Rachin Ravindra: ఐపీఎల్ 2024లో మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ అతడే: ఆకాశ్ చోప్రా ఇంట్రెస్ట్ కామెంట్స్
Rachin Ravindra: ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ రచిన్ రవీంద్ర అవుతాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. సీఎస్కే ఈసారి ఆరో టైటిల్ పై కన్నేసిన విషయం తెలిసిందే.
Rachin Ravindra: ఐపీఎల్ 2024 దగ్గర పడుతోంది. ఈసారి లీగ్ లోకి చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెడుతోంది. అయితే డెవోన్ కాన్వే గాయంతో దూరం కావడంతో సీఎస్కేకు షాక్ తగిలింది. అయితే అతని స్థానాన్ని భర్తీ చేయడమే కాదు సీఎస్కే తరఫున అత్యంత విలువైన ఆటగాడిగా రచిన్ రవీంద్ర నిలుస్తాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెప్పడం గమనార్హం.
సీఎస్కేలో కీలకం అతడే
రచిన్ రవీంద్ర గతేడాది ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్ తో అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనంగా మారాడు. ఇప్పుడు కాన్వే లేని నేపథ్యంలో సీఎస్కే బ్యాటింగ్ భారాన్ని అతడు మోస్తాడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. నిజానికి గతేడాది సీఎస్కే గెలవడంలో కాన్వేదే కీలకపాత్ర. అతడు 16 మ్యాచ్ లలో ఏకంగా 51.69 సగటుతో 672 రన్స్ చేశాడు.
అలాంటి ప్లేయర్ స్థానాన్ని రచిన్ రవీంద్రతో చెన్నై సూపర్ కింగ్స్ భర్తీ చేయగలదని తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా అన్నాడు. "ఈ టీమ్ ఇప్పటికే బాగానే ఉందని నేను చెప్పగలను. వాళ్లు ఏదో ఒకటి చేసి ఎవరో ఒకరిని తీసుకొస్తారు. వాళ్ల దగ్గర ఇప్పటికే కాన్వే బ్యాకప్ గా అద్భుతమైన ప్లేయర్ రచిన్ రవీంద్ర ఉన్నాడు. వరల్డ్ కప్ లో బాగా ఆడాడు. టెస్టుల్లోనూ రన్స్ చేశాడు. తన జీవితంలోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు" అని చోప్రా అన్నాడు.
టీ20ల్లో రచిన్ ఫెయిల్
అయితే రచిన్ టీ20 నంబర్లు మాత్రం అంత బాగా లేవు. కానీ సీఎస్కే జట్టుకు ఆడుతూ వాటిని కూడా రచిన్ మెరుగుపరచుకుంటాడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. రచిన్ న్యూజిలాండ్ తరఫున 20 టీ20లు ఆడి 214 రన్స్ మాత్రమే చేశాడు. "రచిన్ టీ20 నంబర్లు అంత బాగా లేవు. అయితే సీఎస్కేకు ఆడటం మంచి విషయం. ఇప్పుడు అతని టీ20 అవతారం కూడా మనం చూడొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ అయ్యే అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి" అని చోప్రా చెప్పడం గమనార్హం.
గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో గుజరాత్ టైటన్స్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. ఈసారి ఆరో టైటిల్ పై కన్నేస్తూ ఐపీఎల్ 2024లో అడుగు పెడుతోంది. అయితే కొత్త సీజన్ కొత్త రోల్ అంటూ ధోనీ ఓ ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం.
కొత్త రోల్ అనే పదాన్ని ధోనీ ప్రత్యేకంగా చెప్పడంతో ఈ సీజన్ లో అసలు అతడు కెప్టెన్ గా ఉంటాడా లేదా? సీజన్ మధ్యలోనే రిటైరవుతాడా? టీమ్ కోచింగ్ బాధ్యతలు చేపడతాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ధోనీ పోస్టుకు అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నంలో సీఎస్కే అభిమానులు ఉన్నారు. మార్చి 22న ఆర్సీబీతో తొలి మ్యాచ్ లో సీఎస్కే తలపడనుంది.