Rachin Ravindra: సచిన్, ద్రవిడ్ పేర్లతో రచిన్‌కు సంబంధం లేదంటున్న అతని తండ్రి.. మరి ఆ పేరు ఎలా వచ్చింది?-rachin ravindra name not the mix of rahul and sachin says his father ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rachin Ravindra: సచిన్, ద్రవిడ్ పేర్లతో రచిన్‌కు సంబంధం లేదంటున్న అతని తండ్రి.. మరి ఆ పేరు ఎలా వచ్చింది?

Rachin Ravindra: సచిన్, ద్రవిడ్ పేర్లతో రచిన్‌కు సంబంధం లేదంటున్న అతని తండ్రి.. మరి ఆ పేరు ఎలా వచ్చింది?

Hari Prasad S HT Telugu
Nov 14, 2023 12:34 PM IST

Rachin Ravindra: సచిన్, ద్రవిడ్ పేర్లతో రచిన్‌కు సంబంధం లేదంటున్నాడు అతని తండ్రి రవి కృష్ణమూర్తి. అతనికి ఆ పేరు ఎలా పెట్టాల్సి వచ్చిందో ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర
న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర (PTI)

Rachin Ravindra: న్యూజిలాండ్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర పేరు చూసి ఇన్నాళ్లూ రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ ల పేర్లను మిక్స్ చేస్తే వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ అతని పేరు వెనుక ఉన్న అసలు స్టోరీని రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి వివరించారు. అసలు ద్రవిడ్, సచిన్ ల పేర్లతో రచిన్ కు సంబంధమే లేదని ఆయన చెప్పడం విశేషం.

తాము కూడా కొన్నేళ్ల తర్వాతే రచిన్ పేరు ఇలా రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్ల కలయిక అని గుర్తించినట్లు రవి తెలిపారు. ది ప్రింట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బెంగళూరుకు చెందిన రవి.. తర్వాత న్యూజిలాండ్ వెళ్లి సెటిలయ్యారు. అక్కడే పుట్టిపెరిగిన రచిన్.. తర్వాత నేషనల్ క్రికెట్ టీమ్ కు ఆడే స్థాయికి చేరాడు.

రచిన్ పేరు అలా వచ్చింది

రచిన్ అనే పేరును మొదట తన భార్య సూచించిందని రవి కృష్ణమూర్తి చెప్పారు. "రచిన్ పుట్టినప్పుడు నా భార్య ఆ పేరు సూచించింది. దానిపై మేము పెద్దగా చర్చించుకోలేదు. పేరు బాగుంది, సులువుగా పలికేలా ఉంది. దీంతో అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. కొన్నేళ్ల తర్వాతే మాకు కూడా అది రాహుల్, సచిన్ ల కలయిక అని తెలిసింది. మా కొడుకును ఓ క్రికెటర్ గా చేయాలన్న ఉద్దేశంతో పెట్టిన పేరు కాదు" అని రవి స్పష్టం చేశారు.

రచిన్ పేరు ఆ ఇద్దరే గొప్ప క్రికెటర్ల పేర్ల మీదుగానే వచ్చిందని ఇన్నాళ్లూ అందరూ భావిస్తూ వచ్చారు. వాళ్ల పేర్లను నిలబెడుతూ.. వరల్డ్ కప్ 2023లో రచిన్ 25 ఏళ్ల వయసులోనే చెలరేగిపోతున్నాడనీ అనుకున్నారు. కానీ ఇప్పుడతని తండ్రి ఇచ్చిన సమాధానంతో అసలు ద్రవిడ్, సచిన్ లకు.. రచిన్ పేరుకు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది.

వరల్డ్ కప్ 2023 లీగ్ స్టేజ్ లో రచిన్ 9 మ్యాచ్ లలో ఏకంగా 565 రన్స్ చేశాడు. అందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లి, క్వింటన్ డికాక్ తర్వాత మూడో స్థానంలో రచిన్ ఉన్నాడు. ఇప్పుడు ఇండియాతో బుధవారం (నవంబర్ 15) సెమీఫైనల్ జరగనున్న నేపథ్యంలో రచిన్ ఎలా రాణిస్తాడో చూడాలి.