IPL 2024 MI vs RR: సొంతగడ్డపై అయినా ముంబై ఇండియన్స్ గాడిలో పడుతుందా? ఎంఐ వర్సెస్ ఆర్ఆర్‌లో గెలుపెవరిది?-ipl 2024 mi vs rr mumbai indians return to wankhede can hardik pandya rohit sharma team win against rajasthan royals ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Mi Vs Rr: సొంతగడ్డపై అయినా ముంబై ఇండియన్స్ గాడిలో పడుతుందా? ఎంఐ వర్సెస్ ఆర్ఆర్‌లో గెలుపెవరిది?

IPL 2024 MI vs RR: సొంతగడ్డపై అయినా ముంబై ఇండియన్స్ గాడిలో పడుతుందా? ఎంఐ వర్సెస్ ఆర్ఆర్‌లో గెలుపెవరిది?

Hari Prasad S HT Telugu
Apr 01, 2024 10:55 AM IST

IPL 2024 MI vs RR: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై అయినా గాడిలో పడుతుందా? ఈ ఏడాది ఐపీఎల్లో తొలి విజయం సాధిస్తుందా? రాజస్థాన్ రాయల్స్ తో వాంఖెడేలో కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది హార్దిక్ సేన.

సొంతగడ్డపై అయినా ముంబై ఇండియన్స్ గాడిలో పడుతుందా? ఎంఐ వర్సెస్ ఆర్ఆర్‌లో గెలుపెవరిది?
సొంతగడ్డపై అయినా ముంబై ఇండియన్స్ గాడిలో పడుతుందా? ఎంఐ వర్సెస్ ఆర్ఆర్‌లో గెలుపెవరిది? (PTI)

IPL 2024 MI vs RR: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తోంది. ఈ సీజన్లో విమర్శలకు తోడు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ దారుణమైన పరాజయాలు ఆ టీమ్ ను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం (ఏప్రిల్ 1) తమ సొంత మైదానం వాంఖెడేలో రాజస్థాన్ రాయల్స్ తో ఆ టీమ్ తలపడనుంది. మరి హార్దిక్ సేన గాడిలో పడుతుందా?

ఎంఐ vs ఆర్ఆర్.. గెలుపెవరిది?

ముంబై ఇండియన్స్ ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడి టేబుల్లో చివరి స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్ లలోనూ గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది. రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ మార్పు తర్వాత సొంత అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ముంబై జట్టుకు ఫలితాలు కూడా చేదు అనుభవాన్నే మిగిలిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ముంబై జట్టుతోపాటు హార్దిక్ పాండ్యాకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. వాంఖెడేలోనూ ఆ టీమ్ ఓడిపోతే మాత్రం విమర్శలు మరింత తీవ్రమవడం ఖాయం. అహ్మదాబాద్ లో ప్రేక్షకుల హేళన ఎదుర్కొన్న హార్దిక్ కు.. ముంబైలోనూ అలాంటి అనుభవమే ఎదురవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తికరం.

గుజరాత్ టైటన్స్ కు ఓసారి టైటిల్ అందించి, మరోసారి ఫైనల్ చేర్చిన హార్దిక్.. ముంబైతో అదే మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతున్నాడు. పైగా బుమ్రాను సరిగా వాడుకోకపోవడం, తప్పుడు నిర్ణయాలు అతన్ని మరిన్ని చిక్కుల్లోకి పడేశాయి. ఈ నేపథ్యంలో మాంచి ఊపు మీదున్న రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ముంబైకి పెద్ద పరీక్ష కాబోతోంది.

ఎంఐ vs ఆర్ఆర్ రికార్డులు

ఐపీఎల్లో ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ 27సార్లు తలపడ్డాయి. అందులో ముంబై 15, రాజస్థాన్ 12 విజయాలు సాధించాయి. గతేడాది ఈ రెండు టీమ్స్ చివరిసారి తలపడినప్పుడు ముంబై 6 వికెట్లతో గెలిచింది. అయితే ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ముంబై తీవ్ర ఒత్తిడిలో ఉండగా.. రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలపై కన్నేసింది.

పిచ్ ఎలా ఉందంటే?

వాంఖెడే స్టేడియం ఈమధ్య చేజింగ్ టీమ్స్ కు కలిసొస్తోంది. గత ఏడు మ్యాచ్ లలో ఐదు చేజింగ్ టీమే గెలిచింది. రాత్రి పూట మంచు ప్రభావం కూడా చేజింగ్ జట్లకు బాగా కలిసొస్తోంది. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి పిచ్ పై భారీ స్కోర్లు నమోదు కానున్నట్లు అంచనా వేస్తున్నారు.

అయితే ముంబై సొంతగడ్డపై ఆడుతుండటం, గత రికార్డులు పరిశీలిస్తే.. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయావకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గూగుల్ విన్ ప్రెడిక్టర్ ప్రకారం ముంబైకి 55 శాతం, రాజస్థాన్ కు 45 శాతం విజయావకాశాలు ఉన్నాయి. మరి సొంత మైదానంలో అయినా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా తన జట్టుకు తొలి విజయం అందిస్తాడో లేదో చూడాలి.

Whats_app_banner