Kane Williamson: ముచ్చటగా మూడోసారి తండ్రయిన కేన్ మామ.. నువ్వు లెజెండ్ అన్న వార్నర్-kane williamson becomes father for third time david warner calls him legend cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kane Williamson: ముచ్చటగా మూడోసారి తండ్రయిన కేన్ మామ.. నువ్వు లెజెండ్ అన్న వార్నర్

Kane Williamson: ముచ్చటగా మూడోసారి తండ్రయిన కేన్ మామ.. నువ్వు లెజెండ్ అన్న వార్నర్

Hari Prasad S HT Telugu
Feb 28, 2024 03:05 PM IST

Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. ఈసారి కేన్ దంపతులకు ఓ పాప జన్మించడం విశేషం.

ముచ్చటగా మూడోసారి తండ్రయిన తర్వాత తన పాపను ఆప్యాయంగా చూసుకుంటున్న కేన్ విలియమ్సన్ దంపతులు
ముచ్చటగా మూడోసారి తండ్రయిన తర్వాత తన పాపను ఆప్యాయంగా చూసుకుంటున్న కేన్ విలియమ్సన్ దంపతులు

Kane Williamson: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తాను మూడోసారి తండ్రి అయినట్లు బుధవారం (ఫిబ్రవరి 28) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అతని భార్య సారా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన భార్య, ముద్దుల కూతురుతో కలిసి ఉన్న ఫొటోను విలియమ్సన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

విలియమ్సన్‌కు పాప

కేన్ విలియమ్సన్, సారా దంపతులకు ఇది మూడో సంతానం. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో చెబుతూ.. "మూడో సంతానం వచ్చేసింది. వెల్‌కమ్ టు ద వరల్డ్ బ్యూటీఫుల్ గర్ల్. జాగ్రత్తగా భూమి మీద అడుగు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అందమైన ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను" అని విలియమ్సన్ అన్నాడు. ఇప్పటికే విలియమ్సన్ కు ఓ మూడేళ్ల పాప, రెండేళ్ల బాబు ఉన్నారు.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. కంగ్రాట్స్ లెజెండ్ అని ఈ పోస్టుపై కామెంట్ చేశాడు. ఈ మధ్యే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు తమ రెండో సంతానానికి వెల్కమ్ చెప్పిన విషయం తెలిసిందే. వాళ్లకు బాబు పుట్టగా అతనికి అకాయ్ అనే పేరు పెట్టారు. అప్పుడే అతని పేరు తెగ పాపులర్ అయిపోయింది.

ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు ఈ ఆనంద క్షణాలను సెలబ్రేట్ చేసుకోవడానికి నేషనల్ డ్యూటీల నుంచి లీవ్ తీసుకున్నారు. విరాట్ కోహ్లి మొత్తం ఇంగ్లండ్ సిరీస్ కు దూరం కాగా.. విలియమ్సన్ ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి లండన్ లోనే ఉన్న విషయం తెలిసిందే. అక్కడే అనుష్క బాబుకు జన్మనిచ్చింది.

టాప్ ఫామ్‌లో విలియమ్సన్

తన భార్య డెలివరీ కోసం న్యూజిలాండ్ టీమ్ నుంచి సెలవు తీసుకునే ముందు కేన్ విలియమ్సన్ టాప్ ఫామ్ లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో చెలరేగాడు. నాలుగు ఇన్నింగ్స్ లో ఏకంగా మూడు సెంచరీలు చేశాడు. దీంతో న్యూజిలాండ్ టీమ్ 2-0తో సునాయాసంగా టెస్ట్ సిరీస్ గెలిచింది. 90 ఏళ్లలో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచిన తొలి టెస్ట్ సిరీస్ ఇదే కావడం విశేషం.

న్యూజిలాండ్ టీమ్ లో విలియమ్సన్ తన నాలుగు ఇన్నింగ్స్ లో 118, 109, 43, 133 రన్స్ చేశాడు. తాజాగా రిలీజ్ అయిన టెస్టు ర్యాంకుల్లో విలియమ్సన్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో విలియమ్సన్ ఇప్పటి వరకూ 32 సెంచరీలతోపాటు ఏకంగా 55.9 సగటుతో 8666 రన్స్ చేశాడు. అతడు గురువారం (ఫిబ్రవరి 29) నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కాబోయే తొలి టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

ఇది విలియమ్సన్, కెప్టెన్ సౌథీలకు కెరీర్లో 99వ టెస్ట్ కావడం విశేషం. క్రైస్ట్‌చర్చ్ లో జరగనున్న రెండో టెస్టుకు ఈ ఇద్దరు లెజెండ్స్ తమ 100వ టెస్ట్ ఆడే అవకాశం ఉంది. అయితే గాయం కారణంగా తొలి టెస్టుకు స్టార్ బ్యాటర్ డెవోన్ కాన్వే దూరం అయ్యాడు.

Whats_app_banner