Sarfaraz Khan Son: సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రమోషన్.. తొలి సెంచరీ చేసిన మూడు రోజులకే తండ్రియిన స్టార్
Sarfaraz Khan Son: సర్ఫరాజ్ ఖాన్ కు ప్రమోషన్ లభించింది. టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన మూడు రోజుల్లోనే అతడి వ్యక్తిగత జీవితంలోనూ తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. సర్ఫరాజ్ భార్య ఓ బాబుకు జన్మనిచ్చింది.

Sarfaraz Khan Son: సర్ఫరాజ్ ఖాన్.. ఒకప్పుడు ఇండియన్ టీమ్ లోకి రావడానికి చాలానే కష్టపడ్డాడు. తనను తాను నిరూపించుకోవడానికి ఎంతో సాధన చేశాడు. ఇక ఇప్పుడు అతని జీవితంలో అంతా మంచే జరుగుతోంది. ఇండియన్ టెస్టు టీమ్ లో సర్ఫరాజ్ చోటు ఖాయమైంది. ఇక ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ తండ్రిగా ప్రమోషన్ అందుకున్నాడు.
తండ్రయిన సర్ఫరాజ్ ఖాన్
టీమిండియా బ్యాటింగ్ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రయ్యాడు. అతని భార్య రొమానా జహూర్ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇట్స్ ఎ బాయ్ అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని సర్ఫరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించాడు. తన తండ్రి పక్కనే ఉండగా.. బిడ్డను ఎత్తుకొని సర్ఫరాజ్ మురిసిపోతున్న ఫొటో కూడా వైరల్ అవుతోంది.
గతేడాది ఆగస్ట్ లో రొమానాను సర్ఫరాజ్ పెళ్లి చేసుకున్నాడు. టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన మూడు రోజుల్లోనే సర్ఫరాజ్ వ్యక్తిగత జీవితంలోనూ గుడ్ న్యూస్ రావడంతో అతని ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఈ ఏడాది అతనికి బాగానే కలిసి వస్తోంది. ఇంగ్లండ్ పై తొలిసారి ఇండియా తరఫున ఆడే అవకాశం రాగా.. తర్వాత ఇరానీ కప్ లో డబుల్ సెంచరీ చేశాడు.
న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికిదే తొలి సెంచరీ. తొలి ఇన్నింగ్స్ లో డకౌటైన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసి అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు బాబు పుట్టడంతో అతని ఆనందం రెట్టింపైంది.
సర్ఫరాజ్ కెరీర్ ఇలా..
సర్ఫరాజ్ ఖాన్ ఇండియన్ టీమ్ లోకి రావడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది. మొదట ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున మెరుపులతో అతడు వెలుగులోకి వచ్చాడు. అయితే ఆ మెరుపులు ఎక్కువ కాలం లేకపోవడంతో క్రమంగా కనుమరుగయ్యాడు. తర్వాత ముంబై టీమ్ లో చోటు దక్కకపోవడంతో మూడేళ్ల పాటు యూపీకి ఆడాడు.
కానీ ఎప్పుడైతే తిరిగి ముంబైకి వచ్చాడో అక్కడి నుంచీ సర్ఫరాజ్ కు తిరుగు లేకుండా పోయింది. వరుసగా భారీ ఇన్నింగ్స్ ఆడుతూ టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. సర్ఫరాజ్ ఇప్పటి వరకూ 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో ఏకంగా 69.27 సగటుతో 4572 రన్స్ చేశాడు. అందులో 16 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇప్పుడు టీమిండియాలోనూ అతడు చోటు ఖాయమైనట్లే. ఇంగ్లండ్ తో తొలిసారి అవకాశం దక్కించుకున్న అతడు.. నిలకడగా రాణించాడు. బంగ్లాదేశ్ పై ఆడే అవకాశం రాకపోయినా.. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ గాయపడటంతో తొలి టెస్టులో ఆడే ఛాన్స్ దక్కింది. అందులో సెంచరీ చేసి ఇక టీమ్ తనను పక్కన పెట్టే సాహసం చేయకుండా చేసుకున్నాడు.