IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీతో పాటు రిటెన్షన్ రూల్స్‌పై ఈరోజు క్లారిటీ
IPL 2025 Auction date: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ప్లేయర్లు, ఫ్రాంఛైజీలతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కనీసం 5-6 ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించాలని గవర్నింగ్ కౌన్సిల్‌ను ఫ్రాంఛైజీలు కోరుతున్నాయి.
IPL 2025 retention rules: ఐపీఎల్ 2025 మెగా వేలం గురించి గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? అలాగే ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు అనుమతి ఇస్తారు? అనే ప్రశ్నలు చాలా రోజులుగా క్రికెట్ సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.
ఈ ప్రశ్నలన్నింటికీ ఈరోజు సమాధానం దొరికే అవకాశం ఉంది. శనివారం (సెప్టెంబర్ 28)న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుండగా, అంతకు ముందు ఫ్రాంచైజీలు తమ కోర్ టీమ్‌ను కాపాడుకోవడానికి కొంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని గత కొన్నిరోజులుగా కోరుతున్నాయి.
బెంగళూరులో మీటింగ్
క్రిక్‌బజ్ ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు బెంగళూరులోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరగనుంది. శుక్రవారం సాయంత్రం ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం ఫ్రాంఛైజీలు సభ్యులకు పంపారని తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీ, వేదికతో పాటు ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యపై కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. నవంబర్ నెలాఖరులో గల్ఫ్ నగరంలో ఈ మెగా వేలం జరుగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు తేదీపై కూడా క్లారిటీరానుంది.
ఆతిథ్యానికి సౌదీ అరేబియా రెడీ
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఆతిథ్యం ఇవ్వడానికి సౌదీ అరేబియా కూడా ఆసక్తి చూపుతోందని, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపితే వేదికకి లైన్ క్లియర్‌కానుంది. ఇక ఫ్రాంఛైజీలకి ఆర్టీఎం ఆప్షన్‌తో కలిసి 5 నుంచి 6 మంది ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశాన్ని బీసీసీఐ ఇవ్వబోతన్నట్లు సమాచారం.
ఐపీఎల్ రిటెన్షన్ విధానం ఆధారంగా కొంత మంది ప్లేయర్ల ఐపీఎల్ భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ పాలసీలో మార్పులను కోరుతున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఫ్రాంఛైజీలు కూడా తమ కోర్ టీమ్‌ను కాపాడుకోవడానికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.
ఐపీఎల్ 2024 విజేత కోల్‌కతా
ఐపీఎల్ 2024 సీజన్ ఈ ఏడాది మార్చి 22 నుంచి మే 26 వరకు జరిగింది. ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. దాంతో ఐపీఎల్ 2025 సీజన్ మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, హైదరాబాద్ మధ్య జరగనుంది.