Babar Azam: ఇండియాలో ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదు.. పాకిస్థాన్‌లో ఉన్నట్లే ఉంది: బాబర్ ఆజం-babar azam says he did not expect this hospitality in india feels like in pakistan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Babar Azam: ఇండియాలో ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదు.. పాకిస్థాన్‌లో ఉన్నట్లే ఉంది: బాబర్ ఆజం

Babar Azam: ఇండియాలో ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదు.. పాకిస్థాన్‌లో ఉన్నట్లే ఉంది: బాబర్ ఆజం

Hari Prasad S HT Telugu
Oct 04, 2023 03:55 PM IST

Babar Azam: ఇండియాలో ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదు.. పాకిస్థాన్‌లో ఉన్నట్లే ఉంది అని అన్నాడు ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం. వరల్డ కప్ కు ముందు బుధవారం (అక్టోబర్ 4) కెప్టెన్స్ డేలో పాల్గొన్న బాబర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వరల్డ్ కప్ కెప్టెన్స్ డే రౌండ్ టేబుల్లో మాట్లాడుతున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, పక్కన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్
వరల్డ్ కప్ కెప్టెన్స్ డే రౌండ్ టేబుల్లో మాట్లాడుతున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, పక్కన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (REUTERS)

Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్ కోసం వారం కిందట ఇండియాలో అడుగుపెట్టింది. వరల్డ్ కప్ లో తాము తొలి మ్యాచ్ లు ఆడబోయే హైదరాబాద్ కు పాక్ టీమ్ వచ్చింది. అయితే ఇక్కడ ఆ జట్టుకు అపూర్వ స్వాగతం లభించింది. ఎక్కడికి వెళ్లినా పాకిస్థాన్ టీమ్ ను అభిమానులు ఆదరిస్తున్నారు. ఈ ఆతిథ్యంపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

అసలు తాను ఇండియాలో తమకు ఇంతటి ఆదరణ లభిస్తుందని ఊహించలేదని అన్నాడు. వరల్డ్ కప్ గురువారం (అక్టోబర్ 5) నుంచి ప్రారంభం కానుండగా.. ఒక రోజు ముందు బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కెప్టెన్స్ డే నిర్వహించారు. దీనికి టోర్నీలో పాల్గొనే మొత్తం 10 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ తమ అనుభవాలను పంచుకున్నారు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. "చాలా బాగా అనిపిస్తోంది. మాకు గొప్ప ఆతిథ్యం లభించింది. ఎప్పుడూ ఇలాంటిది ఊహించలేదు. ప్రతి ఒక్కరూ బాగా ఆస్వాదించారు. హైదరాబాద్ వచ్చి వారం అవుతోంది. అసలు మేము ఇండియాలో ఉన్న ఫీలింగ్ రాలేదు. ఇంటి దగ్గరే ఉన్నట్లు అనిపించింది. మేము దీనిని బాగా ఎంజాయ్ చేశాం. టోర్నమెంట్లో మా 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ఇది గొప్ప అవకాశం" అని అన్నాడు.

వరల్డ్ కప్ 2023లో భాగంగా గురువారం తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, 2019 వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనుంది. ఒక రోజు ముందే ఓపెనింగ్ సెర్మనీ నిర్వహిస్తారని మొదట వార్తలు వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఇప్పుడు క్లోజింగ్ సెర్మనీ లేదంటే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు సెర్మనీ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు పాకిస్థాన్ టీమ్ ఇప్పటికే హైదరాబాద్ లో రెండు వామప్ మ్యాచ్ లు ఆడింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో ఆడిన పాక్.. రెండింట్లోనూ ఓడిపోయింది. ఇక శుక్రవారం (అక్టోబర్ 6) తమ తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ తో ఉప్పల్ స్టేడియంలోనే పాకిస్థాన్ తలపడనుంది.

Whats_app_banner