Vaibhav Suryavanshi: క్రికెట్‌లో 13 ఏళ్ల వయసులోనే వరల్డ్ రికార్డ్ బ్రేక్.. ఎవరీ సూర్యవంశీ?
Vaibhav Suryavanshi Record: 13 ఏళ్ల వయసులోనే భారత్‌కి చెందిన వైభవ్ సూర్యవంశీ టెస్టుల్లో సెంచరీతో కదం తొక్కాడు. ఈ చిచ్చరపిడుగు కేవలం 58 బంతుల్లోనే 100 పరుగులు చేసి.. 11 ఏళ్ల రికార్డ్‌ను కనుమరుగు చేశాడు.
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ రెండో రోజు ఆటలో భారత అండర్-19 జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఫాస్ట్ సెంచరీతో చెలరేగాడు. 62 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసిన సూర్యవంశీ.. చివరికి రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే? సూర్యవంశీ వయసు కేవలం 13 ఏళ్లే.
మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ బాదినా.. భారత్ మాత్రం మెరుగైన స్కోరుని అందుకోలేకపోయింది. అయితే.. ఈ సెంచరీతో క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డును సూర్యవంశీ నెలకొల్పాడు. ఏ ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్‌లోనైనా సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ నిలిచాడు. 13 ఏళ్ల 241 రోజుల వయసులో వైభవ్ ఈ సెంచరీ సాధించాడు.
11 ఏళ్ల వరల్డ్ రికార్డ్ బ్రేక్
ఇప్పటి వరకు ఈ వరల్డ్ రికార్డ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన నజ్ముల్ హుస్సేన్ శాంటో పేరిట ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న శాంటో 2013లో యూత్ వన్డే ఇంటర్నేషనల్‌లో కేవలం 14 ఏళ్ల 241 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఈ రికార్డ్‌లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నాడు. బాబర్ 2009లో యూత్ వన్డేలో 15 ఏళ్ల 48 రోజుల వయసులో శతకం నమోదు చేశాడు.
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అండర్-19 టీమ్ 293 పరుగులకి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ సూర్యవంశీ.. నిలకడగా ఆడి భారత యువ జట్టు పరువు నిలిపాడు. ఓపెనర్ విహాన్ మల్హోత్రా (76)తో కలిసి తొలి వికెట్ కు 133 పరుగులు జోడించి.. టీమ్ స్కోరు 203 పరుగుల వద్ద అనూహ్యరీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ బ్రౌన్ 79 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, భారత సంతతికి చెందిన లెగ్ స్పిన్నర్ రామ్ కుమార్ 79 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. బీహార్‌కి చెందిన సూర్యవంశీ.. ఎడమచేతి వాటం బ్యాటర్, ఎడమ చేతి వాటం ఉపయుక్తమైన స్పిన్నర్ కూడా. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది.