IND vs NZ Record: భారత్ క్రికెటర్ ఒకే మ్యాచ్‌లో డైమండ్ డక్, గోల్డెన్ డక్.. చరిత్రలో ఒకే ఒక్కడు!-india fast bowler akash deep makes embarrassing world record in india vs new zealand 3rd test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz Record: భారత్ క్రికెటర్ ఒకే మ్యాచ్‌లో డైమండ్ డక్, గోల్డెన్ డక్.. చరిత్రలో ఒకే ఒక్కడు!

IND vs NZ Record: భారత్ క్రికెటర్ ఒకే మ్యాచ్‌లో డైమండ్ డక్, గోల్డెన్ డక్.. చరిత్రలో ఒకే ఒక్కడు!

Galeti Rajendra HT Telugu

Akash Deep Record: భారత్ జట్టులోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ దీప్ వాంఖడే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ.. ఒక్క బంతిని కూడా బ్యాట్‌తో హిట్ చేయలేకపోయాడు.

ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ (AP)

న్యూజిలాండ్‌తో వాంఖడే వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టెస్టులో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ అరుదైన చెత్త రికార్డ్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయిన ఆకాశ్ దీప్.. తొలి ఇన్నింగ్స్‌లో డైమండ్ డక్, రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇలా ఔటైన తొలి క్రికెటర్‌గా ఆకాశ్ దీప్ నిలిచాడు.

మ్యాచ్‌లో మూడో రోజైన ఆదివారం 147 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు 121 పరుగులకే ఆలౌటవగా.. 25 పరుగుల తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ టీమ్ మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకుంది. భారత్ జట్టు సొంతగడ్డపై 24 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కి గురైంది.

డైమండ్ డక్ అంటే?

ఒక ఆటగాడు క్రికెట్ మ్యాచ్‌లో ఒక్క బంతిని ఆడకుండానే సున్నాకే ఔట్ అయిపోతే అతడ్ని డైమండ్ డక్‌గా పరిగణిస్తారు. వాంఖడే టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క బంతిని కూడా ఎదుర్కోని ఆకాశ్ దీప్.. రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో గోల్డెన్ డక్‌గా అతను పెవిలియన్‌ చేరిపోయాడు. దాంతో ఒకే మ్యాచ్‌లో డైమండ్, గోల్డెన్ డక్‌గా ఔటైన ప్లేయర్‌గా అరుదైన చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు.

బుమ్రాకి రెస్ట్ ఇవ్వడంతో ఛాన్స్

బీహార్‌కి చెందిన 27 ఏళ్ల ఆకాశ్ దీప్ ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటి భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా.. న్యూజిలాండ్‌తో సిరీస్‌ మొత్తం అతనికి ఆడే అవకాశం దక్కలేదు.

ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను మాత్రమే కెప్టెన్ రోహిత్ శర్మ కొనసాగించాడు. దాంతో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్‌కి అవకాశం దక్కింది. అయితే.. చివరి టెస్టులో జస్‌ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇవ్వడంతో ఆకాశ్ దీప్‌కి ఛాన్స్ దక్కింది. కానీ.. బంతితో పాటు బ్యాట్‌తోనూ ఈ పేసర్ నిరాశపరిచాడు.

ఆకాశ్ కెరీర్‌లో అన్నీ బౌండరీలే

ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడిన ఆకాశ్ దీప్ 10 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే.. 3.74 ఎకానమీతో పరుగులిచ్చేస్తుండటం అతని బలహీనతగా మారిపోతోంది. ఇక బ్యాటింగ్‌లో ఇప్పటి వరకు 5 టెస్టులకిగానూ.. కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే ఆకాశ్ దీప్‌కి బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను చేసిన పరుగులు 45 మాత్రమే. కానీ.. ఇందులో 40 పరుగులు సిక్స్‌లు, ఫోర్ల రూపంలోనే రావడం గమనార్హం.