Rachin Ravindra: పేరులో ద్రవిడ్, సచిన్.. ఆటలో యువరాజ్ సింగ్.. రచిన్ రవీంద్రపై కుంబ్లే
Rachin Ravindra: రచిన్ నాకు ఓ యువరాజ్ సింగ్‌లా కనిపిస్తున్నాడని అన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే. ఇంగ్లండ్ తో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో రచిన్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.
Rachin Ravindra: న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర. అతని పేరు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియన్ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లను కలిపి రచిన్ అని పెట్టారు. కానీ అతని ఆట చూస్తే మాత్రం తనకు యువరాజ్ సింగ్ గుర్తుకు వస్తున్నాడని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అనడం విశేషం.
వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు ప్లేయర్ గా రచిన్ రవీంద్ర నిలిచిన విషయం తెలిసిందే. అతడు ఇంగ్లండ్ పై 96 బంతుల్లోనే 123 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు మరో సెంచరీ హీరో డెవోన్ కాన్వేతో కలిసి రెండో వికెట్ కు అజేయంగా 273 రన్స్ జోడించాడు. ఇద్దరి జోరుతో ఇంగ్లండ్ ను న్యూజిలాండ్ 9 వికెట్లతో సులువుగా చిత్తు చేసింది.
రచిన్ ఇన్నింగ్స్ చూసిన కుంబ్లే.. అతన్ని ఆకాశానికెత్తాడు. "పాకిస్థాన్ తో వామప్ మ్యాచ్ లోనే అతని సామర్థ్యం ఏంటో తెలిసింది. ఆ మ్యాచ్ లో అతడు ఓపెనర్ గా వచ్చాడు. కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. వరల్డ్ కప్ లో అతనికిదే తొలి మ్యాచ్. అందులోనూ డిఫెండింగ్ ఛాంపియన్ తో ఆడుతున్నారు. రచిన్ రవీంద్ర తన సత్తా ఏంటో చాటాడు. అతడు కాస్త యువరాజ్ సింగ్ లా కనిపిస్తున్నాడు. యువకుడైనా యువరాజ్ సింగ్ ఎలా ఉండేవాడో అలా. చాలా అందంగా షాట్లు ఆడాడు. అద్భుతం" అని కుంబ్లే అన్నాడు.
రచిన్ రవీంద్ర నిజానికి ఆల్ రౌండరే. యువరాజ్ లాగా లెఫ్టాండ్ బ్యాటర్ కూడా. 2011 వరల్డ్ కప్ లో ఇండియా విజయంలో యువీదే కీలకపాత్ర. ఇప్పుడు న్యూజిలాండ్ తరఫున రచిన్ కూడా అద్భుతంగా తన కెరీర్ ప్రారంభించాడు. రానున్న మ్యాచ్ లలో దానిని ఎలా కొనసాగిస్తాడన్నది ఆసక్తికరం. 23 ఏళ్ల ఈ భారత సంతతి క్రికెటర్ న్యూజిలాండ్ క్రికెట్ లో ఓ స్థాయికి ఎదగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.