IPL Highest Paid Captains: ఐపీఎల్లో అత్యధిక మొత్తం అందుకుంటున్న కెప్టెన్లు వీళ్లే-ipl highest paid captains ms dhoni kl rahul shubman gill pat cummins cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl Highest Paid Captains: ఐపీఎల్లో అత్యధిక మొత్తం అందుకుంటున్న కెప్టెన్లు వీళ్లే

IPL Highest Paid Captains: ఐపీఎల్లో అత్యధిక మొత్తం అందుకుంటున్న కెప్టెన్లు వీళ్లే

Hari Prasad S HT Telugu
Mar 05, 2024 09:14 AM IST

IPL Highest Paid Captains: ఐపీఎల్ 2024 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పూర్తిగా డబ్బులతోనే నడిచే ఈ మెగా లీగ్ లో పాల్గొనే జట్ల కెప్టెన్లు అందుకుంటున్న మొత్తం ఎంత? వాళ్లలో అత్యధికం ఎవరికి అన్న వివరాలు ఇక్కడ చూడండి.

ఐపీఎల్లో అత్యధిక మొత్తం అందుకున్న కెప్టెన్లు.. ధోనీ జీతం ఎంతంటే?
ఐపీఎల్లో అత్యధిక మొత్తం అందుకున్న కెప్టెన్లు.. ధోనీ జీతం ఎంతంటే?

IPL Highest Paid Captains: ఐపీఎల్ అంటేనే డబ్బు. ఓ సాధారణ క్రికెటర్ కూడా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాడంటే దానికి కారణం ఈ మెగా లీగ్. మరి అలాంటి లీగ్ లో కెప్టెన్లుగా ఉన్న ప్లేయర్స్ ఎంత సంపాదిస్తున్నారన్నది తెలుసుకోవడం ఏ అభిమానికైనా ఆసక్తిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో లీగ్ లోని పది జట్ల కెప్టెన్లు ప్రస్తుతం ఆయా ఫ్రాంఛైజీల నుంచి ఎంత మొత్తం అందుకుంటున్నారో మీరే చూడండి.

ఐపీఎల్లో కెప్టెన్ల జీతాలు ఇవే

2008లో తొలిసారి ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పుడు తన 17వ సీజన్ కు సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఈసారి కూడా పది టీమ్స్ కప్పు కోసం పోటీ పడనున్నాయి. అయితే ఈ టీమ్స్ కెప్టెన్లు అందుకుంటున్న మొత్తం ఎంత? పది మందిలో అత్యధిక జీతం ఎవరికి దక్కుతోందిలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

ప్యాట్ కమిన్స్ - రూ.20.5 కోట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మధ్యే తమ కొత్త కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ ను నియమించడంతో ఐపీఎల్లో అత్యధిక మొత్తం అందుకుంటున్న కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ నిలిచాడు. అతన్ని గత వేలంలో సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ ఏకంగా రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

కేఎల్ రాహుల్ - రూ.17 కోట్లు

పంజాబ్ కింగ్స్ ను వదిలి గత రెండు సీజన్లుగా కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉంటున్న కేఎల్ రాహుల్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు రూ.17 కోట్లు అందుకుంటుండటం విశేషం.

రిషబ్ పంత్ - రూ.16 కోట్లు

గతేడాది ఐపీఎల్ మిస్ అయిన రిషబ్ పంత్ ఈసారి మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పంత్ ఆ టీమ్ నుంచి రూ.16 కోట్లు అందుకుంటున్నాడు.

హార్దిక్ పాండ్యా - రూ.15 కోట్లు

గుజరాత్ టైటన్స్ వదిలి ఈసారి తన పాత టీమ్ ముంబై ఇండియన్స్ లో చేరిన హార్దిక్ పాండ్యా ఏకంగా కెప్టెన్ అయ్యాడు. అతనికి ముంబై ఫ్రాంఛైజీ రూ.15 కోట్లు ఇస్తోంది.

సంజూ శాంసన్ - రూ.14 కోట్లు

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ ఫ్రాంఛైజీ నుంచి రూ.14 కోట్లు అందుకుంటున్నాడు. గత కొన్ని సీజన్లుగా శాంసనే ఆ టీమ్ కెప్టెన్ గా ఉంటున్న విషయం తెలిసిందే.

శ్రేయస్ అయ్యర్ - రూ.12.25 కోట్లు

ఈసారి మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా తిరిగొచ్చాడు శ్రేయస్ అయ్యర్. అతనికి ఆ ఫ్రాంఛైజీ రూ.12.25 కోట్లు చెల్లిస్తోంది.

ఎమ్మెస్ ధోనీ - రూ.12 కోట్లు

2008లో జరిగిన తొలి ఐపీఎల్ వేలంలో రూ.6 కోట్లు పలికి అత్యధిక ధర పొందిన ఆటగాడిగా నిలిచిన ఎమ్మెస్ ధోనీ.. 16 సీజన్లపాటు సీఎస్కేకు కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఆ ఫ్రాంఛైజీ అతనికి రూ.12 కోట్లు చెల్లిస్తోంది.

శిఖర్ ధావన్ - రూ. 8.25 కోట్లు

శిఖర్ ధావన్ గతేడాది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయ్యాడు. అతనికి ఆ ఫ్రాంఛైజీ రూ.8.25 కోట్లు చెల్లిస్తోంది. అంతకుముందు జరిగిన వేలంలో ధావన్ ను పంజాబ్ కింగ్స్ ఇంత మొత్తానికి కొనుగోలు చేసింది.

శుభ్‌మన్ గిల్ - రూ.8 కోట్లు

హార్దిక్ పాండ్యా తప్పుకోవడంతో అనూహ్యంగా గుజరాత్ టైటన్స్ కెప్టెన్సీ చేపడుతున్నాడు శుభ్‌మన్ గిల్. దీనికోసం అతనికి రూ.8 కోట్లు దక్కుతున్నాయి.

ఫాఫ్ డుప్లెస్సి - రూ.7 కోట్లు

ఐపీఎల్లో ప్రస్తుతం అతి తక్కువ మొత్తం అందుకుంటున్న కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి. విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత ఆ బాధ్యతలు తీసుకున్న డుప్లెస్సికి ఆర్సీబీ రూ.7 కోట్లు చెల్లిస్తోంది.