ICC Rankings: కోహ్లిని మించిపోయిన రోహిత్.. రెండో ర్యాంక్‌లోనే గిల్-icc rankings released rohit sharma goes past virat kohli in latest odi rankings ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Rankings: కోహ్లిని మించిపోయిన రోహిత్.. రెండో ర్యాంక్‌లోనే గిల్

ICC Rankings: కోహ్లిని మించిపోయిన రోహిత్.. రెండో ర్యాంక్‌లోనే గిల్

Hari Prasad S HT Telugu
Oct 18, 2023 05:03 PM IST

ICC Rankings: కోహ్లిని మించిపోయాడు రోహిత్ శర్మ. తాజాగా బుధవారం (అక్టోబర్ 18) ఐసీసీ రిలీజ్ చేసిన వన్డే ర్యాంకుల్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో ర్యాంక్ లోనే కనసాగుతున్నాడు.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AFP)

ICC Rankings: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని మించిపోయాడు. ఐసీసీ బుధవారం (అక్టోబర్ 18) రిలీజ్ చేసిన వన్డే ర్యాంకుల్లో అతడు టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఈ వరల్డ్ కప్ లో టాప్ ఫామ్ లో ఉన్న రోహిత్ ఇప్పటికే ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తాజా ర్యాంకుల్లో అతడు కోహ్లిని వెనక్కి నెట్టాడు.

తాజా ర్యాంకుల్లో రోహిత్ శర్మ ఏకంగా ఆరో ర్యాంకుకు దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతడు 719 రేటింగ్ పాయింట్స్ తో ఉన్నాడు. మరోవైపు విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ తో కలిసి సంయుక్తంగా 8వ స్థానంలో ఉన్నాడు. మలన్ కూడా ఈ వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లలో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.

ఇక లేటెస్ట్ వన్డే ర్యాంకుల్లోనూ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం నంబర్ వన్ గా కొనసాగుతుండగా.. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలోనే ఉన్నాడు. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్ లకు దూరమైన గిల్.. పాకిస్థాన్ తో మ్యాచ్ కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఇండియాపై తొలి హాఫ్ సెంచరీ చేసిన బాబర్.. 18 రేటింగ్ పాయింట్స్ మెరుగవడంతో నంబర్ వన్ ర్యాంక్ మరింత పదిలమైంది.

రోహిత్ దూకుడు

వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై విఫలమైనా కూడా తర్వాత ఆఫ్ఘనిస్థాన్ పై సెంచరీ, పాకిస్థాన్ పై హాఫ్ సెంచరీతో రోహిత్ టాప్ ఫామ్ లోకి వచ్చాడు. అతడు మూడు మ్యాచ్ లలో 72 సగటు, 141.83 స్ట్రైక్ రేట్ తో 217 రన్స్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్ రోహితే. అంతేకాదు వన్డేల్లో అతనికిది 31వ సెంచరీ.

వన్డేల్లో సచిన్ (49), కోహ్లి (47) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు. ఇన్నాళ్లూ పాంటింగ్ (30)తో కలిసి సంయుక్తంగా మూడోస్థానంలో ఉన్న రోహిత్.. ఇప్పుడతన్ని మించిపోయాడు. వరల్డ్ కప్ లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా సచిన్ పేరిట ఉన్న రికార్డును కూడా రోహిత్ అధిగమించిన విషయం తెలిసిందే.

ఇక గాయంతో 11 నెలల పాటు దూరమై ఐర్లాండ్ సిరీస్ తో తిరిగి జట్టులోకి వచ్చిన బుమ్రా కూడా వరల్డ్ కప్ లో రాణిస్తున్నాడు. 8 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. దీంతో ర్యాంకింగ్స్ లో అతడు కగిసో రబాడాతో కలిసి 14వ స్థానంలో ఉన్నాడు. సిరాజ్ 3, కుల్దీప్ 8వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

Whats_app_banner