IPL 2025 Retention: ఐపీఎల్ జట్లు ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు.. ఎన్ని కోట్లు అవుతుంది? ధోనీ విషయంలో గుడ్‍న్యూస్
IPL Retention: ఐపీఎల్ 2025 సీజన్ కోసం రిటెన్షన్ నిబంధనలను గవర్నింగ్ కౌన్సిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు ఎంత మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవచ్చో సమాచారం బయటికి వచ్చింది. రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‍కు ముందు మెగావేలం జరగనుంది. ఈ తరుణంలో ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అవకాశం ఉంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. అలాగే, వేలం కోసం పర్స్ పెంచడం సహా కొన్ని రూల్స్ మారతాయా అనే ఆసక్తి ఉంది. ఈ తరుణంలో రిటెన్షన్ రూల్స్ ఖరారు చేసేందుకు నేడు (సెప్టెంబర్ 28) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమైంది. దీంతో రిటెన్షన్‍కు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి.
రిటైన్ ఎంత మందిని..
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా ఐదు మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని గర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించినట్టు క్రిక్ ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది. ఇందుకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని సమాచారం. ఐదు మందిలో ఎంత మందైనా భారత ప్లేయర్లు, విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు. అలాగే, గరిష్టంగా ఇద్దరు అన్‍క్యాప్డ్ ప్లేయర్‌ను కూడా రిటైన్ చేసుకునే ఛాన్స్ ఫ్రాంచైజీలకు ఉంది. ఇద్దరు అన్‍క్యాప్డ్ ప్లేయర్లను తీసుకుంటే క్యాప్డ్ ప్లేయర్స్ నలుగురికే రిటైన్ ఛాన్స్ ఉంటుంది. ఒక అన్‍క్యాప్డ్ ఆటగాడిని తప్పకుండా రిటైన్ చేసుకోవాలి. మొత్తంగా ఆరుగురు ప్లేయర్లను ఒక్కో ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవచ్చు.
రిటెన్షన్‍కు భారీ ఖర్చు
ఐదుగురు ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవాలంటే రూ.75 కోట్లను తమ పర్స్ నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూ.120కోట్ల పర్సులో సింహ భాగం దీనికే పెట్టాల్సి ఉంటుంది. తొలి రిటెన్షన్‍కు రూ.18 కోట్లు, రెండో రిటెన్షన్‍కు రూ.14 కోట్లు, మూడో ప్లేయర్ రిటెన్షన్‍కు రూ.11కోట్లు, మిగిలిన రెండు రిటెన్షన్‍లకు రూ.18 కోట్లు, రూ.14 కోట్లను ఖర్చు చేయాలి. అంటే ఐదు రిటెన్షన్‍ల కోసం ఏకంగా రూ.75 కోట్లను ఫ్రాంచైజీలు వెచ్చించాలి.
అన్‍క్యాప్డ్ ప్లేయర్ కోసం రూ.4కోట్లను రిటెన్షన్ కోసం ఐపీఎల్ టీమ్ చెల్లించాలి. అంటే మొత్తంగా ఆరుగురిని రిటైన్ చేసుకుంటే రూ.79కోట్లను ఫ్రాంచైజీ ఖర్చు చేయాలి. మెగా వేలం కోసం పర్సులో కేవలం రూ.41 కోట్లు మాత్రమే ఉంటాయి. దీంతో ముఖ్యమైన ప్లేయర్లనే ఫ్రాంచైజీలు ఈసారి అట్టిపెట్టుకునే అవకాశం ఉంది.
ధోనీ అభిమానులకు గుడ్‍న్యూస్
మహేంద్ర సింగ్ ధోనీని అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే అవకాశం వచ్చింది. ఈ మేరకు ఐపీఎల్ మండలి పాత నిబంధనను తీసుకొచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఐదేళ్లు అయిన భారత ఆటగాళ్లను అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా గుర్తించే రూల్‍ను 2008లో బీసీసీఐ తెచ్చింది. 2021 తర్వాత దాన్ని తీసేసింది. అయితే, ఆ నిబంధనను ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చింది. దీంతో అన్‍క్యాప్డ్ ఆటగాడిగా రూ.4కోట్లకు ధోనీని చెన్నై రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. దీంతో ధోనీ వచ్చే సీజన్ ఆటగాడిగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇది మహీ అభిమానులకు గుడ్‍న్యూస్‍గా ఉండనుంది.
ఐపీఎల్ 2025 సీజన్‍లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‍ను కొనసాగించేందుకే గవర్నింగ్ కౌన్సిల్ మొగ్గుచూపిందని తెలుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‍ను వ్యతిరేకించారు. అయినా వచ్చే సీజన్‍కు ఇంపాక్ట్ రూల్ ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మ్యాచ్ ఫీజ్ పద్ధతి కూడా రానుందని తెలుస్తోంది. ఈ విషయాలను బీసీసీఐ అధికారికంగా త్వరలో ప్రకటించనుంది.