IND vs BAN T20 Match: భారత్‌తో టీ20 మ్యాచ్ ముంగిట.. బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ షాకింగ్ నిర్ణయం-former bangladesh skipper mahmudullah announces retirement from t20i ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban T20 Match: భారత్‌తో టీ20 మ్యాచ్ ముంగిట.. బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ షాకింగ్ నిర్ణయం

IND vs BAN T20 Match: భారత్‌తో టీ20 మ్యాచ్ ముంగిట.. బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ షాకింగ్ నిర్ణయం

Galeti Rajendra HT Telugu
Oct 09, 2024 08:30 AM IST

Mahmudullah Retirement: భారత్‌తో కీలకమైన రెండో టీ20 ముంగిట బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ మహ్మదుల్లా టీ20లకి గుడ్ బై చెప్పేశాడు. దాదాపు 17 ఏళ్ల పాటు టీ20ల్లో మహ్మదుల్లా ఆడాడు.

మహ్మదుల్లా
మహ్మదుల్లా (X)

భారత్‌తో కీలకమైన రెండో టీ20 ముంగిట బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌‌రౌండర్ మహ్మదుల్లా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తాను అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య బుధవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

మహ్మదుల్లా రికార్డులిలా

38 ఏళ్ల మహ్మదుల్లా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించడంతో పాటు మూడు ఫార్మాట్లలోనూ నమ్మదగిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. బంగ్లాదేశ్ తరఫున మహ్మదుల్లా 50 టెస్టులు, 232 వన్డేలు, 139 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 2914, 5386, 2394 పరుగులు కూడా చేశాడు.

బ్యాట్‌తోనే కాదు.. బౌలింగ్‌లోనూ బంగ్లాదేశ్ టీమ్‌‌ను ఎన్నో మ్యాచ్‌ల్లో మహ్మదుల్లా గెలిపించాడు. అతను మూడు ఫార్మాట్లలోనూ 43 (టెస్టుల్లో), 82 (వన్డేల్లో), 40 (టీ20ల్లో) వికెట్లు కూడా పడగొట్టాడు. మహ్మదుల్లా 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

బౌలర్‌ నుంచి ఆలౌ‌రౌండర్‌గా

సనత్ జయసూర్య, కెవిన్ పీటర్సన్, షోయబ్ మాలిక్, స్టీవ్ స్మిత్ ల మాదిరిగానే మహ్మదుల్లా కూడా బౌలర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆల్ రౌండర్‌గా నిలదొక్కుకున్నాడు. అయితే.. గత ఆదివారం భారత్‌తో జరిగిన తొలి టీ20లో రెండు బంతులాడి ఒక్క పరుగుకే మహ్మదుల్లా ఔటైపోయాడు. దాంతో కెప్టెన్ శాంటో అతనికి గట్టిగా చురకలు అంటించినట్లు తెలుస్తోంది.

ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌పై 103 పరుగులు చేసి బంగ్లాదేశ్‌ను తొలిసారి నాకౌట్ కు తీసుకెళ్లిన ఘనత మహ్మదుల్లాకి దక్కింది. 2021లో టెస్టు క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేసిన మహ్మదుల్లా.. ఇప్పుడు టీ20ల నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో మరికొంతకాలం అతను బంగ్లాదేశ్ తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడనున్నాడు.

17 ఏళ్ల నుంచి టీ20ల్లో

2023లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ తరఫున మహ్మదుల్లా అత్యధిక పరుగులు చేశాడు. 2007లో కెన్యాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఆడిన మహ్మదుల్లా ఈ ఫార్మాట్‌లో సుదీర్ఘ కాలం ఆడిన ప్లేయర్లలో ఒకడు. మహ్మదుల్లా టీ20 కెరీర్ 17 ఏళ్ల పాటు కొనసాగడం గమనార్హం.

భారత్ జట్టుతో ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి బంగ్లాదేశ్ రెండో టీ20లో తలపడనుంది. ఇప్పటికే తొలి టీ20లో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ టీమ్.. ఈ మ్యాచ్‌లో పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని ఆశిస్తోంది. రిటైర్మైంట్ ప్రకటించిన మహ్మదుల్లా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. తొలి టీ20లో బ్యాటింగ్‌ మాత్రమే చేసి మహ్మదుల్లా.. ఈరోజు బౌలింగ్ కూడా చేస్తాడేమో చూడాలి.

భారత్‌తో ఈ మూడు టీ20ల సిరీస్ తన‌కి కెరీర్‌లో ఆఖరిదని మహ్మదుల్లా స్పష్టంగా ప్రకటించాడు. దాంతో అతనికి సిరీస్ విజయంతో వీడ్కోలు పలకాలని బంగ్లాదేశ్ ఆశించొచ్చు. 

 

 

 

 

Whats_app_banner