MS Dhoni Vacation: ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేసిన ధోనీ: ఫొటోలు పోస్ట్ చేసిన సాక్షి
MS Dhoni Vacation: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇటలీలో తన కుటుంబంతో కలిసి విహరిస్తున్నాడు. ఈ ఫొటోలను అతడి భార్య సాక్షి ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ.. వచ్చే ఏడాది ఐపీఎల్ 2025 సీజన్ ఆడతాడా లేదా అనే విషయంపై ఇప్పటి నుంచే ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది తర్వాత ఐపీఎల్‍కు కూడా ధోనీ గుడ్‍బై చెబుతాడనే అంచనాలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టే ఈ ఏడాది ఐపీఎల్‍లో చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొని.. రుతురాజ్ గైక్వాడ్‍కు ఆ బాధ్యతలు ఇచ్చాడు ధోనీ. అయితే, ఐదుసార్లు చాంపియన్ సీఎస్‍కే ఈసారి లీగ్ దశలోనే నిష్క్రమించింది. దీంతో ఎంఎస్ ధోనీ నిరాశ చెందాడు. అయితే, ప్రస్తుతం కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు ధోనీ.
ఇటలీలో విహారం
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ రెండో ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఇటలీలో జరుగగా.. ఈ సెలెబ్రేషన్లకు మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబ సమేతంగా వెళ్లాడు. ఈ వేడుక ముగిశాక ఇటలీలోని పలెర్మో సిటీలో విహరించాడు ధోనీ. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి వెకేషన్‍లో సంతోషంగా గడిపాడు.
ఇటలీలో తాము దిగిన కొన్ని ఫొటోలను ధోనీ భార్య సాక్షి నేడు (జూన్ 3) ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. ఆ సిటీలోని ఓ చారిత్రక ప్రదేశానికి వారు వెళ్లారు. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత ధోనీ, సాక్షి, జీవా ఓ రెస్టారెంట్‍కు వెళ్లి తిన్నారు. ఈ ఫొటోలను కూడా సాక్షి షేర్ చేశారు. సముద్రం వద్ద సూర్యాస్తమయం ఫొటోను కూడా పోస్ట్ చేశారు.
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు గత వారం ఇటలీలో జరిగాయి. ఈ సెలెబ్రేషన్లకు చాలా మంది సినీ, స్పోర్ట్స్ సహా చాలా రంగాలకు చెందిన సెలెబ్రిటీలు పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ గుజరాత్‍లో అత్యంత ఘనంగా వీరి ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్లు జరిగాయి. కాగా, అనంత్ - రాధిక వివాహం ఈ ఏడాది జూలై 12న ముంబైలో జరగనుంది.
ఐపీఎల్ 2024లో చెన్నైకు నిరాశ
ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నిరాశే ఎదురైంది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‍లో ఓటమి పాలై లీగ్ దశలోనే నిష్క్రమించింది. బెంగళూరుపై తన చివరి లీగ్ మ్యాచ్‍లో ఓడి టోర్నీ నుంచి ఔట్ అయింది. కెప్టెన్‍గా సీఎస్‍కేకు ఐదు టైటిళ్లు అందించిన ధోనీ ఇక లాస్ట్ సీజన్ ఆడేశాడంటూ అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ సీజన్‍లో చెన్నై నిష్క్రమించటంతో ఎంఎస్ ధోనీ నిరాశచెందినట్టు కనిపించాడు. ఆర్సీబీ మ్యాచ్ ముగిసిన వెంటనే రాంచీకి వెళ్లిపోయాడు. తన కుటుంబంతో సమయం గడిపాడు. రాంచీలో బైక్ నడుపుతూ కూడా కనిపించాడు.
వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడాలా లేదా అనేది ధోనీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాల ఇటీవలే చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరో రెండు నెలల సమయాన్ని మహీ అడిగాడని వెల్లడైంది. ధోనీ ఏ నిర్ణయం తీసుకున్నా జట్టుకు ప్రయోజనరకంగా ఉండేలా చేస్తాడని సీఎక్‍కేకు చెందిన ఓ అధికారి చెప్పినట్టు సమాచారం బయటికి వచ్చింది. మరి ధోనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.