IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్థాన్.. భారత్ మార్పుల్లేకుండా.. ఓ ఛేంజ్ చేసిన పాక్.. ఆలస్యంగా మ్యాచ్
IND vs PAK T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో భారత్, పాకిస్థాన్ పోరు షురూ అయింది. వాన వల్ల కాస్త ఆలస్యంగా టాస్ పడింది. టాస్ గెలిచింది పాకిస్థాన్.
IND vs PAK T20 World Cup 2024: క్రికెట్ అభిమానులు ఎంతగానో నిరీక్షించిన భారత్, పాకిస్థాన్ ఫైట్ మొదలైంది. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ఈ ఇరు జట్లు నేడు (జూన్ 9) తలపడున్నాయి. న్యూయార్క్‌లోని నసావూ స్టేడియంలో ఇండియా, పాక్ మధ్య ప్రపంచకప్ గ్రూప్-ఏ మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం వల్ల టాస్ అరగంట ఆలస్యంగా పడింది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగనుంది.
భారత్ అదే జట్టుతో..
ఈ ప్రపంచకప్‍లో తన తొలి మ్యాచ్‍లో ఐర్లాండ్‍పై భారత్ సునాయాసంగా గెలిచింది. న్యూయార్క్ స్టేడియంలోనే విజయం సాధించింది. ఐర్లాండ్‍తో ఆడిన తుదిజట్టునే పాకిస్థాన్‍తో ఈ మ్యాచ్‍కు కూడా కొనసాగించింది టీమిండియా. ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్‍కు రానున్నారు. పిచ్ బ్యాటింగ్‍కు కష్టంగా ఉండటంతో మ్యాచ్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది.
ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‍లో అమెరికా చేతిలో పాకిస్థాన్ ఘోర పరాభవం ఎదుర్కొంది. తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. భారత్‍తో ఈ మ్యాచ్‍కు తుది జట్టులో ఓ మార్పు చేసింది పాక్. ఆజమ్ ఖాన్ స్థానంలో ఇమాద్ వసీంను తుదిజట్టులోకి తీసుకుంది.
న్యూయార్క్ పిచ్‍పై వామప్ మ్యాచ్‍తో పాటు ఐర్లాండ్‍తో ఆడడంతో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు సహకరించిందని టాస్ సమయంలో చెప్పాడు రోహిత్ శర్మ. ప్రపంచకప్‍లో ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనని అన్నాడు. ఈ పిచ్‍పై ఎంత స్కోరు చేస్తే డిఫెండ్ చేసుకోవచ్చో మాట్లాడుకున్నామని హిట్‍మ్యాన్ తెలిపాడు.
పిచ్‍పై తేమ, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ముందుగా బౌలింగ్ తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చెప్పాడు. గతం గతమేనని, ఈ మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నామని అతడు అన్నాడు. అమెరికాపై ఓటమితో ఒత్తిడిగా లేమన్నట్టుగా బాబర్ చెప్పాడు. భారత్‍తో మ్యాచ్ అంటే ఎప్పటికీ బిగ్ గేమ్ అని అన్నాడు. ఈ మ్యాచ్‍లో ఆజమ్ ఖాన్‍మను పక్కన పెట్టినట్టు చెప్పాడు బాబర్ ఆజమ్.
ఆలస్యంగా మ్యాచ్
వర్షం వల్ల టాస్ అరగంట ఆలస్యంగా పడింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతోంది. ఇప్పటికే న్యూయార్క్ పిచ్ ఎలా ఉంటుందోనని ఆందోళన ఉంటే.. ఇప్పుడు వర్షం కూడా టెన్షన్ పెడుతోంది. వాన వల్ల ఔట్‍ఫీల్డ్ మరింత నెమ్మదిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పిచ్ బ్యాటింగ్‍కు కఠినతరంగా ఉంటుంది.
భారత తుదిజట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్
పాకిస్థాన్ తుదిజట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహిన్ షా ఆఫ్రిది, హరిస్ రవూఫ్, నసీమ్ షా, మహమ్మద్ ఆమిర్