Virat Kohli: టీ20లకు విరాట్ కోహ్లీ గుడ్‍బై.. ప్రపంచకప్ పట్టి వీడ్కోలు.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కింగ్: వీడియో
Virat Kohli- T20I Retirement: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు గుడ్‍బై చెప్పాడు. టీ20 ప్రపంచకప్‍లో దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం సాధించాక తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక విరాట్‍ను భారత్ తరఫున వన్డేలు, టెస్టుల్లోనే చూడనున్నాం.
టీమిండియా స్టార్ బ్యాటర్, మోడ్రన్ డే క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున ఇక టీ20లు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. శనివారం (జూన్ 29) బార్బడోస్‍లో దక్షిణాఫ్రికాపై టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది భారత్. అద్భుత అర్ధ శకతం చేసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు తీసుకున్న సమయంలోనే ఇక తాను అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్టు విరాట్ వెల్లడించాడు. ఇక భారత్ తరఫున వన్డేలు, టెస్టులే ఆడనున్నాడు కింగ్ కోహ్లీ.
అద్భుత ఇన్నింగ్స్‌తో వీడ్కోలు
దక్షిణాఫ్రికాపై టీ20 ప్రపంచకప్ ఫైనల్‍లో విరాట్ కోహ్లీ 59 బంతుల్లోనే 76 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 6 ఫోర్లు, 2 సిక్స్‌తో మెరిపించాడు. భారత్ వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో అర్ధ శకతం చేసి దుమ్మురేపాడు. టీమిండియా టైటిల్ పట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది టోర్నీలో అంతగా ఆకట్టుకోలేకపోయినా.. అసలైన ఫైనల్‍లో అదరగొట్టి భారత్ విశ్వవిజేతగా నిలువడంలో సఫలీకృతుడయ్యాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
యువ ఆటగాళ్లకు టీ20లకు అవకాశాలు ఇచ్చేందుకు తాను తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ చెప్పాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకునే టైమ్‍లో ఈ విషయాన్ని చెప్పి షాకిచ్చాడు. “ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్. మేం ఇదే సాధించాలని అనుకున్నాం. అవసరమైన సమయంలో నేను జట్టు కోసం పని చేసి పెట్టా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇదే భారత్‍కు నా చివరి టీ20. ఇందుకే వీలైంత బాగా ఆడాలనుకుంటున్నా. కప్ చేతబట్టాలని అనుకున్నా. ఇది రహస్యం ఏం కాదు. తర్వాతి తరం బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం ఇది. కొందరు అద్భుతమైన ఆటగాళ్లు జట్టును ముందుకు తీసుకెళతారు.. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తారు” అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
కోహ్లీ టీ20 కెరీర్
భారత్ తరఫున విరాట్ కోహ్లీ 125 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍లు ఆడాడు. 48.69 యావరేజ్, 137.04 స్ట్రైక్‍రేట్‍తో 4,188 పరుగులు చేశాడు. టీ20ల్లో ఓ సెంచరీ, 38 అర్ధ శతకాలు చేశాడు కోహ్లీ.
కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ
భారత్ టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ కన్నీరు పెట్టుకున్నాడు. భావోద్వేగంతో గుక్కపట్టి ఏడ్చాడు. కళ్లకు చేతులను అడ్డుపెట్టుకొని కన్నీరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన భార్య అనుష్క శర్మకు వీడియో కాల్ చేసి సంతోషంతో మాట్లాడాడు. తీవ్ర భావోద్వేగంతో కనిపించాడు.
రోహిత్, హార్దిక్, సిరాజ్ కూడా..
దక్షిణాఫ్రికాతో ఫైనల్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా వెక్కివెక్కి ఏడ్చేశారు.
భారత్ 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. 2007లో టీ20 టైటిల్ పట్టిన టీమిండియా.. ఇప్పుడు 17ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ట్రోఫీ కైవసం చేసుకుంది. బార్బడోస్ వేదికగా జరిగిన జరిగిన ఫైనల్‍లో భారత్ 7 పరుగులతో తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.