India vs England 1st Test Score: టీమిండియాదే తొలి రోజు.. ఇంగ్లండ్ కొంప ముంచిన బజ్‌బాల్
India vs England 1st Test Score: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజే టీమిండియా పైచేయి సాధించింది. బజ్‌బాల్ అంటూ ఇండియా గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ కు స్పిన్ దెబ్బ గట్టిగానే తగిలింది.
India vs England 1st Test Score: ఇంగ్లండ్ బజ్‌బాల్ స్టైల్ టెస్ట్ క్రికెట్ కు ఇండియా గడ్డపై తొలి రోజే గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ లో ప్రారంభమైన తొలి టెస్ట్ తొలి రోజు టీమిండియా పూర్తిగా పైచేయి సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకే ఆలౌట్ చేసిన ఇండియన్ టీమ్.. తర్వాత తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 119 రన్స్ చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే ఇంకా 127 రన్స్ వెనుకబడి ఉంది.
యశస్వి బజ్‌బాల్ ఫిఫ్టీ
బజ్‌బాల్ స్టైల్లో ఎలా ఆడాలో ఇంగ్లండ్ కు తన ఇన్నింగ్స్ ద్వారా చూపించాడు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్. అతడు ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ఇంగ్లండ్ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా ఆ టీమ్ తరఫున తొలి టెస్ట్ ఆడుతున్న లెఫ్టామ్ స్పిన్నర్ హార్ట్‌లీ బౌలింగ్ లో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో అతడు 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్స్ లతో హాఫ్ సెంచరీ చేశాడు.
మొదట్లో టీ20 ఫార్మాట్ లాగా రెచ్చిపోయిన అతడు.. తర్వాత వన్డే స్టైల్ కి తగ్గినా ఇంకా టెస్ట్ ఫార్మాట్ కు రాలేదు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి.. 70 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్ లతో 76 రన్స్ చేజి అజేయంగా నిలిచాడు. అతని జోరుతో తొలి రోజు 23 ఓవర్లు మాత్రమే ఆడిన ఇండియన్ టీమ్ వికెట్ నష్టానికి 119 రన్స్ చేయడం విశేషం.
కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 27 బంతుల్లోనే 24 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అతడు కూడా ఒకదశలో ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగినా.. లీచ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయే ఔటయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడుతూ.. ఆట ముగిసే సమయానికి 43 బంతుల్లో 14 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇంగ్లండ్ కు స్పిన్ ఉచ్చు
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్, జడేజా, అక్షర్ స్పిన్ త్రయం ఇంగ్లండ్ బ్యాటర్ల పని పట్టారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రమే 88 బంతుల్లో 70 రన్స్ చేశాడు. అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు తీయగా.. అక్షర్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. దీంతో ఇంగ్లండ్ 64.3 ఓవర్లలోనే 246 రన్స్ కు ఆలౌటైంది.
ఇండియాలోనూ బజ్‌బాల్ స్టైల్లోనే ఆడతామని చెప్పే వచ్చిన ఇంగ్లండ్.. తొలి రోజు అలాగే ఆడింది. అయితే ఇది వాళ్లను పెద్ద దెబ్బే కొట్టింది. తొలి రోజే స్పిన్ కు అనుకూలించిన స్పిన్ పిచ్ పై కాసేపు డిఫెన్స్ ఆడి ఉంటే మంచి స్కోరు సాధించేవాళ్లు. ప్రస్తుతం ఇండియన్ టీమ్ తొలి రోజు పైచేయి సాధించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఎంత భారీ స్కోరు సాధించగలిగితే ఈ మ్యాచ్ పై అంత పట్టు బిగించే అవకాశం దక్కుతుంది.