Gautam Gambhir: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 రిటైర్మెంట్‍పై స్పందించిన గౌతమ్ గంభీర్-gautam gambhir reacts on rohit sharma and virat kohli t20 retirement after winning t20 world cup 2024 title ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gautam Gambhir: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 రిటైర్మెంట్‍పై స్పందించిన గౌతమ్ గంభీర్

Gautam Gambhir: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 రిటైర్మెంట్‍పై స్పందించిన గౌతమ్ గంభీర్

Gautam Gambhir on Virat Kohli, Rohit Sharma: టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించాక ఆ ఫార్మాట్‍కు భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయంపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించారు.

Gautam Gambhir: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 రిటైర్మెంట్‍పై స్పందించిన గౌతమ్ గంభీర్

టీమిండియాకు హెడ్ కోచ్ రేసులో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ముందున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 ముగియటంతో హెడ్ కోచ్ స్థానం నుంచి దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తప్పుకుంటున్నాడు. ప్రపంచకప్ టైటిల్ గెలుపుతో ద్రవిడ్ వైదొలుగుతున్నాడు. ఈ స్థానంలో భారత హెడ్ కోచ్ స్థానం గౌతమ్ గంభీర్ చేపట్టడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఇక, శనివారం ఫైనల్‍లో దక్షిణాఫ్రికాపై గెలిచి టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ అందుకున్నాక.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ క్రికెట్‍కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయంపై గంభీర్ నేడు (జూన్ 30) స్పందించారు.

ఆ రెండు ఫార్మాట్లలో..

టీ20ల నుంచి వైదొలిగినా భారత్‍కు టెస్టులు, వన్డేలను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారని, జట్టు సక్సెస్‍లో వారు కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతారని ఆశిస్తున్నట్టు పీటీఐతో గౌతమ్ గంభీర్ చెప్పాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు అని గంభీర్ అన్నాడు. “వారిద్దరూ గొప్ప ప్లేయర్లు. భారత క్రికెట్‍కు ఎంతో చేశారు. వారిద్దరినీ నేను అభినందించాలనుకుంటున్నా. వాళ్లు ఇంకా వన్డేలు, టెస్టు క్రికెట్ ఆడతారు. దేశం, జట్టు విజయాల్లో వారు కచ్చితంగా భాగస్వామ్యమవుతూ ముందుకు సాగుతారని నేను ఆశిస్తున్నా” అని గౌతమ్ గంభీర్ అన్నాడు.

రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరూ ప్రపంచకప్ టైటిల్‍తో టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చారని, ఇంతంకంటే గొప్ప సందర్భంగా ఏదీ ఉండదేమోనని గౌతమ్ గంభీర్ అన్నాడు. మిగిలిన రెండు ఫార్మాట్లలో భారత్ తరఫున వారిద్దరూ అద్భుతంగా ఆడడం కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పాడు.

గంభీర్‌కు చెప్పేసిన బీసీసీఐ

టీమిండియా హెడ్ కోచ్‍గా ఉండాలని గౌతమ్ గంభీర్‌కు చెప్పినట్టు బీసీసీఐ అద్యక్షుడు రోజర్ బిన్నీ కూడా తాజాగా వెల్లడించారు. ఇప్పటికే గౌతీని బీసీసీఐ ఇంటర్వ్యూ కూడా చేసింది. గంభీర్ కోచ్ అయితే భారత క్రికెట్‍కు మంచి జరుగుతుందని ఏఐఎన్‍ఐతో బిన్నీ చెప్పారు. “గౌతమ్ గంభీర్‌కు చాలా అనుభవం ఉంది. ఒకవేళ అతడు ఈ స్థానాన్ని చేపడితే భారత క్రికెట్‍కు చాలా మంచి విషయం. టీమిండియాకు ఏం కావాలో ఆ అనుభవం అతడి వద్ద ఉంది. మూడు ఫార్మాట్లు ఆడిన కోచ్ ఇండియాకు కావాలి” అని రోజర్ బిన్నీ అన్నారు.

భారత హెడ్ కోచ్ కావడం తనకు కూడా ఇష్టమేనని గతంలోనే గౌతమ్ గంభీర్ వెల్లడించారు. అంతకంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదని అన్నారు. హెడ్ కోచ్‍గా గంభీర్ పేరును బీసీసీఐ ఇప్పటికే ఖరారు చేసిందని కూడా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను శనివారం (జూన్ 29) ఓడింది. 17 ఏళ్ల తర్వాత టీ20 టైటిల్‍ను కైవసం చేసుకుంది. రెండోసారి టీ20 ప్రపంచకప్ పట్టింది. 11ఏళ్ల తర్వాత (2013 చాంపియన్స్ ట్రోఫీ) ఓ ఐసీసీ టైటిల్‍ను కైవసం చేసుకుంది. ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ టీ20లకు గుడ్‍బై చెప్పారు. భావోద్వేగానికి గురయ్యారు. యువ ఆటగాళ్లకు అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో టీ20ల నుంచి తప్పుకున్నారు. భారత్ తరఫున టెస్టులు, వన్డేలు ఆడనున్నారు కోహ్లీ, విరాట్.