Sarfaraz Khan: డబుల్ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ ఖాన్.. సచిన్, గవాస్కర్‌లకూ సాధ్యం కాని రికార్డు సొంతం
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ముంబై టీమ్ తరఫున సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మలాంటి వాళ్లకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డును ఓ డబుల్ సెంచరీతో సొంతం చేసుకోవడం విశేషం.
Sarfaraz Khan: టీమిండియా, ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి చెలరేగిపోయాడు. ఇరానీ కప్ లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ రెండో రోజు డబుల్ సెంచరీ చేశాడు. 65 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో ముంబై తరఫున డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు. సచిన్, గవాస్కర్, రోహిత్ లాంటి వాళ్లకూ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు.
సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ
65 ఏళ్లలో ఇరానీ కప్ లో ముంబై తలపడటం ఇది 30వ సారి. ఏ రంజీ ట్రోఫీ టీమ్ కూ సాధ్యం కాని రికార్డు ఇది. కానీ ఇన్నాళ్లలో ఒక్క ముంబై బ్యాటర్ కూడా డబుల్ సెంచరీ సాధించలేదు. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ఆ లోటును తీర్చాడు. 253 బంతుల్లో సర్ఫరాజ్ డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇరానీ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు.
గతంలో 1972లో రామ్‌నాథ్ పార్కర్ పేరిట 194 పరుగులతో ఉన్న రికార్డును సర్ఫరాజ్ బ్రేక్ చేశాడు. గతంలో ముంబైకి చెందిన రవిశాస్త్రి, ప్రవీణ్ ఆమ్రేలాంటి వాళ్లు కూడా ఇరానీ కప్ లో డబుల్ సెంచరీలు బాదినా.. వాళ్లు రెస్టాఫ్ ఇండియా టీమ్ తరఫున ఆడారు. ఈ ఇద్దరూ 1990లో బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లోనే డబుల్ సెంచరీలు చేయడం విశేషం.
ఇరానీ కప్ డబుల్ సెంచరీలు
ఇరానీ కప్ లో ఇంత వరకూ 10 మంది డబుల్ సెంచరీలు చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ 11వ వ్యక్తిగా నిలిచాడు. అయితే రెస్టాఫ్ ఇండియా తరఫున కాకుండా డబుల్ సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్ సర్ఫరాజ్. గతేడాది మధ్య ప్రదేశ్ తరఫున యశస్వి జైస్వాల్ కూడా ఇరానీ కప్ లో డబుల్ సెంచరీ చేశాడు. ఇక ఇరానీ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు వసీం జాఫర్ (286 రన్స్) పేరిట ఉంది.
రెండో రోజు సర్ఫరాజ్ 221 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం వసీం జాఫర్, మురళీ విజయ్, ప్రవీణ్ ఆమ్రే, సురీందర్ అమర్‌నాథ్ ల తర్వాత ఇరానీ కప్ లో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్ గా సర్ఫరాజ్ ఉన్నాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ కు అతడు ఎంపికైనా.. కేఎల్ రాహుల్ కు తుది జట్టులో చోటు దక్కడంతో బెంచీకే పరిమితమయ్యాడు. చివరికి అతన్ని ఇరానీ కప్ కోసం రిలీజ్ చేశారు.