India at Asian Games: ఏషియన్ గేమ్స్‌లో ఇండియా సరికొత్త చరిత్ర.. అత్యధిక మెడల్స్.. ఇక టార్గెట్ 100
India at Asian Games: ఏషియన్ గేమ్స్‌లో ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ ఈ గేమ్స్ లో సాధించలేనన్ని మెడల్స్ సొంతం చేసుకుంది. ఇక టార్గెట్ 100 దిశగా దూసుకెళ్తోంది.
India at Asian Games: ఏషియన్ గేమ్స్ లో ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈసారి పతకాల పంట పండిస్తున్న మన అథ్లెట్లు.. గతంలో ఎన్నడూ లేనన్ని మెడల్స్ సాధించారు. 11వ రోజైన బుధవారం (అక్టోబర్ 4) ఉదయం వరకే ఇండియా మెడల్స్ సంఖ్య 71కి చేరింది. గేమ్స్ ఇంకా నాలుగు రోజులు ఉండటంతో 100 మెడల్స్ లక్ష్యం ఈసారి నెరవేరేలా కనిపిస్తోంది.
ఏషియన్ గేమ్స్ లో ఇప్పటి వరకూ ఇండియా సాధించిన అత్యధిక మెడల్స్ 70. చివరిసారి 2018లో జకార్తాలో జరిగిన గేమ్స్ లో ఇండియా ఈ మెడల్స్ గెలుచుకుంది. అయితే ఈసారి హాంగ్జౌ గేమ్స్ లో మాత్రం 11వ రోజే ఈ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించింది. ఈసారి ఎన్నడూ లేని విధంగా 655 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన ఇండియా.. కనీసం 100 మెడల్స్ లక్ష్యం పెట్టుకుంది.
టార్గెట్ 100 సాధ్యమేనా?
ఇండియా ఏషియన్ గేమ్స్ పదో రోజును 69 మెడల్స్ తో ముగించి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక 11వ రోజు అత్యధిక మెడల్స్ రికార్డును అధిగమించడానికి పెద్దగా సమయం పట్టలేదు. బుధవారం (అక్టోబర్ 4) జరిగిన తొలి ఈవెంట్ 35 కి.మీ. రేస్ వాక్ లో ఇండియాకు చెందిన రామ్ బాబు, మంజు రాణి బ్రాంజ్ మెడల్ గెలిచారు. ఈ పతకంతో ఇండియా తన గత రికార్డును సమం చేసింది.
ఓ గంట తర్వాత ఇండియా ఆ రికార్డును బ్రేక్ చేసింది. కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది. ఇండియాకు చెందిన జ్యోతి సురేఖ, ప్రవీణ్ ఓజస్ ఈ గోల్డ్ గెలిచారు. ఇది ఇండియాకు ఓవరాల్ గా ఏషియన్ గేమ్స్ 2023లో 71వ మెడల్ కాగా.. 16వ గోల్డ్ మెడల్. మొత్తంగా ఇండియా ఇప్పటి వరకూ 16 గోల్డ్ మెడల్స్, 26 సిల్వర్, 29 బ్రాంజ్ మెడల్స్ గెలిచింది.
ఆర్చరీలో మరో మూడు మెడల్స్ ఖాయమయ్యాయి. అందులో రెండు గోల్డ్ మెడల్స్ కూడా కావచ్చు. ఇక స్క్వాష్ డబుల్స్ లో మరో రెండు మెడల్స్ ఖాయంగా వస్తాయి. ఆ లెక్కన ఇండియా మెడల్స్ కచ్చితంగా 78కి చేరుతాయి. ఇప్పటి వరకూ షూటింగ్ లో 22, అథ్లెటిక్స్ లో 23 మెడల్స్ వచ్చాయి. అథ్లెటిక్స్ లో నీరజ్ చోప్రా ఫైనల్ తోపాటు మరికొన్ని ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి.
దీంతో ఇండియాకు మరిన్న మెడల్స్ రావడం ఖాయం. ప్రస్తుతం ఇండియా పతకాల జాబితాలో చైనా, జపాన్, సౌత్ కొరియా తర్వాత నాలుగో స్థానంలో ఉంది. ఇంకా రెజ్లింగ్, హాకీ, మెన్స్ క్రికెట్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, స్క్వాష్, బాక్సింగ్, కబడ్డీ, అథ్లెటిక్స్ లో ఇండియన్ అథ్లెట్లు పోటీ పడనున్నారు. ఆ లెక్కన 90 మెడల్స్ పైగా గెలవడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.