IPL 2024 PBKS vs GT: ఆల్‍రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన గుజరాత్.. పంజాబ్‍పై ప్రతీకార గెలుపు
PBKS vs GT - IPL 2024: గుజరాత్ టైటాన్స్ జట్టు మళ్లీ గెలుపు బాటపట్టింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో గుజరాత్ విజయం సాధించింది. ఆల్‍రౌండ్ షోతో మెప్పించింది.
IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ మరోసారి ఆల్‍రౌండ్ షోతో మెప్పించింది. పటిష్టమైన బౌలింగ్‍తో పంజాబ్ కింగ్స్ జట్టును కట్టడి చేసిన గుజరాత్.. ఆ తర్వాత లక్ష్యఛేదనలో బ్యాటింగ్‍లోనూ రాణించి అలవోక విజయం సాధించింది. ఈ సీజన్‍లో తనను ఓసారి ఓడించిన పంజాబ్‍పై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది గుజరాత్. ముల్లాన్పూర్ వేదికగా నేడు (ఏప్రిల్ 21) జరిగిన ఐపీఎల్ మ్యాచ్‍లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో పంజాబ్‍పై విజయం సాధించింది. శుభ్‍మన్ గిల్ సేన మళ్లీ గెలుపుబాట పట్టింది.
పంజాబ్‍ను కూల్చిన సాయి కిశోర్
గుజరాత్ స్పిన్నర్ సాయికిశోర్ నాలుగు వికెట్లతో విజృంభించడం సహా మిలిగిన బౌలర్లు కూడా సమిష్టిగా రాణించారు. దీంతో టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పెద్ద స్కోరు చేయలేకపోయింది. 20 ఓవర్లలో 142 పరుగులకు పంజాబ్ ఆలౌటైంది. ప్రభ్ సిమ్రన్ సింగ్ (35) రాణించగా.. చివర్లో హర్ప్రీత్ బ్రార్ (12 బంతుల్లో 29 పరుగులు) మెరిపించాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా సత్తాచాటలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఏ దశలోనూ దూకుడుగా ఆడలేకపోయింది.
గుజరాత్ బౌలర్లలో సాయికిశోర్ 4 వికెట్లతో సత్తాచాటి.. చివర్లో పంజాబ్‍ను టపాటపా కూల్చాడు. మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ తలా రెండు వికెట్లతో రాణిస్తే.. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీసి మెరిశారు రషీద్ ఖాన్.
టెన్షన్ పడినా సునాయాసంగానే..
స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సునాయాసంగానే ఛేదించింది. వృద్ధిమాన్ సాహా (13) త్వరగానే ఔటైనా.. గుజరాత్ కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (35), సాయిసుదర్శన్ (31) నిలకడగా ఆడారు. వికెట్లు కాపాడుకుంటూనే క్రమంగా పరుగులు రాబట్టారు. గిల్‍ను 10వ ఓవర్లో పంజాబ్ స్పిన్నర్ లివింగ్‍స్టోన్ ఔట్ చేశాడు. కాసేపటికే డేవిడ్ మిల్లర్ (4)ను కూడా అతడే పెవిలియన్‍కు పంపడంతో ఓ దశలో ఉత్కంఠ నెలకొంది. దీంతో 77 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్. సాయి సుదర్శన్ కూడా కాసేపటికి వెనుదిరిగాడు.
అయితే, రాహుల్ తెవాతియా ఆ తర్వాత అదరగొట్టాడు. కేవలం 18 బంతుల్లోనే 36 పరుగులతో మెప్పించాడు. అజేయంగా చివరి వరకు నిలిచి గుజరాత్‍ను గెలిపించాడు. షారుఖ్ ఖాన్ (8), రషీద్ ఖాన్ (3) ఔటైనా.. తెవాతియా చివరి వరకు నిలిచాడు. 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసి గుజరాత్ గెలిచింది.
పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, లియామ్ లివింగ్ స్టోన్ రెండు, సామ్ కరన్, అర్షదీప్ చెరో వికెట్ తీసుకున్నారు. పంజాబ్ జట్టుకు ఇది వరుసగా నాలుగో పరాజయంగా ఉంది.
ప్రతీకారం
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఏప్రిల్ 4న జరిగిన మ్యాచ్‍లో గుజరాత్‍పై పంజాబ్ కింగ్స్ ఉత్కంఠ విజయం సాధించింది. గుజరాత్ హోం గ్రౌండ్‍లో కింగ్స్ గెలిచింది. అయితే, ఆ పరాజయానికి ఇప్పుడు గుజరాత్ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. పంజాబ్ హోం గ్రౌండ్‍లో నేడు (ఏప్రిల్ 21) ఆ జట్టును జీటీ ఓడించింది.
ఆరో ప్లేస్‍కు గుజరాత్
ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచి.. నాలుగో ఓడి ప్రస్తుతం 8 పాయింట్లతో గుజరాత్ ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానికి ఎగబాకింది. 8 మ్యాచ్‍ల్లో ఆరు పరాజయాలతో పంజాబ్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.