Virat Kohli: “కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నా”: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డెవిలియర్స్-i apologises virat kohli says ab de villiers after his ex rcb teammate misses england tests ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: “కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నా”: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డెవిలియర్స్

Virat Kohli: “కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నా”: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డెవిలియర్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 10, 2024 09:54 PM IST

AB De Villiers on Virat Kohli: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చానని మరోసారి ఆవేదన వ్యక్తం చేశాడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డెవిలియర్స్. ఇంగ్లండ్‍తో మిగిలిన మూడు టెస్టులకు కూడా కోహ్లీ దూరమవడంతో.. ఈ విషయంపై మళ్లీ స్పందించాడు.

Virat Kohli: “కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నా”: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డెవిలియర్స్
Virat Kohli: “కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నా”: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ (PTI)

Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ ఇటీవల భారీ యూటర్న్ తీసుకున్నాడు. విరాట్, అతడి భార్య అనుష్క శర్మ త్వరలో రెండో సంతానాన్ని పొందనున్నారని చెప్పిన అతడు.. అది కరెక్ట్ కాదని పొరపాటు చేశానని అన్నాడు. ఇక, ఇంగ్లండ్‍తో తదుపరి మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఈ తరుణంలో ఈ విషయంలో నేడు (ఫిబ్రవరి 10) మరోసారి మాట్లాడాడు డెవిలియర్స్. కోహ్లీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని తన యూట్యూబ్ ఛానెల్‍ లైవ్‍లో చెప్పాడు. మరిన్ని వ్యాఖ్యలు చేశాడు.

ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. అయితే, విరాట్ త్వరలోనే మళ్లీ తండ్రి కానున్నాడని, అందుకే బ్రేక్ తీసుకున్నాడని డెవిలియర్స్ అప్పుడు చెప్పాడు. అయితే, ఇది నిజం కాదని, పొరపాటున అలా చెప్పానని ఒక రోజులోనే యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్‍తో మిగిలిన మ్యాచ్‍లకు కూడా కోహ్లీ దూరమవటంతో డెవిలియర్స్ మళ్లీ రియాక్ట్ అయ్యాడు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు విరాట్ కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు.

“నా స్నేహితుడు విరాట్ కోహ్లీ ఇంకా అందుబాటులోకి రాలేదు. అతడికి అందరూ ప్రైవసీ ఇవ్వాలని నేను కోరుతున్నా. కుటుంబమే ప్రాధాన్యం. ఏం జరుగుతుందో ఎవరికీ కచ్చితంగా తెలియదు. మనమందరం ఆ నిర్ణయాన్ని గౌరవించాలని చెబుతున్నా. నా ముందటి షోలో నేను చాలా పెద్ద పొరపాటు చేశా. ఇందుకు గాను కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నా” అని డెవిలియర్స్ అన్నాడు. ఐపీఎల్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున చాలా కాలం ఆడాడు డెవిలియర్స్. ఆ సమయంలో కోహ్లీతో అతడికి మంచి స్నేహ బంధం ఏర్పడింది.

కోహ్లీ కోసం వేచిచూస్తున్నా..

కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగి పరుగులు చేయడాన్ని చూసేందుకు వేచిచూస్తున్నా అని ఏబీ డెవిలియర్స్ చెప్పాడు. “నేను పంచుకున్న ఆ సమాచారం కన్ఫర్మ్ చేసుకున్నది కాదు. అతడిని, అతడి కుటుంబాన్ని, ప్రైవేట్ టైమ్‍ను అందరూ గౌరవించాలని నేను అభ్యర్థిస్తున్నా. త్వరలోనే మళ్లీ విరాట్‍ తిరిగి వచ్చి.. సంతోషంగా పరుగులు చేయడాన్ని చూస్తామని ఆశిస్తున్నా” అని డెవిలియర్స్ చెప్పాడు.

బీసీసీఐ ఏం చెప్పిందంటే..

వ్యక్తిగత కారణాలతోనే ఇంగ్లండ్‍తో తదుపరి మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ అందుబాటులో లేడని బీసీసీఐ నేడు (ఫిబ్రవరి 10) ప్రకటించింది. అతడి నిర్ణయానికి పూర్తి మద్దతుగా ఉన్నామని తెలిపింది. “వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్‍లో మిగిలిన మ్యాచ్‍ల సెలెక్షన్‍కు విరాట్ కోహ్లీ అందుబాటులోకి రాలేదు. కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుంది, మద్దతిస్తుంది” అని బీసీసీఐ తెలిపింది. దీంతో పాటు ఇంగ్లండ్‍తో తదుపరి మూడు టెస్టులకు జట్టును ప్రకటించింది.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‍లో రెండు మ్యాచ్‍లు జరిగాయి. 1-1తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. మూడో టెస్టు ఫిబ్రవరి 15న రాజ్‍కోట్‍లో మొదలుకానుంది. ఈ మూడు టెస్టులకు జట్టును నేడు బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ ఉద్వాసన కాగా.. రెండో టెస్టుకు మిస్ అయిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి వచ్చేశారు. అయితే, అప్పటి కల్లా ఫిట్‍నెస్‍ను బట్టి వీరు తుది జట్టులో ఉండనున్నారు. పేసర్ అకాశ్ దీప్ తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.

Whats_app_banner