ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ జోరు, కోహ్లీని దాటేసి పైపైకి-rishabh pant overtakes virat kohli as joe root extends lead at top in icc test rankings ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ జోరు, కోహ్లీని దాటేసి పైపైకి

ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ జోరు, కోహ్లీని దాటేసి పైపైకి

Galeti Rajendra HT Telugu
Oct 23, 2024 03:11 PM IST

Rishabh Pant in ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు నుంచి టాప్-10లో ముగ్గురు ప్లేయర్లు నిలిచారు. బౌలింగ్‌లోనూ బుమ్రా, అశ్విన్, జడేజా సత్తాచాటారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకి మాత్రం నిరాశ తప్పలేదు.

రిషబ్ పంత్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
రిషబ్ పంత్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో చాలా రోజుల తర్వాత రిషబ్ పంత్ అత్యుత్తమ ర్యాంక్‌ని అందుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 20, 99 పరుగులు చేసిన రిషబ్ పంత్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు పైకి ఎగబాకి ఆరోస్థానానికి చేరుకున్నాడు. పంత్ ఖాతాలో ప్రస్తుతం 745 పాయింట్లు ఉన్నాయి.

ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లకి టాప్-10లో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో టెస్టులో అంచనాల్ని అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ (0, 70 పరుగులు) ఒక స్థానం కిందకి దిగజారి 8 స్థానానికి పరిమితం అయ్యాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 720 పాయింట్లు ఉన్నాయి. ఇక భారత్ నుంచి యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టాప్-4లో నిలిచాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో సెంచరీ, మొన్న బెంగళూరు టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన జైశ్వాల్ 780 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌ని నిలబెట్టుకున్నాడు.

రెండు స్థానాలు దిగజారిన రోహిత్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బెంగళూరు టెస్టులో అర్ధశతకం సాధించినప్పటికీ రెండు స్థానాలు నష్టపోయి 16వ స్థానానికి పడిపోయాడు. రోహిత్ ఖాతాలో 683 పాయింట్లు ఉన్నాయి. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు హిట్ మ్యాన్ చేశాడు. ఇక శుభమన్ గిల్ మెడనొప్పి తొలి టెస్టుకి దూరమవగా.. అతను నాలుగు స్థానాలు కోల్పోయి 20వ స్థానానికి జారిపోయాడు. ఓవరాల్‌గా భారత్ తరఫున టాప్-20లో నిలిచిన ప్లేయర్లు ఈ ఐదుగురు మాత్రమే.

ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ఈ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 917 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ మాకీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 821 పాయింట్లతో ఉండగా.. ప్రస్తుతం గజ్జలో గాయం కారణంగా భారత్‌తో సిరీస్‌కి కేన్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

నెం.1 స్థానంలో బుమ్రా

ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా 871 పాయింట్లతో టాప్‌లో నిలవగా.. రెండో స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 849 పాయింట్లతో ఉన్నాడు. ఈ ఇద్దరితో పాటు రవీంద్ర జడేజా కూడా 801 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ముగ్గురేసి చొప్పున స్థానం దక్కించుకోవడం గమనార్హం.

భారత్, న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా గురువారం (అక్టోబరు 24) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన టీమిండియా.. మూడు టెస్టుల సిరీస్‌‌ని దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. దాంతో మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది.

Whats_app_banner