఈరోజు నుంచే పుణె టెస్టు.. మ్యాచ్ టైమింగ్స్, భారత్, న్యూజిలాండ్ తుది జట్లు ఇలా!
India vs New Zealand 2nd Test: రెండో టెస్టుకి గురువారం నుంచి ఆతిథ్యం ఇస్తున్న పుణె పిచ్ స్పిన్‌కి అనుకూలం. దాంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్ కూడా ఒక స్పిన్నర్‌ని టీమ్‌లోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
బెంగళూరు వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఓడిపోయిన భారత్ జట్టు గురువారం (అక్టోబరు 24) నుంచి రెండో టెస్టులో న్యూజిలాండ్‌తో తలపడబోతోంది. మూడు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనకబడిన టీమిండియా ఈ రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ని సమం చేయాలని ఆశిస్తుండగా.. 36 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై టెస్టుల్లో గెలుపు రుచి చూసిన కివీస్ అదే ఊపులో చరిత్రలో తొలిసారి సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. దాంతో పుణె టెస్టు ఆసక్తికరంగా జరగనుంది.
భారత్ తుది జట్టు ఎలా?
మెడ నొప్పి కారణంగా తొలి టెస్టుకి దూరమైన శుభమన్ గిల్ ఫిట్‌నెస్ సాధించగా.. అతని స్థానంలో బెంగళూరు టెస్టు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేసి జట్టులో పాగా వేసేశాడు. దాంతో గిల్‌కి రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వాలా? సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించాలా? లేదా ఈ ఇద్దరినీ ఆడించి కేఎల్ రాహుల్‌పై వేటు వేయాలా? అనేదానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ క్లారిటీకి రాలేకపోతోంది.
సిరాజ్ ఔట్.. ఆకాశ్‌కి పిలుపు
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం.. బుధవారం కేఎల్ రాహుల్‌కి మద్దతుగానే మాట్లాడుతూ కనిపించాడు. దాంతో తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. ఇక తొలి టెస్టులో నిరాశపరిచిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు వేసి ఆకాశ్ దీప్‌ను తుది జట్టులోకి తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్ఫరాజ్ ఖాన్, కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ ఫామ్‌ని అందుకున్నారు. కానీ.. కోహ్లీ, రోహిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.
భారత్ తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్/కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్/ మహ్మద్ సిరాజ్
జోరుమీదున్న న్యూజిలాండ్
బెంగళూరు టెస్టులో భారత్ జట్టుని తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూల్చిన న్యూజిలాండ్ టీమ్.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. అలానే మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో గెలిచి మూడు దశాబ్దాల్లో తొలిసారి టెస్టు సిరీస్‌లో భారత్ గడ్డపై ఆధిక్యంలో ఉంది. దాంతో దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిరీస్ చేజిక్కించుకోవాలని ఆశిస్తోంది.
శాంట్నర్‌కి ఛాన్స్?
కివీస్ టీమ్‌లో దేవాన్ కాన్వె, రచిన్ రవీంద్ర మంచి ఫామ్‌లో ఉండగా.. బౌలర్లు ఓరోర్క్, సౌథీ టచ్‌లో కనిపిస్తున్నారు. పుణె పిచ్ స్పిన్‌కి అనుకూలం అనే వార్తలు వస్తుండటంతో.. మిచెల్ శాంట్నర్ తుది జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో టిమ్ సౌథీ లేదా ఓరోర్క్‌లో ఒకరిని రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): టామ్ లేథమ్ (కెప్టెన్), దేవాన్ కాన్వె, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిచెల్ డార్లీ, మిచెల్ శాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ/ఓరోర్క్, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్.
ఈరోజు పుణె టెస్టు మ్యాచ్‌లో ఉదయం 9.00 గంటలకి టాస్ పడనుండగా.. 9.30కి తొలి సెషన ఆరంభంకానుంది.