ICC Player of the month: ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు కోసం నామినేట్ అయ్యాడు. ఫిబ్రవరి నెలకుగాను అతని పేరును ఐసీసీ పరిశీలిస్తోంది. అతనితోపాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిస్సంక ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.
టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుంచీ యశస్వి జైస్వాల్ చెలరేగిపోతున్నాడు. టెస్టుల్లో బ్రాడ్‌మన్ తర్వాత తొలి 8 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లోనూ యశస్వి టాప్ ఫామ్ లో ఉన్నాడు. తొలి నాలుగు టెస్టుల్లో ఏకంగా 655 రన్స్ చేశాడు. అందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.
ఫిబ్రవరి నెలలో ఇంగ్లండ్ పై ఇండియా సాధించిన రెండు విజయాల్లో యశస్వి కీలక పాత్ర పోషించాడు. వైజాగ్, రాజ్‌కోట్ టెస్టులలో అతడు చేసిన డబుల్ సెంచరీలు టీమ్ కు విజయాలు సాధించి పెట్టాడు. వైజాగ్ లో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో యశస్వి 209 రన్స్ చేశాడు. ఆ తర్వాత రాజ్‌కోట్ లో మరోసారి 214 రన్స్ చేశాడు.
ఈ ఇన్నింగ్స్ లో అతడు ఏకంగా 12 సిక్స్ లో రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో ఇండియా ఏకంగా 434 రన్స్ తో గెలిచి టెస్ట్ క్రికెట్ లో తమ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇక కాంబ్లి, కోహ్లి తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసిన బ్యాటర్ గానూ యశస్వి నిలిచాడు. మొత్తంగా 8 ఇన్నింగ్స్ లో 655 రన్స్ చేశాడు.
ఇంగ్లండ్ పై ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కోహ్లిని సమం చేశాడు. ఇప్పుడు ధర్మశాలలో జరగబోయే చివరి టెస్టులో 700 రన్స్ పై కన్నేశాడు. ఒకవేళ అతడు మరో 45 రన్స్ చేస్తే గవాస్కర్ తర్వాత ఒక సిరీస్ లో 700 కంటే ఎక్కువ రన్స్ చేసిన రెండో ఇండియన్ బ్యాటర్ అవుతాడు. ఫిబ్రవరిలో యశస్వి మొత్తంగా 520 రన్స్ చేశాడు.
మరోవైపు యశస్వికి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గట్టి పోటీ ఇస్తున్నాడు. అతడు కూడా ఫిబ్రవరిలో రాణించాడు. సౌతాఫ్రికాపై 90 ఏళ్లలో తొలిసారి టెస్ట్ సిరీస్ విజయంలో విలియమ్సన్ కీలకపాత్ర పోషించాడు. రెండు టెస్టుల్లో కలిపి అతడు 403 రన్స్ చేశాడు.
సిరీస్ లో అతడు ఏకంగా మూడు సెంచరీలు చేయడం విశేషం. మరోవైపు శ్రీలంక బ్యాటర్ నిస్సంక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి శ్రీలంక బ్యాటర్ గా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ తో తొలి వన్డేలో 210 రన్స్ చేశాడు. ఆ తర్వాత మూడో వన్డేలో మరో సెంచరీతో చెలరేగాడు.